Begin typing your search above and press return to search.

అజ్జూను అందుకే సీన్లోకి తెచ్చారా?

By:  Tupaki Desk   |   17 July 2018 4:30 PM GMT
అజ్జూను అందుకే సీన్లోకి తెచ్చారా?
X
హైద‌రాబాద్ కాంగ్రెస్ పార్టీలో మాజీ క్రికెట‌ర్ అజ‌హ‌రుద్దీన్ చేసిన వ్యాఖ్యపై భారీ ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఎప్పుడూ తన సొంతూరైన హైద‌రాబాద్ రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌క్షంగా త‌ల‌దూర్చ‌ని అజ్జూ.. అందుకు భిన్నంగా రాష్ట్రం కాని రాష్ట్రంలోని మీడియాతో మాట్లాడుతూ.. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లుగా చెప్పి సంచ‌ల‌నం సృష్టించారు.

రెండుసార్లు కాంగ్రెస్ త‌ర‌ఫున ఎంపీగా బ‌రిలోకి దిగిన అజ్జూ ఒక‌సారి విజ‌యం సాధిస్తే.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌య్యారు. మ‌రికొద్ది నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు తెర మీద‌కు రానున్న త‌రుణంలో త‌న మ‌న‌సులోని మాట‌ను అజ్జూ బ‌య‌ట‌పెట్ట‌టం వెనుక పెద్ద వ్యూహ‌మే ఉంద‌ని చెబుతున్నారు.

సికింద్రాబాద్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లు ఉన్నాయి. సికింద్రాబాద్‌.. స‌న‌త్ న‌గ‌ర్‌.. ఖైర‌తాబాద్‌.. జూబ్లీహిల్స్‌.. నాంప‌ల్లి.. అంబ‌ర్ పేట‌.. ముషీరాబాద్ ఉన్నాయి. వీటిల్లో ముస్లిం ఓట‌ర్ల సంఖ్య దాదాపు 4 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంది. మైనార్టీ ఓట్లు పెద్ద ఎత్తున ప‌డి.. కాంగ్రెస్ పార్టీ సంప్ర‌దాయ ఓట్లు య‌థావిధిగా ప‌డితే.. అజ్జూ విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌క‌లా సాగుతుంద‌న్న అభిప్రాయం ఉంది. క్రికెట‌ర్ గా పేరు ప్ర‌ఖ్యాతులున్న అజ్జూ కానీ బ‌రిలోకి దిగితే.. సికింద్రాబాద్ స్థానాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌న్న ఆలోచ‌న‌తోనే రాహుల్ ఆయ‌న్ను బ‌రిలోకి దిగాల‌ని ఆదేశించిన‌ట్లు చెబుతున్నారు. హిందువుల ఓట్లు టీఆర్ ఎస్‌.. బీజేపీలు చీల్చుకునే క్ర‌మంలో మైనార్టీ అభ్య‌ర్థిని బ‌రిలోకి నిల‌ప‌టం ద్వారా గంప‌గుత్త‌గా కాంగ్రెస్‌ కు ఓట్లు ప‌డే వీలుంద‌ని చెబుతున్నారు.

అయితే.. అజ్జూ బ‌రిలోకి దిగుతానంటే లోక‌ల్ టాలెంట్ క‌మ్ మాజీ కేంద్ర‌ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన అంజ‌న్ కుమార్ యాద‌వ్ సంగ‌తి ఏమిట‌న్న క్వ‌శ్చ‌న్ రాక‌మాన‌దు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అంజ‌న్ కు ఒక‌ప్పుడున్నంత ప్ర‌జాబ‌లం ఇప్పుడు లేద‌ని.. గ‌డిచిన నాలుగేళ్ల‌లో ఆయ‌న త‌న ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో పాటు.. అక్క‌డి నేత‌ల‌తో స‌త్ సంబంధాలు కొన‌సాగించ‌క‌పోవ‌టం కూడా ఆయ‌న‌కు శాపంగా మారిందంటున్నారు.

2014 ఎన్నిక‌ల్లో ఎంపీగా బ‌రిలోకి దిగిన అంజ‌న్ 2.54ల‌క్ష‌ల ఓట్ల తేడాతో ఓడిపోయిన వైనాన్ని కాంగ్రెస్ నేత‌లు గుర్తు చేస్తున్నారు. ఇంత భారీ తేడాతో ఓడిన అంజ‌న్ కు మ‌రోసారి టికెట్ ఇచ్చే ఓట‌మిని రాసి పెట్టుకున్న‌ట్లేన‌ని చెబుతున్నారు. మ‌రి.. అజ్జూ దిగితే అంజ‌న్ స‌హ‌క‌రించ‌రు క‌దా? అన్న ప్ర‌శ్న‌కు ఒక సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు సోమ‌వారం నాటి ప‌రిణామాల్ని గుర్తు చేశారు.

అజ‌హ‌రుద్దీన్‌కు ద‌మ్ముంటే హైద‌రాబాద్ నుంచి పోటీ చేయాల‌ని స‌వాల్ విసిరిన అంజ‌న్ గంట‌ల వ్య‌వ‌ధిలోనే మెత్త‌బ‌డి.. రాహుల్ గాంధీ ఆదేశాల మేర‌కు పార్టీ అధినాయ‌క‌త్వం ఏం చెబితే తాను దానికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని.. పార్టీ నిర్ణ‌యాన్ని గౌర‌విస్తాన‌ని చెప్ప‌టం చూస్తే.. అజ్జూ టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేశార‌ని చెబుతున్నారు. అజ్జూను త‌న‌కు తానే సికింద్రాబాద్ మీద ఆస‌క్తి ఉంద‌ని చెప్ప‌టం ద్వారా.. స్థానికంగా చోటు చేసుకునే ప‌రిణామాల్ని ప‌రిశీలించిన త‌ర్వాత కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెబుతున్నారు. తొలుత రాహుల్ ఓకే అన్న త‌ర్వాతే.. ప‌క్కా ప్లాన్ తో అజ‌హ‌రుద్దీన్ త‌న మ‌న‌సులోని మాట‌ను మీడియాకు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.