Begin typing your search above and press return to search.

ర‌న్‌వే 02..20..గంద‌ర‌గోళం..49 మంది మృతి

By:  Tupaki Desk   |   14 March 2018 4:19 AM GMT
ర‌న్‌వే 02..20..గంద‌ర‌గోళం..49 మంది మృతి
X
చిన్న గంద‌ర‌గోళం పెద్ద ప్ర‌మాదానికి దారితీసింది. ఏకంగా 49 మంది ప్రాణాలు `గాలిలో` క‌లిసిపోయాయి. నేపాల్‌ లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌ వేపై విమానం కూలిన ఘటన గురించే ఇదంతా.ఈ ఘటనలో 49 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డ సంగ‌తి తెలిసిందే. అధికారులు దర్యాప్తు వేగవంతం చేయ‌గా ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. విమాన బ్లాక్ బాక్స్ తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ - విమాన పైలట్ మధ్య జరిగిన సంభాషణల్లో గందరగోళం వల్లే ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నామని అధికారులు చెప్పారు.

సోమవారం ఢాకా నుంచి కాఠ్మండు వెళ్తున్న యూఎస్-బంగ్లా ఎయిర్‌ లైన్స్ విమానం ప్రమాదానికి గురైనప్పుడు అందులో 67 మంది ప్రయాణికులు - నలుగురు సిబ్బంది ఉన్నారు. విమానం రన్‌ వేపై దిగుతున్నప్పుడు మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఫుట్‌ బాల్ మైదానంలో కుప్పకూలింది. విమాన డాటా రికార్డర్‌ ను స్వాధీనం చేసుకొని భద్రపర్చడంతోపాటు దర్యాప్తును వేగవంతం చేసినట్టు విమానాశ్రయం జీఎం రాజ్‌ కుమార్ చెట్రి తెలిపారు. ప్రమాదానికి కారణం మీరంటే మీరని ఎయిర్‌ లైన్స్ అధికారులు - విమానాశ్రయ వర్గాలు పరస్పరం ఆరోపించుకుంటున్నారు.ప్రమాద స్థలానికి తమ సంస్థ తరఫున భద్రతా దర్యాప్తు అధికారితోపాటు ఫీల్డ్ సర్వీస్ ప్రతినిధిని పంపుతున్నట్టు విమాన తయారీ కంపెనీ బొంబార్డియర్ తెలిపింది. ప్రమాదంపై నేపాల్ ప్రభుత్వం ఆరుగురు సభ్యుల కమిటీని నియమించింది. బంగ్లాదేశ్‌ కు చెందిన ఇద్దరు మంత్రుల ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఘటనా స్థలాన్ని సందర్శించింది.

విమానం ల్యాండింగ్‌ కు చేసిన సూచనల్లో గందరగోళం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ కు (ఏటీసీ).. పైలట్‌ కు మధ్య జరిగిన చివరి నాలుగు నిమిషాల సంభాషణలను బట్టి దక్షిణ భాగంలో ఉన్న రన్‌ వే 02.. ఉత్తరభాగంలో ఉన్న రన్‌ వే 20 విషయంలో పైలట్ గందరగోళానికి గురైనట్టు నేపాలీ పత్రికలు వార్తా కథనాలు ప్రచురించాయి. రికార్డయిన సంభాషణల ప్రకారం.. నేను మళ్లీ చెప్తున్నాను. రన్‌ వే 20 వైపు వెళ్లొద్దు అని కంట్రోలర్ పైలట్‌ ను హెచ్చరించారు. తర్వాత అలాగే ఉండండి. విమానాన్ని ల్యాండ్ చేయొద్దు. మరో విమానం వస్తున్నది అనే హెచ్చరికలు రికార్డయ్యాయి. విమానం కుడివైపు మళ్లిన తర్వాత మీరు రన్‌ వే 02 లేదా 20లో దేనిపై ల్యాండ్ అవ్వాలని అనుకుంటున్నారు? అని కంట్రోలర్ ప్రశ్నించారు. దానికి పైలట్ మేం రన్‌ వే 20పై ల్యాండ్ అవుతాం అని చెప్పారు. ఆ మేరకు అనుమతి జారీచేశారు. తర్వాత రన్‌ వే మీకు కనిపిస్తున్నదా? అని ప్రశ్నించగా లేదని పైలట్ చెప్పా రు.

దీంతో కుడివైపునకు మళ్లాలని కంట్రోలర్ కోరారు. దీంతో రన్‌ వే తమకు కనిపిస్తున్నదని కచ్చితంగా చెప్పిన పైలట్.. రన్‌ వే 20కి అనుమతి ఇచ్చినా రన్‌ వే 02 ను ఖాళీ చేయండని కోరారు. దీంతో రన్‌ వే 02పై ల్యాండింగ్‌ కు కంట్రోలర్ క్లియరెన్స్ ఇచ్చారు. చివరగా పైలట్ `సర్.. మేం ల్యాండ్ కావొచ్చా?` అని అడిగారు. కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత `నేను మళ్లీ చెప్తున్నాను. ఇటు మళ్లండి` అని కంట్రోలర్ గట్టిగా అరిచారు. తర్వా త కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి.