కామ్ గా కేసీఆర్.. వెనుక పక్కా వ్యూహం!

Mon Nov 05 2018 10:48:04 GMT+0530 (IST)

తుపాను విరుచుకుపడే ముందు వాతావరణం మొత్తం గంభీరంగా మారుతుంది. జరిగే ప్రకృతి విధ్వంసానికి ముందస్తుగా వాతావరణంలో తెలీని స్తబ్దత నెలకొని ఉన్నట్లుగా ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లోనూ ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉంది. యాభై రోజుల్లో 108 సభల్లో ఇరగదీస్తానన్న కేసీఆర్.. అందుకు భిన్నంగా మూడు నాలుగు సభల్లో మాత్రమే పాల్గొనం తెలిసిందే.క్యాలెండర్లో తేదీలు మారుతున్నా కేసీఆర్ మాత్రం బయటకు రావటం లేదు. ఎప్పటి మాదిరే ఫాంహౌస్ లో ఉంటున్నారు. అక్కడేం చేస్తున్నారన్న సమాచారం బయటకు రావటం లేదు. కాకుంటే.. బయట జరిగే పరిణామాలపై అప్డేట్స్  మాత్రం ఎప్పటికప్పుడు ఆయనకు చేరుతున్నట్లుగా తెలుస్తోంది.

నిన్న మొన్నటివరకూ వాతావరణం సానుకూలంగా ఉన్నట్లుగా కనిపించటం.. ప్రముఖ మీడియా సంస్థలు సైతం కేసీఆర్ వైపే ఉన్నట్లు కనిపించినా ఇప్పుడు సీన్ మారిపోవటం ఆసక్తికరంగా మారింది. దీంతో కేసీఆర్ పని అయిపోయిందని.. ఆయనకు ఇబ్బందులు తప్పవన్న ప్రచారం సాగుతోంది.

ఇక్కడ మిస్ కాకూడని పాయింట్ ఏమంటే.. కేసీఆర్ ఎప్పుడూ మంది మార్బలంతో యుద్ధం చేయరు. ఆ మాటకు వస్తే.. ఆయన  తనకున్న సైనిక బలగం కంటే కూడా తన బలాన్నే ఎక్కువగా నమ్ముకుంటారు. అలాంటి కేసీఆర్ తనకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితిని అనుకూలంగా మార్చుకోకుండా ఉంటారా? అన్నది ప్రశ్న.

జరుగుతున్న పరిణామాల్ని కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారని.. వ్యూహాత్మకంగానే మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనపై విమర్శలు ఎక్కు పెట్టే వారి సంగతి హోల్ సేల్ గా సమాధానం ఇస్తారంటున్నారు. మౌనంగా ఉండటం.. టైం చూసుకొని విరుచుకుపడం.. అప్పటికప్పుడు సీన్ మొత్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో మాస్టర్ అయిన కేసీఆర్.. ఈసారి అదే వ్యూహాన్ని అమలు చేస్తారని చెబుతున్నారు.

దీపావళి తర్వాత ఆయన మొదలెట్టే ఎన్నికల ప్రచారం గతానికి భిన్నంగా ఉంటుందని.. తన ప్రత్యర్థులను ఉతికి ఆరేస్తారని అంటున్నారు. ఈసారి ఎన్నికల వార్ మామూలుగా ఉండదని.. ఒక రేంజ్లో ఉంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కేసీఆర్ రోల్ ను తక్కువగా అంచనా వేస్తే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు.