Begin typing your search above and press return to search.

వీరితోనే దుర్మార్గ డేరా బాబాకు అష్ట‌దిగ్బంధ‌నం

By:  Tupaki Desk   |   29 Aug 2017 5:17 PM GMT
వీరితోనే దుర్మార్గ డేరా బాబాకు అష్ట‌దిగ్బంధ‌నం
X
భ‌క్తి ముసుగులో ఆరాచ‌కం సృష్టించిన డేరా బాబా ఆరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తుంటే దేశ ప్ర‌జ‌ల నోట మాట రాని ప‌రిస్థితి. తన ఆశ్ర‌మంలో త‌న సేవ కోసం ఉండే సాధ్వీలపై అత్యాచారం చేసిన ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ముఖం సైతం క‌నిపించ‌కుండా తెల్ల‌టి వ‌స్త్రాల్ని నిండుగా ధ‌రించే వారిని.. నాలుగు గోడ‌ల మ‌ధ్య ఆట‌బొమ్మ‌లుగా మార్చేసుకొని.. త‌న‌కు తోచిన‌ట్లుగా వికార‌పు చేష్ట‌లు చేసిన దుర్మార్గం బ‌ద్ధ‌లైన సంగ‌తి తెలిసిందే.

త‌న మాట విన‌ని వారిని.. త‌న దుర్మార్గాల్ని బ‌య‌ట‌కు తెస్తార‌న్న అనుమానం ఉన్న వారిని మ‌రో ఆలోచ‌న లేకుండా అంతం చేసిన వైనాలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇద్ద‌రు సాధ్వీల మీద అత్యాచారం జ‌రిపార‌న్న ఆరోప‌ణ‌ల మీద సుదీర్ఘ‌కాలం (15 ఏళ్ల పాటు) విచార‌ణ జ‌రిపిన అనంత‌రం.. తాజాగా డేరా బాబా చేసిన త‌ప్పులు నిరూపిత‌మై.. సీబీఐ ప్ర‌త్యేక కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష‌విధించ‌టం తెలిసిందే. దేవుని అవ‌తారంగా త‌న‌ను తాను చెప్పుకునే డేరా బాబా.. చివ‌ర‌కు త‌న‌ను విడిచిపెట్టాలంటూ జైలులో ఏర్పాటు చేసిన కోర్టు హాలులో భోరున విలపించేలా ఎవ‌రు చేశారు? అన్న ప్ర‌శ్న వేసుకుంటే ఎనిమిది మంది దీనికి కార‌ణంగా చెప్పొచ్చు. డేరా దుర్మార్గాల్ని అష్ట‌దిగ్బంధ‌నం చేసిన ఈ ఎనిమిది మంది ఎవ‌ర‌న్న‌ది చూస్తే..

1. ఇద్ద‌రు సాధ్వీలు

డేరా బాబా అడ్డా అయిన స‌చ్ఛా సౌధాలో ఉంటున్న ఓ సాధ్వీ త‌న‌పై అత్యాచారం జ‌రిపారంటూ నాటి ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజపేయ్‌కు లేఖ ద్వారా తెలిపారు. ఆ లేఖ‌ను పంజాబ్‌.. హర్యానా హైకోర్టుల సుమోటోగా తీసుకొని సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించాయి. ఇదే తీరులో త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై మ‌రో సాధ్వీ ధైర్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చి ఆశ్ర‌మంలో జ‌రిగిన దారుణాన్ని చెప్పారు. వీరిద్ద‌రూ చెప్పిన విష‌యాల్ని అంగీక‌రించేందుకు ఆశ్ర‌మంలోని మ‌రే ఇత‌ర సాధ్వీలు ముందుకు రాలేదు. బాబాపై కేసు న‌మోదు అయ్యాక.. వంద‌ల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి మ‌రీ డేరా బాబా దుర్మార్గాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చెప్పి.. కోర్టుకు కీల‌క సాక్ష్యాల్ని అందించారు.

2. రంజిత్ సింగ్‌

అత్యాచారానికి గురైన ఓ సాధ్వీకి స్వ‌యాన అన్న‌. త‌న సోద‌రికి దారుణ అన్యాయం జ‌రిగిన‌ప్పుడు అత‌ను డేరా సౌధాలో ఉన్న‌త స్థానంలో ప‌ని చేస్తున్నారు. త‌న చెల్లికి జ‌రిగిన అన్యాయం గురించి తెలుసుకొని ఆకాశ‌రామ‌న్న ఉత్త‌రాన్ని రాసి దాన్ని ఓ స్థానిక ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మ‌య్యేలా చేశారు. ఈ లేఖ వ‌చ్చిన కొద్ది రోజుల‌కే రంజిత్ సింగ్ హ‌త్య‌కుగురి కావ‌టం గ‌మ‌నార్హం. ఇది కూడా డేరా బాబా చేయించార‌న్న ఆరోప‌ణ ఉంది. దీనికి సంబంధించిన కేసు విచార‌ణ ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది.

3. రామ్ చంద‌ర్ ఛ‌త్ర‌ప‌తి

హ‌ర్యానాలో వెలువ‌డే స్థానిక ప‌త్రిక పూరా స‌చ్ ప‌త్రిక సంపాద‌కుడు. సాధ్వీకి జ‌రిగిన అన్యాయం గురించి ఆకాశ‌రామ‌న్న ఉత్త‌రాన్ని ప్ర‌చురించింది ఈ ప‌త్రిక‌లోనే. ఈ లేఖ‌నే హైకోర్టు సుమోటోగా తీసుకొని సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించారు. ఆకాశ రామ‌న్న ఉత్త‌రాన్ని ప్ర‌చురించిన కొద్ది కాలానికే ఆయ‌న త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో బైక్ మీద వ‌చ్చిన ఇద్ద‌రు దుండ‌గులు అత‌నిపై కాల్పులు జ‌రిపారు. తీవ్ర గాయాల‌తో మృత్యుదేవ‌త‌తో 28 రోజులు పోరాడిన ఆయ‌న క‌న్నుమూశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌పై దాడి చేసింది డేరా బాబానే అంటూ ఆయ‌న త‌న మ‌ర‌ణ వాంగ్మూలంలో చెప్పారు.

4. అంశూల్ ఛ‌త్ర‌ప‌తి

పూరా స‌చ్ ప‌త్రిక సంపాద‌కుడు రామ్ చంద‌ర్ ఛ‌త్ర‌ప‌తి కుమారుడు అంశూల్ ఛ‌త్ర‌ప‌తి. జ‌ర్న‌లిస్ట్ అయిన ఆయ‌న డేరా బాబా ఆరాచ‌కాల‌పై త‌మ‌కు అందిన ఆకాశ‌రామ‌న్న ఉత్త‌రాన్ని ప్ర‌చురించినందుకు త‌న తండ్రిని 21 ఏళ్ల వ‌య‌సులో పోగొట్టుకున్న అంశూల్‌.. తండ్రి న‌మ్మిన విలువ‌ల కోసం పోరాడారు. సీబీఐ.. హైకోర్టు చుట్టూ తిరిగారు. కేసు ద‌ర్యాఫ్తులో కీల‌క‌భూమిక పోషించారు.

5. న్యాయ‌మూర్తి జ‌గ్దీప్ సింగ్‌

డేరా బాబా కేసు విచార‌ణ జ‌రిపిన న్యాయ‌మూర్తి జ‌గ్దీప్ సింగ్‌. తాను ఇచ్చే తీర్పు కార‌ణంగా త‌న‌కు.. త‌న కుటుంబానికి హాని క‌లిగే అవ‌కాశం ఉంద‌ని తెలిసినా నీతిగా.. నిజాయితీగా కేసు విచార‌ణ జ‌రిపి దోషికి త‌గిన శిక్ష విధించారు. ముక్కుసూటి వ్య‌క్తిగా పేరున్న ఆయ‌న‌.. హ‌ర్యానాలోని జింద్‌కు చెందిన వారు. పంజాబ్ వర్సిటీలో లా చ‌దివిన ఆయ‌న‌కు మాన‌వ‌త్వం ఉన్న మ‌నిషిగా మంచి పేరుంది.

6. డీఐజీ ములింజా నారాయ‌ణ‌న్

డేరా బాబా ఆరాచ‌కాల‌పై పంజాబ్‌.. హ‌ర్యానా హైకోర్టు కేసు విచార‌ణ‌ను సీబీఐకి అప్ప‌చెప్పిన‌ప్పుడు ములింజా నారాయ‌ణ‌న్ ఢిల్లీలోని డిప్యూటీ ఇన్ స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ (స్పెష‌ల్ క్రైమ్స్‌)గా ప‌ని చేస్తున్నారు. ఈ కేసును త్వ‌ర‌గా కొట్టివేయాల్సిందిగా త‌న‌పై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వ‌స్తున్న‌ట్లుగాచెప్పారు. తాజాగా బాబాకు శిక్ష ప‌డిన త‌ర్వాత మాట్లాడుతూ.. త‌న‌కు రాజ‌కీయ నేత‌లు.. వ్యాపార‌వేత్త‌ల‌తో పాటు పోలీసు ఉన్న‌తాధికారుల నుంచి కూడా ఒత్తిళ్లు వ‌చ్చిన‌ట్లుగా పేర్కొన్నారు. 2009లో రిటైర్ అయ్యారు.

7. మాజీ సీబీఐ డైరెక్ట‌ర్ విజ‌య్ శంక‌ర్‌

డేరా బాబాపై 2007లో చార్జిషీట్ దాఖ‌లు చేసిన‌ప్పుడు సీబీఐ డైరెక్ట‌ర్ గా ఉన్న ఆయ‌న‌.. కేసును నీరుకార్చి క్లోజ్ చేయాల‌న్న ఒత్తిళ్లు వ‌చ్చినా ప‌ట్టించుకోకుండా ద‌ర్యాఫ్తును జ‌రిపారు. ద‌ర్యాఫ్తులో భాగంగా ఓసారి పంచ‌కుల‌లో సీబీఐ కార్యాల‌యాన్ని డేరా స‌చ్ఛా కార్య‌క‌ర్త‌లు చుట్టుముట్టారు. అదే స‌మ‌యంలో పోలీసులు స‌కాలంలో రావ‌టంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

8. పోలీసులు

బ్లాక్ క్యాట్ క‌మాండోల భ‌ద్ర‌త ఉన్న డేరా బాబా గుర్మీత్.. కోర్టు నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. పంచ‌కుల లోని సెక్టార్ వ‌న్ కోర్టు కాంప్లెక్స్ కు కారులో వ‌చ్చిన గుర్మీత్ త‌న‌కు శిక్ష విధిస్తార‌ని గుర్తించి పారిపోయే య‌త్నం చేశారు. ఆ విష‌యాన్ని గుర్తించిన పోలీసులు ఆయ‌న్ను పారిపోకుండా నిలువ‌రించారు. త‌న‌కున్న ప్రైవేటు సెక్యూరిటీ సాయంతో పారిపోయే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఆ విష‌యాన్ని గుర్తించిన హ‌ర్యానా పోలీసులు.. పారా మిల‌ట‌రీ ద‌ళాలు గుర్మిత్ ను త‌మ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ సంద‌ర్భంగా బ్లాక్ క్యాట్ క‌మాండోల‌తో పెనుగులాట జ‌రిగినా.. ప్రైవేటు సెక్యురిటీలో ఒక‌రు పోలీసుల‌పై కాల్పులు జ‌రిగినా వెన‌క్కి త‌గ్గ‌లేదు. డేరా బాబా పారిపోకుండా అడ్డుకోగ‌లిగారు.