Begin typing your search above and press return to search.

ఒక్కో ఎన్నిక‌కు ఓక్కో చోటు..గంటా గెలుపు మంత్ర‌మిదే

By:  Tupaki Desk   |   24 May 2019 2:31 PM GMT
ఒక్కో ఎన్నిక‌కు ఓక్కో చోటు..గంటా గెలుపు మంత్ర‌మిదే
X
గంటా శ్రీ‌నివాస‌రావు... కాపు సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన రాజకీయ నేత‌గా - అంత‌కుముందు స‌క్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా తెలుగు ప్ర‌జ‌ల‌కు చిర‌ప‌ర‌చితులే. ఏ ఒక్క పార్టీతోనే అంటిపెట్టుకుని ఉండే ర‌కంగా క‌నిపించ‌ని గంటా.... ఎన్ని పార్టీలు మారినా కూడా గెలుపు గుర్రంగానే నిలుస్తున్నారు త‌ప్పించి ఓట‌మి అన్న మాటే ఎరుగ‌కుండా స‌త్తా చాటుతున్నారు. టీడీపీతోనే రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లెట్టిన గంటా... ఆ తర్వాత మ‌రో రెండు పార్టీలు మారి... ఐదేళ్ల క్రితం తిరిగి సొంత గూటికే చేరుకున్నారు. ఇప్పుడు కూడా ఆయ‌న గెలుపుపై చాలా మంది చాలా అనుమానాలు వ్య‌క్తం చేసినా... గంటా మాత్రం తాను గెలుపు గుర్రాన్నేన‌ని నిరూపించుకున్నారు. ఇప్ప‌టిదాకా వ‌రుస‌గా ఐదు సార్లు విజ‌యం సాధించిన గంటా... మ‌రోసారి గెలిస్తే డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటారు.

ఈ రికార్డును ఆయ‌న త‌ప్ప‌నిస‌రిగా చేరుకుంటార‌ని ఇప్పుడు అంతా చెబుతున్నారు. అందుకు కారణంగా ఆయ‌నదిగా మాత్ర‌మే పేరుప‌డిపోయిన గెలుపు మంత్రాన్ని చూపుతున్నారు. నిజంగానే ఐదు సార్లు గెలిచిన గంటా... త‌న‌దైన మంత్రాన్ని అమ‌లు చేసుకుంటూనే స‌క్సెస్ ఫుల్ గా రాణిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా ఆ గెలుపు మంత్ర‌మేమిటన్న విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే అయినా... ఐదో సారి కూడా ఆయ‌న‌కు విజ‌యం చేకూర్చిపెట్టిన ఆ మంత్రాన్ని మ‌రోమారు గుర్తు చేసుకోవ‌డం సంద‌ర్భోచితమే క‌దా. స‌రే... గంటా గెలుపు మంత్రం ఏమిటంటే... ఓ సారి గెలిచిన సీటులో మ‌ళ్లీ వెంట‌నే పోటీ చేయ‌డం ఆయ‌న ఇంటా వంటా లేదు. రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన నాటి నుంచి ఇదే మంత్రాన్ని పాటిస్తూ వ‌స్తున్న గంటా.. వ‌రుస‌గా ఐదు సార్లు జ‌య‌కేతనం ఎగుర‌వేశారు.

రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తొలిసారి 1999లో అనకాపల్లి ఎంపీ(టీడీపీ)గా గంటా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత 2004లో నియోజ‌క‌వ‌ర్గం మారిన గంటా చోడవరాన్ని ఎంపిక చేసుకున్నారు. 199లో ఎంపీగా పోటీ చేస్తే... ఈ ద‌ఫా మాత్రం టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడినా... గంటా మాత్రం విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత 2009 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ నియోజ‌క‌వ‌ర్గం మారారు. ఈ సారి అనకాపల్లి అసెంబ్లీని ఎంచుకున్నారు. పార్టీ కూడా మారారు. త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం నుంచి బ‌రిలోకి దిగారు. ప్ర‌జారాజ్యం చాలా చోట్ల ఓట‌మిపాలైనా గంటా మాత్రం త‌న గెలుపు మంత్రంతో గెలిచేశారు. ఆ త‌ర్వాత చిరు త‌న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయ‌డంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారిపోయిన గంటా... ఏకంగా మంత్రి ప‌ద‌వి కూడా చేప‌ట్టారు.

ఇక గ‌డ‌చిన ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ ను వ‌దిలేసి తిరిగి త‌న సొంత గూటికి చేరిన గంటా... గెలుపు మంత్రాన్ని మాత్రం మార్చ‌లేదు. ఈ సారి కూడా త‌న సీటును మార్చేసుకున్న గంటా... అన‌కాప‌ల్లి నుంచి భీమిలికి మారిపోయారు. వ‌రుస‌గా నాలుగో సారి విక్ట‌రీ సాధించి చంద్ర‌బాబు కేబినెట్ లో కీల‌క మంత్రిగా ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఇక ఇప్ప‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున‌నే బ‌రిలోకి దిగిన గంటా.. గెలుపు మంత్రాన్ని మాత్రం వీడ‌లేదు. ఈ సారి విశాఖ ఉత్తర స్థానాన్ని ఎంచుకున్న గంటా... అంద‌రికీ షాకిస్తూ వ‌రుస‌గా ఐదో సారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే... ప్ర‌తి ఎన్నిక‌కూ త‌న స్థానాన్ని మారుస్తూ వ‌స్తున్న గంటా ఏ పార్టీలో ఉన్నా కూడా ఓట‌మి ఎరుగ‌ని నేత‌గానే కొన‌సాగుతూ వ‌స్తున్నార‌న్న మాట‌. వ‌చ్చేసారి కూడా విజ‌యం సాధిస్తే... గంటా డ‌బుల్ హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డుల‌కు ఎక్కుతార‌న్న మాట‌.