మల్లారెడ్డి కోరికను కేసీఆర్ ఇలా నెరవేర్చాడు..

Tue Feb 19 2019 10:17:14 GMT+0530 (IST)

తెలంగాణ కేబినెట్ విస్తరణకు వేళయ్యింది. కొందరు అదృష్టం కొద్దీ మంత్రులవ్వగా.. కేసీఆర్ కరుణాకటాక్షాలతో మరికొందరు రెండోసారి మంత్రులవుతున్నారు. మొత్తంగా నలుగురు పాత - ఆరుగురు కొత్త ముఖాలతో తెలంగాణ కేబినెట్ ఈరోజు కొలువుదీరుతోంది.తెలంగాణ కేబినెట్ లో ఎవ్వరూ ఊహించని పేరొకటి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయనే చామకూర మల్లారెడ్డి. మల్లారెడ్డి విద్యాసంస్థలను స్థాపించి ఆ బ్యాక్ గ్రౌండ్ తోనే 2014లో టీడీపీ మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు. అనంతరం టీఆర్ ఎస్ లో చేరి కొనసాగారు. మంత్రి పదవి చేపట్టాలన్నది మల్లారెడ్డి చిరకాల కోరిక అట.. ఈ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడు ఓసారి కేసీఆర్ వద్ద కూడా ప్రస్తావించారట.. అది ఇప్పుడు అనూహ్యంగా నెరవేరడంతో మల్లారెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

నిజానికి రంగారెడ్డి జిల్లా కోటాలో పోయిన సారి పట్నం మహేందర్ రెడ్డి మంత్రయ్యారు. ఈసారి ఆయన ఓడిపోయారు. రేవంత్ రెడ్డిపై ఆయన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గెలిచారు. కానీ తొలిసారి ఎమ్మెల్యే కావడంతో ఆయనకు ఇవ్వడం సాధ్యం కాక అనూహ్యంగా మల్లారెడ్డి తెరపైకి వచ్చాడు..

నిజానికి మల్లారెడ్డి గడిచిన సమ్మక్క-సారలమ్మ జాతరలో కేసీఆర్ తోపాటు మేడారం వెళ్లినప్పుడు ఓ సంఘటన చోటుచేసుకుందట..  ‘మల్లన్న ఏం కోరుకున్నావే.. అని’ కేసీఆర్ అడగ్గా.. మంత్రి పదవి కోరుకున్నానని మల్లారెడ్డి తన మనసులో మాట బయటపెట్టాడట.. అలా అప్పటి కోరికను కేసీఆర్ గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు నెరవేర్చడం యాదృశ్చికమే అయినా.. ఇదంతా సమ్మక్క అమ్మవారి దయే అంటూ మల్లారెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తుండడం విశేషం.