Begin typing your search above and press return to search.

బాబు కాన్ఫిడెన్స్ అదేనా?

By:  Tupaki Desk   |   21 May 2019 5:48 AM GMT
బాబు కాన్ఫిడెన్స్ అదేనా?
X
ఆదివారం సాయంత్రం ఆరు గంట‌లు దాటింది మొద‌లు.. వివిధ మీడియా సంస్థ‌లు.. స‌ర్వే సంస్థ‌లు తాము చేసిన ఎగ్జిట్ పోల్ స‌ర్వేల పేరుతో పెద్ద ఎత్తున స‌ర్వే ఫ‌లితాల్ని ప్ర‌క‌టించ‌టం షురూ చేశారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌హా అయితే.. ఏడెనిమిది కంటే ఎక్కువ ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు రాలేదు. ఈసారి అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి.

ఆస‌క్తిక‌ర అంశం ఏమంటే.. విడుద‌లైన అన్నిఎగ్జిట్ పోల్స్ మోడీ గెలుపు గ్యారెంటీ అని.. ఆయ‌న రెండోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ‌గా ఫ‌లితాలు వ‌స్తున్న‌ట్లు తేల్చాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ చూసిన విప‌క్షాలు తొలుత షాక్ కు గురైనా.. సోమ‌వారం మ‌ధ్యాహ్ననానికి మాత్రం ప‌రిస్థితిలో కాస్త మార్పు వ‌చ్చింది. ఈ ఎగ్జిట్ పోల్స్ పుణ్య‌మా అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి భేటీ ర‌ద్దు అయ్యింది.

దీంతో విప‌క్షాలు మొత్తం నిరాశ‌.. నిస్పృహ‌కు లోనైన‌ట్లుగా సంకేతాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం మిగిలిన వారికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ అమ‌రావ‌తి నుంచి ప‌శ్చిమ బెంగాల్ కు ప‌య‌మ‌న‌మ‌య్యారు. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌త‌తో భేటీ అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ లో పేర్కొన్న‌ట్లుగా ఎన్డీయే ప‌క్షానికి అన్ని సీట్లు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని.. 200 ద‌గ్గ‌రే ఆగిపోతుంద‌న్న వాద‌న‌ను వినిపించారు.

కేంద్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు సంబంధించిన వ్యూహం మీద మాట్లాడారు. విప‌క్షాలు ఏకం కాకుండా ఉండేందుకు మోడీ జిమ్మిక్కు ప్ర‌ద‌ర్శించార‌ని పేర్కొన్నారు. బాబు మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో ఐక్య‌తా య‌త్నాలు షురూ అయ్యాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు అవ‌స‌ర‌మైతే కూట‌మి నాయ‌క‌త్వాన్ని త్యాగం చేయ‌టానికి సైతం రెఢీగా ఉన్న‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ ను న‌మ్మ‌నంటూ బాబు.. అదే ప‌నిగా విప‌క్షాల్ని క‌లిపే ప్ర‌య‌త్నాలు ఎందుకు చేస్తున్న‌ట్లు? అన్నదిప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఏపీలో అధికారం చేజారినా కేంద్రంలో ప‌ట్టు ద‌క్కించుకోవాల‌న్న‌దే బాబు భావ‌న‌గా చెబుతున్నారు. కేంద్రంలో మోడీ మ‌ళ్లీ అధికారం రావ‌టం సాధ్యం కాద‌న్న గ‌ట్టి న‌మ్మ‌కంతో బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న ద‌గ్గ‌ర నివేదిక‌లు ఉన్నాయ‌ని.. మోడీ మ‌ళ్లీ ప్ర‌ధాని కావ‌టం క‌ల్ల అన్న గ‌ట్టి ధీమాతో ఉన్న ఆయ‌న‌.. మోడీయేత‌ర ప‌క్షాల్నిఒక చోట‌కు చేర్చ‌టం ద్వారా.. తాను కీల‌కం కావాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ కార‌ణంతోనే ఆయ‌న విప‌రీతంగా తిరుగుతూ.. త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో అంద‌రిని ఏక‌తాటి మీద‌కు తేవాల‌ని త‌పిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. స్టేట్ లో ప‌వ‌ర్ చేజారినా.. సెంట్ర‌ల్ లో త‌న ప‌ట్టును పెంచుకుంటే.. ఉనికికి ఇబ్బంది ఉండ‌ద‌న్న ఆలోచ‌న‌తోనే.. మోడీకి వ్య‌తిరేకంగా జ‌ట్టు క‌ట్టే ప‌నిలో బాబు బిజీగా ఉన్నార‌ని చెబుతున్నారు.