Begin typing your search above and press return to search.

ఆ కార్డు మీద మోడీ ఫోటోకు కేసీఆర్ నో!

By:  Tupaki Desk   |   17 July 2018 6:27 AM GMT
ఆ కార్డు మీద మోడీ ఫోటోకు కేసీఆర్ నో!
X
ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆరోగ్య ప‌థ‌కంగా అభివ‌ర్ణిస్తున్న మోడీ కేర్ ప‌థ‌కంలోకి తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు చేరేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌టం లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. ఆ ఫ‌థ‌కానికి సంబంధించిన ఫైల్‌ ను సీఎం కేసీఆర్ ప‌క్క‌న పెట్టేసిన‌ట్లు తెలుస్తోంది. ఆగ‌స్టు 15 నుంచి దేశ వ్యాప్తంగా అత్యంత భారీ ప్ర‌చారంతో ఈ ప‌థ‌కాన్ని లాంఛ్ చేయాల‌ని మోడీ స‌ర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌తో కేంద్రం ఇప్ప‌టికే ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే.. ఇందుకు కొన్ని రాష్ట్రాలు మాత్రం అంగీక‌రించ‌టం లేదు. ఇ్ప‌టివ‌ర‌కూ 25 రాష్ట్రాలు.. కేంద్ర‌పాలిత ప్రాంతాలు మోడీ కేర్ పై కేంద్ర స‌ర్కారుతో ఒప్పందం కుదుర్చుకుంది. అదే స‌మ‌యంలో తెలంగాణ‌.. త‌మిళ‌నాడు రాష్ట్రాలు మాత్రం ఈ ప‌థ‌కంలో చేర‌లేదు. ఇందుకు కార‌ణం.. మోడీ కేర్ ప‌థ‌కంతో మైలేజ్ మొత్తం మోడీకే త‌ప్పించి.. త‌మ వాటా ఖ‌ర్చు చేసిన ప్ర‌భుత్వాల‌కు పెద్ద‌గా పేరు రాకపోవ‌ట‌మేన‌ని చెబుతున్నారు.

ఈ అంశంపై లోతుగా అధ్య‌య‌నం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. మోడీ కేర్ తో రాష్ట్రాల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం ల‌భించ‌ద‌ని.. పేద‌ల‌కు సైతం పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌ద‌న్న అభిప్రాయంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన కుటుంబానికి ఏడాదికి రూ.5ల‌క్ష‌ల చొప్పున 10 కోట్ల కుటుంబాల‌కు ఈ ప‌థ‌కం కింద ఆరోగ్య బీమాను క‌ల్పిస్తారు. ఆరోగ్య మిత్ర మాదిరే ఆయుష్మాన్ మిత్రుల‌ను ఏర్పాటు చేస్తారు.

ఈ ప‌థ‌కం కార‌ణంగా కేంద్రానికే ప్ర‌యోజ‌నం త‌ప్పించి.. రాష్ట్రాల‌కు ఏమాత్రం లాభం ఉండ‌ద‌న్న‌ది కేసీఆర్ అభిప్రాయంగా చెబుతున్నారు. దీనికి ఆయ‌న త‌న‌దైన వాద‌న‌ను వినిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ విష‌యానికే వ‌స్తే మోడీ కేర్ పథ‌కంలో తెలంగాణ‌లో 26 ల‌క్ష‌ల కుటుంబాలు అర్హులుగా తేల్చింది. ఇందుక‌య్యే వ్య‌యం రూ.354 కోట్లు అని.. అందులో 60 శాతం కేంద్రం.. 40 శాతం రాష్ట్ర స‌ర్కారు భ‌రించాల్సి ఉంటుంది. అంటే.. కేంద్రం వాటా ర‌.212 కోట్లు.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కింద రాష్ట్ర స‌ర్కారు ఏడాదికి రూ.700 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది. ఇదే స‌మ‌యంలో మోడీ కేర్ ను మీద వేసుకుంటే మ‌రింత భారం పెర‌గ‌టం ఖాయం. ఒక‌వేళ‌.. మోడీ కేర్ తో కలిసి వెళ‌దామంటే.. కార్డుల మీద మోడీ ఫోటో త‌ప్ప‌నిస‌రిగా వేయాల‌న్న మాట‌ను కేంద్రం స్ప‌ష్టంగా చెబుతోంది.

ఈ లెక్కన రూ.212 కోట్లు ఖ‌ర్చు చేసే కేంద్రం మోడీ బొమ్మ‌ను ఈ ప‌థ‌కంపై ప్ర‌ముఖంగా వేసుకుంటే.. ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్న ఆరోగ్య‌శ్రీ‌తో పాటు.. మోడీ కేర్ కోసం రాష్ట్రం ఖ‌ర్చు చేసే మొత్తం దాదాపుగా రూ.830 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. ఇంత భారీ మొత్తంలో ఖ‌ర్చు చేస్తూ.. కేవ‌లం రూ.212 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసే కేంద్రానికి మోడీ ఫోటోను ప్ర‌ముఖంగా వేయాల్సిన అవ‌స‌రం ఏమిట‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

ఎన్నిక‌ల ఏడాదిలో మోడీకి అవ‌కాశం ఇస్తే.. హెల్త్‌ కార్డుల‌కు సంబంధించిన మైలేజీ మొత్తాన్ని త‌మ ఖాతాలో వేసుకుంటార‌న్న భావ‌న కేసీఆర్ లో ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మోడీ కేర్ ఫైల్‌ ను సీఎం కేసీఆర్ ప‌క్క‌న పెట్టిన‌ట్లుగా స‌మాచారం. మోడీ కేర్ ను ద‌క్షిణాదిన త‌మిళ‌నాడు.. తెలంగాణ రాష్ట్రాలు వ్య‌తిరేకిస్తుంటే.. ఉత్త‌రాదిన ప‌లు రాష్ట్రాలు నో చెప్పేస్తున్నాయి. ఈ ప‌థ‌కాన్ని పంజాబ్ ఇప్ప‌టికే వ్య‌తిరేకించింది. ఒడిశా.. బెంగాల్‌.. ఢిల్లీ ప్ర‌భుత్వాలు సైతం నో చెబుతున్నారు. చివ‌ర‌కు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మ‌హారాష్ట్ర.. రాజ‌స్థాన్ లు సైతం పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌టం లేదు. ఎందుకంటే.. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ‌దైన ఆరోగ్య ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌టం కార‌ణంగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం అమ‌లు ఉత్సాహం క‌లిగించ‌టం లేద‌న్న మాట ప్రైవేటు ఆసుప‌త్రులు చెబుతున్నాయి. మోడీ కేర్ లో న‌మోదు చేయించుకునేందుకు ఆసుప‌త్రులు ఉత్సాహంగా లేవు. దీనికి కార‌ణం.. క‌వ‌రేజ్ లో వివిధ శ‌స్త్ర‌చికిత్స‌ల‌కు ఇచ్చే మొత్తం త‌క్కువ‌గా ఉండ‌ట‌మేన‌ని చెబుతున్నారు.ఈ మొత్తాల్ని తీసుకుంటే త‌మ‌కు గిట్టుబాటు కావ‌ని వారు చెబుతున్నారు. మ‌రీ ప‌రిస్థితుల్లో మోడీ కేర్ ను ముందుకెలా తీసుకెళ‌తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.