Begin typing your search above and press return to search.

టాటాకు మిస్త్రీ బైబై చెప్ప‌డం వెన‌క కార‌ణం?

By:  Tupaki Desk   |   27 Oct 2016 12:02 PM GMT
టాటాకు మిస్త్రీ బైబై చెప్ప‌డం వెన‌క కార‌ణం?
X
ర‌త‌న్ టాటా... ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప పేరుగ‌ల వ్యాపార దిగ్గ‌జాల్లో ఒక‌రు. టాటా సంస్థ‌ల‌కు సంబంధించిగానీ - ర‌త‌న్ టాటా వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార శైలి గురించిగానీ ఎక్క‌డా ఎలాంటి నెగెటివ్ టాక్ వినిపించ‌దు. దేశంలోనే అత్యంత శ‌క్తిమంతుడైన బిజినెస్ మ్యాన్‌ గా ఉంటూ - త‌న ప‌నేదో తాను అన్న‌ట్టుగా లో ప్రొఫైల్ తో వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. కానీ, అలాంటి ర‌త‌న్ టాటాపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు సైర‌స్ మిస్త్రీ. త‌న‌ను అర్ధంత‌రంగా ఛైర్మ‌న్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించ‌డం వెన‌క పెద్ద కుట్ర జ‌రిగింద‌ని వాపోతున్నారు! ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా సైర‌స్ మిస్త్రీని ఛైర్మ‌న్ ప‌ద‌వి నుంచీ తొల‌గించ‌డంతో అంద‌రూ షాక్ కి గురైన మాట వాస్త‌వ‌మే. అయితే, కేవ‌లం ర‌త‌న్ టాటాతో త‌లెత్తిన విభేదాలే ఇందుకు కార‌ణం అనే అభిప్రాయం వ్యాపారవ‌ర్గాల నుంచి వ్య‌క్తమౌతోంది. టాటా సంస్థ‌ల్లోని లుక‌లుక‌ల‌న్నింటినీ బ‌ట్ట‌బ‌య‌లు చేస్తూ సుదీర్ఘ‌మైన లేఖ రాశారు సైర‌స్ మిస్త్రీ.

ఛైర్మ‌న్ కుర్చీలో కూర్చోబెట్టిన ద‌గ్గ‌ర నుంచీ ర‌త‌న్ టాటా త‌న చేతులు క‌ట్టేశార‌ని మిస్త్రీ ఆరోపించారు. నిర్ణయాధికారాల‌న్నీ ఆయ‌నే చేతిలోపెట్టుకుని, త‌న‌ను అచేత‌న ఛైర్మ‌న్ గా మార్చేశార‌ని మండిప‌డ్డారు. అంతేకాదు, త‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌త్యామ్నాయ అధికార కేంద్రాల‌ను ఆయ‌నే పెంచి ప్రోత్స‌హించార‌ని కూడా అన్నారు. 2012లో టాటా స‌న్స్ ఛైర్మ‌న్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న స‌మ‌యంలో తనకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్న‌ట్టు చెప్పార‌నీ, అంద‌రూ స‌హ‌క‌రిస్తామ‌ని అన్నార‌నీ, ఆ త‌రువాత ట్ర‌స్టులూ టాటా బోర్డుల మ‌ధ్య నియ‌మ నిబంధ‌న‌లూ నిర్ణ‌యాధికారాల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా మార్చేశార‌ని మిస్త్రీ ఆరోపించారు. దాంతో త‌న‌కు ప్ర‌త్యామ్నాయంగా కొత్త అధికార కేంద్రాలు త‌యార‌య్యాయ‌నీ, స్వేచ్ఛ‌గా ప‌నిచేసే వాతావ‌ర‌ణానికి తూట్లు ప‌డ‌టం అక్క‌డే మొద‌లైంద‌ని వివ‌రించారు.

ఛైర్మ‌న్ బాధ్య‌త‌లు త‌న‌కు అప్ప‌గించినా, తెర వెన‌క‌నే ఆయ‌నే ఉంటూ అంతా న‌డిపించేవార‌ని సైర‌స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎంతో గొప్ప‌గా చెప్పుకునే టాటా గ్రూప్ లో నైతిక నియ‌మావ‌ళి లేక‌పోవ‌డం దారుణ‌మ‌ని ఆరోపించారు. ఇక‌, టాటా ట్ర‌స్టులో ఉంటున్న బోర్డు మెంబ‌ర్లంద‌రూ ర‌త‌న్ టాటాకి పోస్ట్ మ్యాన్లు మాదిరిగానే మారిపోయార‌నీ, బోర్డు స‌మావేశం జ‌రుగుతూ ఉంటే మ‌ధ్య‌లోంచి వెళ్లిపోయి... ర‌త‌న్ టాటా స‌ల‌హాలు తీసుకుని తిరిగి మీటింగుల్లోకి వ‌చ్చేవార‌ని సైర‌స్ మండిప‌డ్డారు.

ర‌త‌న్ టాటా మాన‌స పుత్రిక‌గా చెప్పుకుంటున్న నానో కారు గుదిబండ‌గా త‌యారైంద‌ని సైర‌స్ వ్యాఖ్యానించ‌డం ఇంకా సంచ‌ల‌నం! రూ. 1 ల‌క్ష‌కు కారు ఇచ్చేస్తామ‌ని గొప్ప‌గా ప్ర‌క‌టించేశార‌నీ, కానీ వాస్త‌వంలో ఆ కారు త‌యారీకే అంత‌కుమించి ఖ‌ర్చు అవుతోంద‌నీ, నానో కారు వ‌ల్ల సంస్థ‌కు భారీ ఎత్తున న‌ష్టాలు వచ్చాయ‌ని సైర‌స్ చెప్పారు. నానో కార్ల‌ను ఆపేస్తే నానో గ్లైడ‌ర్ల స‌ర‌ఫ‌రా నిలిచిపోతుంద‌నీ, ఆ సంస్థలో కూడా ర‌త‌న్ టాటాకి వాటా ఉండ‌టం వ‌ల్ల‌నే ప్రాజెక్టును వ‌దులుకోలేక‌పోతున్నార‌ని మిస్త్రీ చెప్ప‌డం గ‌మ‌నార్హం! ఇదేకాదు, టాటాకు చెందిన ప‌లు సంస్థ‌లు తీవ్ర న‌ష్టాల్లోనూ స‌మ‌స్య‌ల్లోనూ చిక్కుకుని ఉన్నాయ‌ని మిస్త్రీ ఆరోపించ‌డం ఆస‌క్తిక‌రంగా ఉంది.

నిజానికి, కార్పొరేట్ రంగంలో దిగ్గ‌జ సంస్థ అయిన టాటాపై సైర‌స్ మిస్త్రీ ఈ రేంజిలో ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌చ్చితంగా షాకింగ్ న్యూసే. మొత్త‌మ్మీద సైర‌స్ మిస్త్రీ ఉద్వాస‌న వెన‌క ర‌త‌న్ టాటాతో ఏర్ప‌డ్డ విభేదాలే ప్ర‌ధాన కార‌ణంగా విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఆ విభేదాల వ‌ల్ల‌నే మిస్త్రీని తొల‌గించాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయ‌ని అంటున్నారు. ఏదేమైనా, మ‌చ్చ‌లేని టాటా సంస్థ‌ల‌పై మిస్త్రీ చేసిన ఆరోప‌ణ‌ల ప్ర‌భావం క‌చ్చితంగా ఉంటుంద‌ని చెప్పాలి. టాటా బ్రాండ్ ఇమేజ్ కు తూట్లు పొడిచే విధంగా ఆయ‌న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌రి, మిస్త్రీ బ‌య‌ట‌పెట్టిన టాటా సంస్థ‌ల న‌ష్టాల వివ‌రాలు నిజ‌మా కాదా అనేది టాటా వివ‌ర‌ణ ఇస్తారా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/