తెలంగాణ బడ్జెట్ లేటుకు ఎలక్షన్ హామీలే కారణం?

Mon Feb 11 2019 11:27:00 GMT+0530 (IST)

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ - మహమూద్ అలీ తప్ప మంత్రివర్గమే లేదు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలవుతున్నా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అంతేనా... ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ఇంతవరకు ప్రవేశపెట్టలేదు. అసలు బడ్జెట్ ముసాయిదా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. అందుకుకారణం.. ఎన్నికల హామీలేనని.. ఆ హామీల వల్ల అదనంగా అయ్యే ఖర్చుల లెక్కపై స్పష్టత లేకపోవడంతో బడ్జెట్ కూడా లేటవుతున్నట్లు సమాచారం.
   
తాత్కాలిక బడ్జెట్ అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటికీ నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అవసరమయ్యే నిధులపై అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ. సుమారు రెండు లక్షల కోట్లకు బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్నారు.
   
ఎలక్షన్లలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ప్రధానంగా ఆసరా పెన్షన్లు పెంచడం... 57 ఏళ్ల నుంచే ఇవ్వడం.  లక్ష లోపు వ్యవసాయ రుణాలను మాఫీ. రైతుబంధు పథకంలో భాగంగా ఎకరాకు ఏడాదికి ఎనిమిది వేల నుండి పదివేల రూపాయలకు పెంపు. నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి.. వంటి హామీలున్నాయి. వీటన్నిటికీ గతం కంటే ఖర్చు రెట్టింపు కానుంది. ఆసరా పెన్షన్ పథకానికి ఇప్పటివరకు ఏడాదికి 6600 కోట్లు ఖర్చవుతోంది. అన్ని రకాల పెన్షన్లను రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇవ్వడంతో  13200 కోట్లు అవుతుంది. అయితే పెన్షన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుండి 57 ఏళ్ల కు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. 57 ఏళ్లు నిండిన వారి సంఖ్యను గుర్తించి ఈ ఏప్రిల్ నుండి పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితా ఆధారంగా 57 ఏళ్లు నిండిన వారి సంఖ్యను లెక్కిస్తున్నారు. అధికారుల ప్రాథమిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 10 నుండి 13 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.దీంతో ఆసరా పెన్షన్ లలో 57 ఏళ్లు నిండిన వారిని కూడా కలిపి నిధులు కేటాయిస్తున్నారు. అన్నీ కలిపితే ఆసరా పెన్షన్ లకు ఏడాదికి 15 వేల కోట్లు అవసరమని సమాచారం.
   
ఇక.... రైతుబంధు పథకానికి 15 వేల కోట్లు అవసరమని తేలింది. లక్ష లోపు రుణాల మాఫీకి 24 వేల కోట్లు అవసరమని గుర్తించారు. ఎటొచ్చీ నిరుద్యోగ భృతి దగ్గర ఆలస్యమవుతోంది. నిరుద్యోగుల ఖచ్చితమైన సంఖ్య ప్రభుత్వం వద్ద లేదు. నిరుద్యోగుల లెక్కలు లేకుండా ఈ పథకానికి నిధులు కేటాయించ లేమని ఆర్థిక శాఖ చెప్తోంది. దీంతో నిరుద్యోగుల సంఖ్య తేలే వరకు నిరుద్యోగ భృతి పథకానికి నిధుల కేటాయింపు ఉండదు. ఇలాంటి అన్ని సమస్యల మధ్య ఆర్థిక శాఖ బడ్జెట్ రూపకల్పనలో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.