Begin typing your search above and press return to search.

జగన్ మీద మూడు బండలేసిన ఎస్వీ మోహన్ రెడ్డి

By:  Tupaki Desk   |   6 May 2016 4:23 PM GMT
జగన్ మీద మూడు బండలేసిన ఎస్వీ మోహన్ రెడ్డి
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఏపీ విపక్ష ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరుగా పార్టీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. కర్నూలు ఎమ్మెల్యే.. భూమా నాగిరెడ్డి బావమరిది అయిన ఎస్వీ మోహన్ రెడ్డి సైకిల్ ఎక్కేందుకు ముహుర్తం డిసైడ్ చేసుకున్నారు. శనివారం చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించిన ఎస్వీ మోహన్ రెడ్డి.. మిగిలిన జంపర్స్ మాదిరే వ్యవహరించారు.

పార్టీలో ఉన్న సమయంలో అధినేత మీద పిసరంత అసంతృప్తి వ్యక్తం చేయని నేతలు.. పార్టీ మారాలని డిసైడ్ అయిన వెంటనే ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేయటం మామూలే. ఇదే రీతిలో ఎస్వీ మోహన్ రెడ్డి తాజాగా వైఎస్ జగన్ మీద మూడు ఫిర్యాదులు చేశారు. తాను తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి మూడు కారణాలు ఉన్నాయని చెప్పిన ఆయన.. ఏం చెప్పారంటే..

1. భవిష్యత్తులో తన మేనకోడలు భూమా అఖిల ప్రియ మీద పోటీకి తన చిన్నాన్న ఎస్వీ నాగిరెడ్డిని పోటీకి పెట్టాలని జగన్ నిర్ణయించారు. నా చెల్లెలు కుమార్తె మీదన తమనే పోటీకి దిగాలని కోరటం బాధ కలిగించింది. మా కుటుంబంలో చీలిక తెచ్చేందుకు జగన్ ప్రయత్నించారు.

2. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు నిరసన దీక్ష నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. కానీ.. నిరసన వేదిక అయిన కర్నూలుకు చెందిన పార్టీ నేతలైన మాకు మాట వరసకు కూడా చెప్పకుండా తన నిర్ణయాన్ని వెల్లడించేశారు. ఇది ఎంతగానో బాధించింది.

3. ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు అవుతున్నా.. ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నా. ఆ ఆవేదన రోజురోజుకీ పెరుగుతంది. జిల్లా అభివృద్ధి మీద చంద్రబాబు ఇచ్చిన హామీ నేపథ్యంలో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నా.