Begin typing your search above and press return to search.

ఇప్పుడింత అర్జెంట్ గా అప్పు మీద ప్రెస్ మీట్ ఎందుకు?

By:  Tupaki Desk   |   22 May 2019 5:36 AM GMT
ఇప్పుడింత అర్జెంట్ గా అప్పు మీద ప్రెస్ మీట్ ఎందుకు?
X
రెండు రోజులు. రెండంటే రోజులు మాత్ర‌మే మిగిలాయి ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌టానికి. అలాంటి వేళ‌.. ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయి? ఏ ప్ర‌భుత్వం ప‌వ‌ర్లోకి వ‌స్తుంది? అలాంటి లెక్క‌ల‌తో బిజీగా ఉండే వేళ‌.. ఏ మాత్రం సంబంధం లేని తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన అప్పు మీద అంత అర్జెంట్ గా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవ‌స‌రం ఏంటి? అన్న‌దిప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

రాజ‌కీయంగా హ‌డావుడి ఉన్న‌ప్పుడు కొన్ని అంశాలను అస్స‌లు చ‌ర్చ‌కు తీసుకురారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌ని.. స‌ర్కారు బండిని న‌డిపించ‌టం క‌ష్టంగా ఉంద‌ని.. ఏ నెల‌కు ఆ నెల ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాల కోసం కిందామీద ప‌డాల్సి వ‌స్తోందంటూ ఒక ప్ర‌ముఖ ప‌త్రిక‌లో భారీ క‌థ‌నం వ‌చ్చింది. స‌ద‌రు స్టోరీలో ఒక‌ట్రెండు అంకెల్లో దొర్లిన పొర‌పాట్లు మిన‌హా.. మిగిలిన దానిపై ఎవ‌రికి ఎలాంటి అభ్యంత‌రం లేదు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా వివ‌రాలు ఇచ్చిన ఈ క‌థ‌నం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

తోపులాంటి కేసీఆర్ హ‌యాంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు కావ‌ట‌మా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట ప్ర‌శ్న‌గా రావ‌టం ఒక ఎత్తు అయితే..చేసిన అప్పు గురించి ప్ర‌భుత్వ‌మే చెప్పుకోవాలే కానీ.. దాని గురించి మ‌రొక‌రు వేలెత్తి చూపించ‌టం సీఎం కేసీఆర్ కు అస్స‌లు న‌చ్చ‌లేద‌ట‌. ప్ర‌భుత్వం పీక‌ల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయింద‌ని.. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం నెల‌కొంద‌ని.. ఈ కార‌ణంగా పరిస్థితి ఇబ్బందిక‌రంగా మారిన‌ట్లుగా ఒక క‌థ‌నం ప్ర‌ముఖంగా ప‌బ్లిష్ అయ్యింది.

దీనిపై ఘాటుగా రియాక్ట్ కాలేని ప‌రిస్థితి. ఎందుకంటే.. అందులోని అంశాల‌న్ని నిజాలే కావ‌టంతో మింగా లేక క‌క్కాలేని ప‌రిస్థితి. అలా అని.. చేసిన అప్పుఅభివృద్ధి కోస‌మే త‌ప్పించి మ‌రొక దాని కాద‌న్న స‌మ‌ర్థింపు త‌ప్ప‌నిస‌రి అయ్యింది. అందుకే.. గెలుపు ధీమాలో ఉన్న‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల ఫ‌లితాల మీద అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వేళ.. ఊహించ‌ని విధంగా వ‌చ్చిన అప్పుల లెక్క స్టోరీ తెలంగాణ‌లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో.. ఆగ్ర‌హం చెందిన సీఎం.. ఈ అంశంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని.. భ‌యం లేకుండా బాజాప్తా.. అప్పు చేశామ‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేయాల‌ని.. ఎందుకు అప్పు చేయాల్సి వ‌చ్చింద‌న్న విష‌యం మీద స‌మ‌ర్థింపుతో కూడిన ప్రెస్ మీట్ ఉండాల‌న్న ఆదేశంతో హ‌డావుడిగా రాష్ట్ర అప్పు మీద ప్రెస్ మీట్ పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ స‌ర్కార్ భారీగా అప్పు చేసింద‌న్న విష‌యం తాజాగా తేలిపోవ‌ట‌మే కాదు.. ఉమ్మ‌డి రాష్ట్రంలో 60 ఏళ్ల‌లో మీద ప‌డిన అప్పు కంటే.. ఐదేళ్ల‌లో కేసీఆర్ చేసిన అప్పు భారీగా ఉంద‌న్న విష‌యాన్ని ఒప్పుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా చెప్ప‌క త‌ప్ప‌దు.