Begin typing your search above and press return to search.

దానంకు ఓకే..కేసీఆర్ లెక్క‌లు వేరే

By:  Tupaki Desk   |   23 Jun 2018 5:23 AM GMT
దానంకు ఓకే..కేసీఆర్ లెక్క‌లు వేరే
X
ఏఐసీసీ సభ్యుడు - మాజీ మంత్రి - గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ - యూపీఏ చైర్‌ పర్సన్ సోనియాగాంధీ - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి తన రాజీనామా లేఖలను పంపించారు. పార్టీలో బీసీలకు - అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతున్నదని తన లేఖలో దానం పేర్కొన్నారు. రేపోమాపో ఆయన టీఆర్‌ ఎస్‌ లో చేరే అవకాశం ఉంది. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ను కలిశారు. తాను రాజీనామా చేసేందుకు దారితీసిన పరిస్థితులు - భవిష్యత్ కార్యాచరణపై శనివారం దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతారని సమాచారం. ఇదిలా ఉంటే మరో మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్ - ఆయన కుమారుడు విక్రంగౌడ్‌ తోపాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది.

దానం నాగేందర్‌ పార్టీ మారడం కొత్తేం కాదు. గతంలో ఆయన కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి - టీడీపీ నుంచి కాంగ్రెస్‌ లోకి రాత్రికి రాత్రి పార్టీలు మారిన చరిత్ర ఉందని రాజ‌కీయ‌వ‌ర్గాల మాట‌. అలాంటి దానం నాగేంద‌ర్‌ కు కేసీఆర్ ఒకే చెప్ప‌డం వెనుక కార‌ణాలు ఏంట‌నేది అందరిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం. విశ్లేష‌కుల స‌మాచారం ప్ర‌కారం ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ లో టీఆర్‌ ఎస్‌ పార్టీకి నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పటిష్టమైన నాయకత్వం లేదు. దీంతో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోని నాయకులపై దృష్టి పెట్టారు. ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా సనత్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశంపార్టీ తరఫున గెలిచిన వ్యక్తే కావడం గమనార్హం. అలాగే గ్రేటర్‌ పరిధిలో టీఆర్‌ ఎస్‌ పార్టీ టిక్కెట్‌ పై ఎమ్మెల్యేగా సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎక్సైజ్‌ శాఖ మంత్రి టి పద్మారావు ఒక్కరే గెలిచారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఇతర పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు చివరకు టీఆర్‌ ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి సీఎం కేసీఆర్‌ మధ్యంతర ఎన్నికలకు వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే దానం నాగేందర్‌ టీఆర్‌ ఎస్‌ లోకి చేరుతున్నట్టు తెలుస్తోంది.

దానం నాగేందర్‌ టీఆర్‌ ఎస్‌ లో చేరతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఆయన ఎప్పుడూ కొట్టిపారేయలేదు. అదే సమయంలో చాలా కాలం నుంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ టూర్‌ కు దానం డుమ్మా కొట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం టీఆర్‌ ఎస్‌ లో చేరికపై దానం నాగేందర్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తో చర్చించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ పార్టీలోకి ఎవరు వచ్చిన సాదరంగా ఆహ్వానిస్తామని అన్నారు. 60 ఏళ్ల‌ జరగని అభివృద్ధిని కేవలం నాలుగున్నరేళ్ల‌లో సీఎం కేసీఆర్‌ చేసి చూపించారన్నారు. మాజీమంత్రి - సీనియర్‌ నేత దానం నాగేందర్‌ ను.. టీఆర్‌ ఎస్‌ లోకి తీసుకునే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు.