ఆ రెండే టీఆర్ ఎస్ కొంపముంచాయా.?

Fri May 24 2019 15:00:54 GMT+0530 (IST)

తెలంగాణ ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. అసెంబ్లీకి గద్దెనెక్కించిన టీఆర్ ఎస్ కు పార్లమెంట్ వచ్చేసరికి కొంచెం వాతపెట్టారు. ఎవ్వరిని నిలబెట్టినా.. అంత తన ముఖం చూసే వేస్తారనుకున్న కేసీఆర్ కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. క్యాండిడేట్లు కాదు.. తెలంగాణలో ప్రతిపక్షం కూడా కావాలని కేసీఆర్ కు హితబోధ చేశారు.గెలిచిన వారికే ఓట్లు వేస్తే మళ్లీ అదే పాలన.. అందుకే ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ ను చూద్దామని ఏపీ ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇక తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ కు సైతం అంతుచిక్కని విధంగా ఓటర్లు చాలా తెలివైన తీర్పునిచ్చారు. కష్టపడ్డవారికి.. ఓడిపోయిన వారికి రాజకీయంగా బతుకునిచ్చారు. అస్సలు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ  తెలివైన ఓటర్లు టీఆర్ ఎస్ ను ప్రాంతీయ పార్టీగా నే గుర్తించారు. అందుకే జాతీయ స్థాయి ఎంపీ సీట్లను కట్టబెట్టేందుకు ఆసక్తి చూపలేదు.

ప్రతిపక్షం ఉండాలని కాంగ్రెస్ కు 3 సీట్లు.. టీఆర్ ఎస్ అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకతతో బీజేపీకి 4 సీట్లు కట్టబెట్టారని విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు. బీజేపీ గెలిచిన సీట్లలో నిజామాబాద్ లో కవితపై రైతుల ఆగ్రహం ఆమె ఓటమికి దారి తీసింది. కరీంనగర్ లో బండిసంజయ్ వరుసగా ఓడిపోయిన సెంటిమెంట్.. వినోద్ పై వ్యతిరేకత గెలిపించాయి. ఇక ఆదిలాబాద్ లో బీజేపీ నేత సోయం బాపూరావు కు కుల సమీకరణం.. టీఆర్ ఎస్ అభ్యర్థిపై వ్యతిరేకత కలిసివచ్చింది. సికింద్రాబాద్ లోనూ తలసాని కుమారుడిపై వ్యతిరేకత కిషన్ రెడ్డిని గెలిపించాయి. ఇక కాంగ్రెస్ ఉద్దండులు అసెంబ్లీలో ఓడిపోయిన సెంటిమెంట్.. కుదలైన కాంగ్రెస్ పై సానుభూతికి ఓటర్లు తలొగ్గి వారికి చాన్స్ ఇచ్చారు.

నిజానికి ప్రచారంలో కేసీఆర్ కేటీఆర్ నోరుజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రతిపక్షాలను గెలిపించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా కేసీఆర్ ‘హిందువులు.. బొందువులు’ అనడాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా మలిచింది. హనుమాన్ మాలధారణ సమయం కావడంతో పెద్ద ఎత్తున దీన్ని భక్తులు హిందూ అభిమానులు జనంలోకి తీసుకెళ్లారు. ఇక కేటీఆర్ ప్రతిపక్షాలను కించపరుస్తూ ‘అసెంబ్లీలో చెల్లని రూపాయలు.. పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతారా’ అని నేతలను కించపరిచాడు. అదే ఆ నాయకుల్లోనూ.. ఓటర్లను కసిని పెంచింది. అధికార అహంకారమని జనంలోకి బీజేపీ కాంగ్రెస్ లు తీసుకెళ్లాయి. అందుకే అటు టీఆర్ ఎస్ బలహీన అభ్యర్థులు.. ఇటు ప్రతిపక్షాల కష్టం ఫలించి తెలంగాణలో టీఆర్ఎస్ కు దిమ్మదిరిగి బొమ్మ కనపడే ఫలితాలు వచ్చాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.