Begin typing your search above and press return to search.

అందుకోస‌మే కేసీఆర్ మినీ మంత్రివ‌ర్గం?

By:  Tupaki Desk   |   17 Dec 2018 5:44 AM GMT
అందుకోస‌మే కేసీఆర్ మినీ మంత్రివ‌ర్గం?
X
టీఆర్ ఎస్ అధినేత‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఎప్పుడేం చేయాలో.. ఎప్పుడేం చేయ‌కూడ‌దో ఆయ‌న‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీద‌నే చెప్పాలి ఎప్పుడేం చేయాలో ప‌క్కాగా లెక్క ఉన్న రాజ‌కీయ నేత‌గా కేసీఆర్‌ ను చెప్పాలి. వ‌ర్త‌మానాన్ని ఎంత చ‌క్క‌గా అవ‌గాహ‌న చేసుకుంటారో.. భ‌విష్య‌త్తులోఏం చేస్తే బాగుంటుంద‌న్న విష‌యంలోనే అంతే క్లారిటీ ఉంటుంది. అదే ఆయ‌న బ‌లం కూడా.

ఊహించిన దాని కంటే ఎక్కువ సీట్ల‌ను సాధించిన కేసీఆర్‌.. తెలంగాణ‌లో త‌న బ‌లం తిరుగులేద‌ని.. త‌న‌ను ఢీ కొట్టే వాడు.. రాజ‌కీయంగా త‌న‌కు స‌వాళ్లు విస‌ర‌గ‌లిగే మొన‌గాళ్లు ఎవ‌రూ లేర‌న్న విష‌యాన్ని తాజా ఎన్నిక‌ల‌తో తేల్చేశారు. కేసీఆర్‌ ను న‌మ్మించిన బాగా మ‌రెవ‌రినీ తాము న‌మ్మ‌లేమ‌ని తెలంగాణ ప్ర‌జ‌లు పెద్దఎత్తున తీర్పును ఇచ్చేశారు.

త‌న‌ను తాను న‌మ్మిన దాని కంటే ఎక్కువ‌గా ప్ర‌జ‌లు త‌న‌ను న‌మ్ముతున్న వైనం ఎవ‌రికైనా అమిత‌మైన బ‌లాన్ని ఇస్తుంది. కేసీఆర్ లాంటోళ్ల‌కు అదిచ్చే శ‌క్తి అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం కేసీఆర్ అదే మూడ్‌ లో ఉన్నారు.

ఈ కార‌ణంలోనే.. ఆచితూచి అన్న‌ట్లుగా తీసుకోవాల్సిన చాలా నిర్ణ‌యాల్ని ఆయ‌న వేగంగా తీసేసుకుంటున్నారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ గా కేటీఆర్‌ ను ఎంపిక చేయ‌టం.. ఎమ్మెల్యేల చేత ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌క‌పోవ‌ట‌మే కాదు.. మంత్రివ‌ర్గ క‌స‌ర‌త్తు విష‌యంలోనూ ఆయ‌నిప్పుడు విల‌క్ష‌ణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు వినిపిస్తున్న వాద‌న ప్ర‌కారం.. కేసీఆర్ కేబినెట్‌ లో ఎనిమిది మంది మాత్ర‌మే ఉంటార‌ని.. కీల‌క శాఖ‌ల్ని అప్ప‌జెప్పి.. మిగిలిన టీంను అలా ఉంచేస్తార‌ని చెబుతున్నారు. ఎందుకిలా? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం వినిపిస్తోంది.

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో జాతీయ రాజ‌కీయాల మీద దృష్టి పెట్టిన కేసీఆర్‌.. రాష్ట్రంలో కేబినెట్‌ ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయ‌లేదు. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయ‌న్న మాట వినిపిస్తోంది. ఇప్పుడు త‌న దృష్టి అంతా రాష్ట్ర పాల‌న మీద కంటే కూడా జాతీయ అంశాల మీద ఎక్కువ‌గా ఉంద‌న్న సందేశాన్ని ప్ర‌జ‌ల‌కు తెలిసేలా చేయ‌టం ఒకటైతే.. మినీ కేబినెట్‌ ను ఏర్పాటు చేయ‌టం ద్వారా.. రానున్న రోజుల్లో పాల‌న‌కు సంబంధించిన ప్ర‌క్షాళన పెద్ద ఎత్తున ఉండ‌బోతుంద‌న్న సందేశం మ‌రొక‌టి.

జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ కానీ తాను అనుక‌న్న‌ది సాధించి.. చ‌క్రం తిప్పే అవ‌కాశం ఉంటే ఓకే. లేని ప‌క్షంలో.. కేబినెట్ ను స‌మూలంగా ప్ర‌క్షాళన చేసేందుకు వీలుగా.. ఖాళీగా ఉంచుతున్నార‌ని చెప్పాలి. ఒక‌వేళ‌.. క‌సీఆర్ తాను అనుకున్న‌ది సాధిస్తే.. రాష్ట్ర ప‌గ్గాలు త‌న కుమారుడు కేటీఆర్ చేతికి అప్ప‌జెప్ప‌టం ద్వారా..పాల‌న‌లో ఆయ‌న మార్క్ కు త‌గ్గ‌ట్లు మార్పులు చేసుకునే వీలుండేలా కేబినెట్ ను ఖాళీగా ఉంచుతున్న‌ట్లు చెబుతున్నారు. ఎనిమిది మందితో మినీ కేబినెట్ ఏర్పాటు చేయ‌టం ద్వారా.. ఆశావాహులను ఎన్నిక‌ల వేళ ప‌రుగులు పెట్టించ‌టం.. వారి చేత నూటికి నూరుశాతం ప‌ని చేయించటం మ‌రో ఎత్తుగా చెబుతున్నారు. సార్ చేతికి అధికారం వ‌చ్చిన వెంట‌నే త‌మ‌కూ వ‌స్తుంద‌ని ఆశించే గులాబీ నేత‌ల‌కు కేసీఆర్ షాకిచ్చిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.