ఇంత వ్యతిరేకత ఉన్న మోడీ ఎందుకు గెలుస్తున్నట్టు.?

Tue May 15 2018 11:16:16 GMT+0530 (IST)

కర్ణాటక ఫలితం తేలిపోయింది.  దాదాపు మ్యాజిక్ ఫిగర్ 113 సీట్ల ఆధిక్యాన్ని బీజేపీ సాధించింది. దీంతో కన్నడ నాట హంగ్ ఊహాగానాలు తెరదించుతూ బీజేపీ స్వతంత్రంగానే గద్దెనెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.  దేశవ్యాప్తంగా రోజురోజుకు మోడీ పాలనపై వ్యతిరేకత పెరిగిపోతోంది. నోట్ల రద్దు నుంచి నిన్నటి జీఎస్టీ వరకూ మోడీ నిర్ణయాలు సామాన్య జనానికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. మోడీ తీసుకొచ్చిన పథకాలు కూడా ప్రత్యక్షంగా జనాలకు చేరువకాకపోవడంతో బీజేపీపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇంత వ్యతిరేకత ఉన్నా.. కర్ణాటకలో బీజేపీ ఎలా గెలిచింది. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా.. గెలుపు ఖాయమని అనుకున్నా ఎందుకు ఓడిందనేది ఆసక్తిగా మారింది..కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమికి బీజేపీ గెలుపునకు ప్రధానంగా కొన్ని కారణాలున్నాయి. మొదటి ప్లానింగ్ లేకపోవడం.. బీజేపీ ఎంతో పకడ్బందీగా కర్ణాటక ఎన్నికలకు సిద్ధమైంది. దాదాపు 50వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కర్ణాటకలో మోహరించింది. జలవివాదంతో ఉన్న కావేరీ వివాదాన్ని బీజేపీ నాన్చిపెట్టింది. ఇక హామాహేమీలైన ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలను కర్ణాటకలో దింపి ప్రచారాన్ని ఉధృతం చేసింది. దాదాపు 1000 కోట్లను కర్ణాటకలో ఎన్నికల కోసం ఖర్చు పెట్టారంటే ధన ప్రవాహం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక 24 వేల కోట్ల మద్యం ఏరులైపారింది. ఇలా అన్నింట్లో బీజేపీ ప్లాన్ తో ముందుకెళ్లగా.. గెలుపు ధీమాతో సిద్ధిరామయ్య - రాహుల్ నిర్లక్ష్యంగా వెళ్లి బొక్కబోర్లాపడ్డారు.

ఇక కాంగ్రెస్ చేసిన అతిపెద్ద పోరపాటు లింగాయత్ కుల సమీకరణాలను రెచ్చగొట్టడం.. లింగాయత్ రిజర్వేషన్ల మార్పు తెట్టను సీఎం సిద్ధరామయ్య కెలికి అనవసరంగా వారికి దూరమయ్యారు. అదే సమయంలో ఎప్పటినుంచో కాంగ్రెస్ కు అండదండగా ఉన్న ముస్లిం - దళిత ఓటు బ్యాంకును పట్టించుకోకుండా జేడీఎస్ కు ఓట్లు చీల్చేలా చేసుకున్నారు. ఎంఐఎం బీఎస్పీ లాంటి పార్టీలను చేరదీయకుండా కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుంది. వారంతా జేడీఎస్ కు అండగా నిలవడంతో ఇప్పుడు కాంగ్రెస్ కు పడే ఓట్లు కూడా చీలి బీజేపీ లాభపడింది. ఇలా ఎన్నో సమీకరణాలు కన్నడనాట గెలుపు అవకాశాలున్న కాంగ్రెస్ ను ఓడించగా.. అంత వ్యతిరేకత ఉన్నా బీజేపీ గెలుపునకు దోహదపడ్డాయి.