బాబు..ముందు ఆ భ్రమల్లోంచి బయటపడు

Fri Nov 09 2018 09:46:43 GMT+0530 (IST)

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురించి ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. చిత్రంగా టాపిక్ పాతదే!. అదే సర్వం తానే అనే కోణంలో ఆయన ఇచ్చుకునే కలరింగ్ - చేసుకునే ప్రచారం గురించి. తనకు కాస్త కనెక్ట్ అయి ఉన్నా చాలు...సదరు అంశాన్ని తన ఖాతాలో వేసుకోవడంలో చంద్రబాబుది అందెవేసిన చెయ్యి. అయితే ఇప్పుడు `చేతిలో చెయ్యి వేసి` నడుస్తున్న బాబు మరోవైపు అదే సమయంలో చేస్తున్న ఆసక్తికరమైన రాజకీయ ప్రయాణం బాబు గురించి - ఆయన ఉన్న భ్రమల గురించి కొత్త చర్చను  తెరమీదకు తెచ్చిందంటున్నారు.ఇంతకీ విషయం ఏమిటంటే...ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీపై యుద్ధం పేరుతో కొత్త ప్రచారం ఒకటి తెరమీదకు తెచ్చిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు ఎంచక్కా బీజేపీతో దోస్తీ చేసిన బాబు...ఆ పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకత - ఏపీకి ఏం చేయలేని స్థితిలో...తనపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు బీజేపీ వ్యతిరేక పోరు అంటూ కొత్త గళం అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్రంపై యుద్ధమంటూ ఆయన స్వయం ప్రకటిత ప్రాంతీయ పార్టీల నాయకుడిగా మారిపోయారు. తేల్చుకునేందుకు నేను నాయకత్వం వహిస్తా...మోడీ కంటే నేనే సీనియర్ అంటూ ప్రకటించుకున్నారు. అయితే ఇంతటి గంభీర ప్రకటనలు చేస్తున్న బాబు ఏం చేస్తున్నారయ్యా అంటే...అందరు ముఖ్యమైన నాయకుల దగ్గరకు వెళ్లి కలుస్తున్నారు. అంతేతప్ప ఎవరూ బాబు గారి వద్దకు వచ్చి ఆయనతో భేటీ అవడం లేదు.

ఇక ఏ అంశాన్ని అయినా తన ఖాతాలో వేసుకునే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు తాజాగా మాజీ ప్రధాని దేవగౌడను కలిశారు. ఈ భేటీ ఎప్పుడు జరిగిందంటే...కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ - జేడీఎస్ లు గెలుపొందిన తర్వాత. బీజేపీ ఓటమి అనంతరం. ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లోని తెలుగువారి ఓట్ల వల్లే...బీజేపీ ఓడిందని చెప్పుకోవడం కోసం బాబు ఈ తరహా టూరు వేశారనేది బహిరంగ రహస్యం. అందుకే బాబు లాంటి దేశంలోనే సీనియర్ నేతను....తొలిసారిగా మంత్రి అయిన కేటీఆర్ కూడా బాబు తీరును ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రతీదాన్ని రాజకీయం చేస్తారన్నారు. ``కాంట్రాక్టర్ల మీద ఐటీ దాడులు అయితే చంద్రబాబు రాజకీయం చేస్తారు. నాలుగేండ్లపాటు మోడీతో అంటకాగి ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తారు. మాపార్టీ నాయకులు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కుమారుడి ఇంటిపైనా ఐటీ దాడులు చేశారు. అయినా ఎక్కడా రాజకీయ హంగామా చేయలేదు. కానీ చంద్రబాబు మాత్రం ఏపీలో జరిగిన ఐటీ దాడులపై క్యాబినెట్ మీటింగ్ లోనూ చర్చించారు. జగన్ పై దాడి జరిగిన తరువాత మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన కోలుకోవాలని - ఖండిస్తూ ట్వీట్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేశారు. చంద్రబాబు ప్రతిదానికి భయాందోళనలకు గురవుతున్నారు. థాట్ పోలీసింగ్ చేస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు.. అన్ని గమనిస్తున్నారు. సరియైన సమయంలో తీర్పు ఇస్తారు`` అంటూ బాబు ప్రచారం - ఆయన అస్సలు మార్చుకోలేని విధానాన్ని కుండబద్దలు కొట్టేసినట్లు చెప్పారు.