Begin typing your search above and press return to search.

మోడీతో కేసీఆర్ మంత‌నాలు ఇందుకేనా?

By:  Tupaki Desk   |   19 Jun 2018 5:00 AM GMT
మోడీతో కేసీఆర్ మంత‌నాలు ఇందుకేనా?
X
రాజ‌కీయాల్లో ఏది ఉత్త‌నే చోటు చేసుకోదు. ఆత్మాభిమానం ట‌న్నులు ట‌న్నులుగా ఉన్న‌ట్లు చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి లాంటి అధినేత ఊరికే ఏ ప‌ని చేయ‌రు. అయితే ఫాం హౌస్ లో.. లేదంటే ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఉండే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం దాటి వెళ్ల‌టం అరుదే. ఒక‌వేళ వెళ్లినా దానికి కార‌ణాలు త‌ప్ప‌నిస‌రిగా ఉంటాయి. ఎంతో ముఖ్య‌మైతే త‌ప్పించి రాష్ట్రాన్ని వ‌దిలి వెళ్ల‌టానికి ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్‌.. ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా త‌న కొడుకు క‌మ్ మంత్రి కేటీఆర్ ను పంపి స‌ర్దుబాటు చేస్తుంటారు. ఒక‌వేళ కేటీఆర్ కు కుద‌ర‌కున్నా.. ఆయ‌న స‌బ్జెక్ట్ కాకుంటే రంగంలోకి దింపేందుకు హ‌రీశ్ ఎప్పుడూ రెఢీగా ఉంటారు. ఇలా హేమాహేమీలు చేతిలో ఉన్న‌ప్ప‌డు.. అన‌వ‌స‌రంగా ఆయాస‌ప‌డ‌టం కేసీఆర్‌ కు అస్స‌లు ఇష్టం ఉండ‌ద‌ని చెబుతారు.

తాను రంగంలోకి దిగ‌కుండా.. త‌న వాళ్ల‌తో బండి న‌డిపించే కేసీఆర్ లాంటి ముఖ్య‌మంత్రి.. ప్ర‌ధాని అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయిన ప‌దిరోజుల వ్య‌వ‌ధిలోనే మ‌రోసారి ఢిల్లీ వెళ్లి భేటీ కావ‌టం మామూలు విష‌యం కాదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలుగు మీడియాలో శోధించి వార్త‌లు రాయ‌టం కంటే ప్రెస్ నోట్ల‌ను న‌మ్ముకొని బండి లాగించే బాప‌తు ఎక్కువైంది.

ఏదైనా జ‌రిగితే.. అదెందుకు జ‌రిగింది? దాని వెనుక కార‌ణం ఏమై ఉంటుంద‌న్న ప్రాథ‌మిక ఉత్సుక‌త సైతం త‌గ్గిపోతున్న దుస్థితి. ఇలాంటి వేళ‌.. ఏం జ‌రిగినా.. దానికి కార‌ణాలు వెతికే ఉత్సాహం రిపోర్ట‌ర్ల‌కు ఉండ‌టం లేదు. ఎవ‌రైనా కాస్త చొర‌వ చేసుకొని న‌డుం బిగిస్తే.. మిగిలిన మీడియా ఆ వెన‌కాల వెళ్ల‌టం అప్పుడ‌ప్పుడు చోటు చేసుకుంటూ ఉంటుంది.

కాస్త అటు ఇటుగా రెండు వారాల వ్య‌వ‌ధిలోనే రెండుసార్లు కేసీఆర్ ఢిల్లీకి వెళ్ల‌టం మాటలు కాదు. తాను ఢిల్లీకి వెళ్లే ముందు మ‌రే రాష్ట్రంలో క‌నిపించ‌ని రీతిలో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో అదే ప‌నిగా చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం క‌నిపిస్తుంది. అయితే.. దీనికి ప్ర‌ధాన మీడియా చెప్పే మాట‌లు వేరుగా ఉంటాయ‌నుకోండి.

ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ప్ర‌ధాని మోడీని క‌ల‌వ‌టం.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు.. పెండింగ్ ఇష్యూల మీద చ‌ర్చించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఈ వార్త‌ల‌న్నీ ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన ప్రెస్ నోట్ ఆధారంగానేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కీ.. మోడీని క‌లిసేందుకు కేసీఆర్ అంత త‌హ‌త‌హ‌ను ఎందుకు ప్ర‌ద‌ర్శించిన‌ట్లు.. తాను మోడీని క‌లిసేందుకు ఢిల్లీకి వెళ్లినా.. విదేశీ ప‌ర్య‌ట‌న కోస‌మంటూ టైమివ్వ‌ని ప్ర‌ధాని మోడీని మ‌ళ్లీ క‌లిసేందుకు అంత‌గా త‌పించ‌టం వెనుక కార‌ణం ఏమి ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల క‌థ‌నం ప్ర‌కారం రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌విని త‌మ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత క‌మ్ ఎంపీ కె. కేశ‌వ‌రావుకు ఇచ్చేలా కేసీఆర్ పావులు క‌దుపుతున్న‌ట్లుగా చెబుతున్నారు. డిఫ్యూటీ ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కురియ‌న్ ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది.

ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ గా బీజేపీయేత‌ర పార్టీకి అవ‌కాశ‌మిస్తే అది త‌మ‌కివ్వాల‌న్న‌ది కేసీఆర్ అప్పీల్ గా చెబుతున్నారు. ఇందులో భాగంగానే మోడీతో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లుగా చెబుతున్నారు. త‌న తాజా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మోడీని క‌లిసి కేసీఆర్‌.. రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌విని త‌మ పార్టీ ఎంపీకి ఇవ్వాల‌న్న మాట‌ను కూడా చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. రాజ్య‌స‌భ‌లో పూర్తిస్థాయిలో మెజార్టీ లేని బీజేపీకి అండ‌గా నిలిచేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్న వేళ‌.. అందుకు ప్ర‌తిగా త‌మ‌కీ ప‌ద‌విని ఇవ్వాల‌న్న మాట‌ను కేసీఆర్ కోరిన‌ట్లుగా చెబుతున్నారు.

రాజ్య‌స‌భ స‌భాప‌తిగా ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు వ్య‌వ‌హ‌రిస్తున్న వైనం తెలిసిందే.డిప్యూటీ ఛైర్మ‌న్ గా త‌మ‌కు అవ‌కాశం క‌ల్పిస్తే.. బీజేపీయేత‌ర పార్టీకి మోడీ అండ్ కో ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లుగా అవుతుంది. లోక్ స‌భ‌లోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంది. లోక్ స‌భ స్పీక‌ర్ గా బీజేపీకి చెందిన సుమిత్రా మ‌హాజ‌న్ ఉంటే.. డిప్యూటీ స్పీక‌ర్ గా అన్నాడీఎంకేకు చెందిన తంబిదురైని ఎంపిక చేశారు. ఇదే సంప్ర‌దాయాన్ని రాజ్య‌స‌భ‌లోనూ అమ‌లు చేసే అల‌వాటు ఉంది.

ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌విని త‌మ‌కు అప్ప‌గించాల‌ని ప్ర‌ధాని మోడీని ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోరిన‌ట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ప్ర‌తిపాద‌న‌కు మోడీ సుముఖంగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం మిత్రులంతా ఎవ‌రికి వారుగా వెళ్లిపోతున్న వేళ‌.. కొత్త మిత్రులను ద‌గ్గ‌ర‌కు చేర్చుకోవాల‌ని త‌పిస్తున్న మోడీకి.. కేసీఆర్ ప్ర‌తిపాద‌నపై ఎంతోకొంత సానుకూలంగా వ్య‌వ‌హ‌రించే వీలుంద‌ని చెబుతున్నారు. మ‌రి.. మోడీ ఏం చేస్తారో చూడాలి.