Begin typing your search above and press return to search.

రాహుల్ బ‌స.. హ‌రిత ప్లాజాలోనే ఎందుకు?

By:  Tupaki Desk   |   14 Aug 2018 7:23 AM GMT
రాహుల్ బ‌స.. హ‌రిత ప్లాజాలోనే ఎందుకు?
X
ఆయ‌న ఆషామాషీ నేత కాదు. దేశాన్ని రికార్డు స్థాయిలో ఏలిన కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడు. అలాంటి అధినేత హైద‌రాబాద్ లాంటి మ‌హాన‌గ‌రానికి వ‌స్తే.. ఎక్క‌డ బ‌స చేస్తారు? అయితే.. ఏ సెవ‌న్ స్టారో.. ఫైవ్ స్టార్ హోట‌ల్లోనో బ‌స చేస్తారు. కానీ.. ఇందుకు భిన్నంగా రాహుల్ గాంధీ బేగంపేట‌లోని హ‌రిత ప్లాజా అనే బ‌డ్జెట్ హోట‌ల్లో బ‌స చేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

రాహుల్ లాంటి స్థాయి ఉన్న నేత మ‌రీ బ‌డ్జెట్ హోట‌ల్లో బ‌స చేయ‌టం ఏమిటి? అది కూడా రోజు రూమ్ రెంట్ రూ.3500 లోపు ఉన్న హోట‌ల్లో.. (అంటే ఖ‌రీదైన సూట్లు కూడా ఉంటాయ‌నుకోండి) ఆయ‌న బ‌స ఏర్పాట్లు చేసిన‌ట్లు? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. నిజానికి రాహుల్ కోరుకుంటే.. బిల్లు లేకుండానే బ‌స ఏర్పాట్ల‌కు అవ‌కాశం ఉంది. అందుకు ఎవ‌రో అక్క‌ర్లేదు.. పార్టీకి చెందిన సుబ్బిరామిరెడ్డికి ఒక ఫోన్ చేస్తే.. ఆయ‌న‌కు చెందిన పార్క్ హ‌య్య‌త్ లో బ‌స చేయొచ్చు. కానీ.. అలా చేయ‌కుండా ఏరికోరి మ‌రీ హ‌రిత ప్లాజాలోనే ఆయ‌న త‌న బ‌స‌కు ఓకే చెప్పేశార‌ట‌.

హైద‌రాబాద్‌ లో సెవ‌న్ స్టార్.. ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌కు కొద‌వ లేదు. కానీ.. అలాంటి విలాసాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా బ‌డ్జెట్ హోట‌ల్లో బ‌స వెనుక‌.. అన‌వ‌స‌ర‌మైన విమ‌ర్శ‌ల్ని త‌ప్పించుకునేందుకేన‌ట‌. రాహుల్ త‌న ప‌ర్య‌ట‌న‌ను వీలైనంత సాదాసీదాగా జ‌ర‌పాల‌న్న ఉద్దేశంతో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే.. సౌక‌ర్యాలు ఎక్కువ‌గా ఉన్న ల‌గ్జ‌రీ హోట‌ల్ వంక కూడా చూడ‌లేద‌ని తెలుస్తోంది. సాదాసీదా జీవ‌నం మోడీ ఇమేజ్ ను ఎంత‌గా పెంచిందో తెలిసిందే. అదే త‌ర‌హా విధానాన్ని రాహుల్ అనుస‌రిస్తున్నార‌ని.. అందులో భాగంగానే ఆయ‌న బ‌డ్జ‌ట్ హోట‌ల్లో బ‌స చేసేందుకు మొగ్గు చూపిన‌ట్లుగా పార్టీకి చెందిన సీనియ‌ర్లు చెబుతున్నారు.