Begin typing your search above and press return to search.

పెద్ద‌న్న ఇగోను హ‌ర్ట్ చేసిన బుల్లి రాజ్యం!

By:  Tupaki Desk   |   20 Jun 2019 10:00 AM GMT
పెద్ద‌న్న ఇగోను హ‌ర్ట్ చేసిన బుల్లి రాజ్యం!
X
పెద్ద‌న్న‌ది పాడు క‌న్నుగా ప‌లువురు అభివ‌ర్ణిస్తారు. ఏదైనా దేశం మీద పెద్ద‌న్న క‌న్ను ప‌డితే.. వారి ప‌ని అయిపోయిన‌ట్లేన‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందునా పెద్ద‌న్నకు ట్రంప్ లాంటి నేత అధినేత‌గా ఉన్న‌ప్పుడు ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. మ‌రోసారి అమెరికాకు అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించాల‌ని త‌పిస్తున్న ట్రంప్‌.. అందుకు త‌గ్గ‌ట్లే అమెరికాకు మేలు చేయ‌టం కోసం తాను ఎంత‌కైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ గ‌డిచిన కొద్ది రోజులుగా చేస్తున్న హ‌డావుడి అంతా ఇంతా కాదు.

ఇరాన్ కు ముకుతాడు వేశాన‌న్న భావ‌న క‌లిగేలా చేసేందుకు ట్రంప్ ప్ర‌య‌త్నం చేయ‌టం.. దానికి ఇరాన్ ఒక ప‌ట్టాన అంగీక‌రించేందుకు సిద్ధంగా లేక‌పోవ‌టంతో ట్రంప్ కు చిరాకు పుట్టిస్తోంది. ఇప్ప‌టికే ఆంక్ష‌ల‌తో పాటు.. భార‌త్ లాంటి దేశాల్ని నియంత్రించి.. వారి ద‌గ్గ‌ర నుంచి ముడిచ‌మురు కొన‌కుండా చేసిన భారీ ఆర్ధిక న‌ష్టాన్ని క‌లిగించేలా ప్ర‌య‌త్నిస్తోంది.

ఇలా ఒక్కొక్క ప‌రిణామం అమెరికా.. ఇరాన్ ల మ‌ధ్య దూరం మ‌రింత పెర‌గ‌టంతో పాటు.. ఎవ‌రికి వారు ప‌ళ్లు కొరుకుతూ.. క‌త్తులు నూరుతున్న పరిస్థితి. ఇలాంటివేళ‌లోనే ఇటీవ‌ల గ‌ల్ఫ్ జ‌లాల్లో చ‌మురు ట్యాంక‌ర్ల‌పై దాడి జ‌రిగింది. ఇది మీరే చేశారంటే.. కాదు మీరే చేశారంటూ రెండు దేశాలు ప‌ర‌స్ప‌రం దూషించుకున్నాయి.

తాజాగా అమెరికాకు చెందిన ఒక నిఘా డ్రోన్ త‌మ గ‌గ‌న‌త‌లంలోకి వ‌చ్చినంత‌నే దాన్ని కూల్చి వేసిన‌ట్లుగా ఇరాన్ ప్ర‌క‌టించింది. దీంతో.. ఉద్రిక్త‌త మ‌రింత పెరిగిన‌ట్లైంది. అమెరికాకు చెందిన ఆర్ క్యూ-4 గ్లోబ‌ల్ హాక్ నిఘా డ్రోన్ ను గురువారం ఉద‌యం హోర్మోజ్ గాన్ ప్రావిన్స్ స‌మీపంలో ఇరాన్ గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించింద‌ని.. రివ‌ల్యూష‌న‌రీ గార్డ్ సిబ్బంది స‌ద‌రు డ్రోన్ ను పేల్చేసిన‌ట్లుగా ఇరాన్ పేర్కొన్న‌ప్ప‌టికీ.. అందుకు సంబంధించిన ఎలాంటి ఫోటోల్ని విడుద‌ల చేయ‌లేదు.

ఇదిలా ఉంటే.. ఇరాన్ చెప్పిన‌ట్లుగా వారి గ‌గ‌న‌త‌లంలో ఎలాంటి డ్రోన్లు కానీ.. విమానాలు కానీ ప్ర‌వేశించ‌లేద‌ని అగ్ర రాజ్యం స్ప‌ష్టం చేస్తోంది. అమెరికా డ్రోన్ల‌ను ఇరాన్ కూల్చేయ‌టం ఇదే తొలిసారి కాద‌ని.. గ‌తంలోనూ త‌మ‌కున్న సామ‌ర్థ్యాన్ని ఇరాన్ ప్ర‌ద‌ర్శించింద‌ని చెబుతున్నారు. కాకుంటే.. పెద్ద‌న్న ఈగోను హ‌ర్ట్ చేయ‌టం ద్వారా ఇరాన్ కు ఇబ్బందే అంటున్నారు. తాజా ప‌రిణామంతో రెండు దేశాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.