రేవంత్ ఓటమి స్వయంక్రుతం

Tue Dec 11 2018 22:11:50 GMT+0530 (IST)

ఆయన స్టార్ క్యాంపేయినర్.. ఆయన రెబల్ స్టార్.. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగి కాంగ్రస్ పార్టీలో చేరిన నాయకుడు. ఇక్కడ కూడా అనతి కాలంలోనే స్టార్ గా ఎదిగిన నాయకుడు. తన మాటలతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఇరుకున పెట్టిన నాయకుడు. ఆయనే రేవంత్ రెడ్డి. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్. తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించేందుకు కంకణం కట్టుకున్న నాయకుడు. తన మాటలతో - వ్యూహాలతో అదికార పార్టీని ఇబ్బందుల పాలు చేసిన నాయకుడు. ఒక్క తెలంగాణలోనే కాదు - ఆంధ్రప్రదేశ్ లోను అభిమానులను సొంతం చేసుకున్న నాయకుడు.ఎన్నికలకు ముందు హల్ చల్ చేసిన ఈ నాయకుడు రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికలలో బొక్కబోర్ల పడ్డారు. మహాకూటమి అభ్యర్దులను తానే గెలిపించాల్సిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. దీని వెనుక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆ పార్టీ నేత హరీష్ రావుల పగడ్బంది వ్యూహం ఉంది. తమ గెలుపు కంటే రేవంత్ రెడ్డి ఓటమే ప్రధానంగా హరీష్ రావు కొడంగల్ లో పనిచేసారు. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులను తమ వైపు తిప్పుకోవడంలో హరీష్ రావు విజయం సాధించారు. ఎక్కడా ఎటువంటి లోపాలకు తావివ్వకుండా వ్యూహలను రూపొందించారు.

రేవంత్ రెడ్డి ఓటమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పావులు కదిపారు. ఎక్కడిక్కడ తన వ్యూహాలను హారీష్ రావు చేత అమలు చేయించారు. కొడంగల్ నియోజకవర్గంలో వ్యూహాలను మారుస్తూ.. కొత్త కొత్త ఎత్తుగడలను రచిస్తూ రేవంత్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేసారు. రేవంత్ రెడ్డికూడా తన విజయం ఖయమనే దీమాతో నియోజకవర్గాన్ని తన తమ్ముళ్లకు అప్పగించారు. ఆయన ముఖ్య అనుచరులు తెలంగాణ రాష్ట్ర సమితితో చేతులు కలిపారు. ఇక కొడంగల్ ఓటర్లు కూడా రెండు సార్లు గెలిపించినా రేవంత్ రెడ్డిని కాదని అధికార పార్టీకి పట్టం కట్టారు. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి దూకూడు ఆయన ఓటమికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రచారం జరిగిన రేవంత్ రెడ్డి తన ఓటమిని తానే కొని తెచ్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తనపై తనకు ఉన్న అతివిశ్వాసమే రేవంత్ రెడ్డి పరాజయానికి కారణమయ్యిందని వారు విశ్లేషిస్తున్నారు.