Begin typing your search above and press return to search.

సీఎం కుర్చీ త్యాగం వెనుక కాంగ్రెస్ వ్యూహ‌మిదే!

By:  Tupaki Desk   |   16 May 2018 4:26 AM GMT
సీఎం కుర్చీ త్యాగం వెనుక కాంగ్రెస్ వ్యూహ‌మిదే!
X
యావ‌త్ దేశం దృష్టిని ఆక‌ర్షించిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు అనుకున్న‌ట్లు అస్స‌లు జ‌ర‌గ‌లేదు. హంగ్ అంటూ ప‌లు మీడియా సంస్థ‌లు చెప్పినా.. అలాంటిదేమీ లేద‌ని చెప్పాలి. మేజిక్ మార్క్ కు కేవ‌లం 8 సీట్ల దూరంలో బీజేపీ ప‌రుగు ఆగింది. అయితే హంగ్ లేదంటే.. ప‌క్కా విజ‌య‌మ‌ని లెక్క‌లేసుకున్న క‌మ‌ల‌నాథుల‌కు క‌న్న‌డిగులు ఇచ్చిన తీర్పుతో కిందామీదా ప‌డుతున్నారు. క‌ర్ణాట‌క ఫ‌లితాల నేప‌థ్యంలో బీజేపీ ఒక‌ప‌క్క చ‌క్రం తిప్పుతుంటే.. కాంగ్రెస్‌.. జేడీఎస్ లు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ప‌లు వాద‌న‌లు తెర మీద‌కు తీసుకురావ‌టంతో పాటు.. గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటూ కొన్ని వాద‌న‌లు వినిపిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే.. క‌ర్ణాట‌క‌లో తాము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి అవ‌కాశం ఉంద‌ని.. అందుకు రాజ్యాంగ‌బ‌ద్ధంగా కూడా హ‌క్కు ఉంద‌న్న వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌టానికే.

ఒక‌వేళ బీజేపీ కానీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. త‌మ‌కు అవ‌కాశం ద‌క్క‌నీయ‌కుండా మోడీషాలు పావులు క‌దిపి అన్యాయం చేశార‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్లే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశార‌ని చెప్పాలి.

మోడీ.. అమిత్ షా లాంటి నేత‌లు సీన్లో ఉన్న‌ప్పుడు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌ర‌న్న‌ది తెలిసిందే. అందులోకి క‌ర్ణాట‌క‌కు గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న వ్య‌క్తి మోడీకి ప‌ర‌మ విధేయుడు. ఒక‌ప్పుడు మోడీ కోసం త‌న సీటునే త్యాగం చేసిన ఘ‌న చ‌రిత్ర ఆయ‌న సొంతం.

అలాంటి ఆయ‌న‌.. అమిత్ షా బెంగ‌ళూరుకు వ‌చ్చే వ‌ర‌కూ ఎవ‌రికి అపాయింట్ మెంట్ ఇవ్వ‌లేదంటేనే.. రాబోయే రోజుల్లో విష‌యాలు ఎలా ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ప‌వ‌ర్ కోసం కాంగ్రెస్ విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు క‌నిపిస్తున్నా.. అస‌లు వ్యూహం వేరే ఉంద‌ని చెబుతున్నారు. సీఎం సీటును సైతం ఇచ్చేసేందుకు కాంగ్రెస్ డిసైడ్ కావ‌టం వెనుక అస‌లు కార‌ణం వేరే అని చెప్ప‌క త‌ప్ప‌దు.

224సీట్లు ఉన్న ఒక రాష్ట్రంలో కేవ‌లం 38 సీట్లు మాత్ర‌మే తెచ్చుకున్న పార్టీకి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌టానికి కాంగ్రెస్ లాంటి పార్టీ ఓకే అన‌టం మామూలా? సీఎం కుర్చీ కోసం ఆశ‌ప‌డితే.. మోడీ లాంటి ప్ర‌త్య‌ర్థిని ఎదుర్కోవ‌టం క‌ష్ట‌మ‌న్న విష‌యం కాంగ్రెస్ కు తెలియంది కాదు. నిజానికి క‌ర్ణాట‌క ఫ‌లితం ఎలా ఉన్నా.. కాంగ్రెస్ అస‌లు ల‌క్ష్య‌మంతా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లే. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ను క‌న్న‌డ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించార‌ని చెప్ప‌టంలో మ‌రో మాట‌కు అవ‌కాశం లేదు. రిజెక్ట్ చేసిన చోట అధికారానికి పాకులాడితే మ‌రింత ప‌రువు పోవ‌టం ఖాయం. అంత‌కు మించి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త మ‌రింత పెరిగే వీలుంది.

దీనికి భిన్నంగా తాము అధికారాన్ని కోరుకోవ‌టం లేద‌ని.. తాము తీవ్రంగా వ్య‌తిరేకించే పార్టీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్న సందేశం ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. జేడీఎస్ కు తాము భేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తామ‌ని.. త‌మ‌కు ప‌ద‌వులు ఏమీ వ‌ద్ద‌ని చెప్పినా.. దేవెగౌడ మాత్రం కాంగ్రెస్ కూడా ప్ర‌భుత్వంలో ఉండాల‌ని.. అప్పుడు మాత్ర‌మే తాము సీఎం ప‌ద‌విని చేప‌ట్టే ప్ర‌తిపాద‌న‌ను అంగీక‌రిస్తామ‌ని స్వ‌యంగా చెప్ప‌ట‌మే ఆ పార్టీకి కావాల్సింది. తాను కోరుకున్న‌ట్లే దేవెగౌడ నోటి నుంచి వ‌చ్చిన మాట‌కు ఓకే చెప్పేసిన కాంగ్రెస్‌.. 20 మంది మంత్రులు జేడీఎస్ ఏర్పాటు చేసే ప్ర‌భుత్వంలో ఉండ‌టానికి ఓకే చెప్పేశారు.

మోడీషాలు రంగంలోకి దిగి బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినా.. ప్ర‌జ‌ల్లో మాత్రం కాంగ్రెస్ త్యాగ‌మ‌యి అన్న భావ‌న క‌లిగించ‌టంతో పాటు.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌మ్మ‌క‌మైన పార్టీగా మారి.. ప‌లువురు కొత్త మిత్రుల్ని తెచ్చి పెడుతుంద‌న్న ఆశ‌తో ఉంది. ఈ లక్ష్యంతోనే క‌ర్ణాట‌క పీఠం బంగార‌ప్పుకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింద‌ని చెబుతున్నారు.