Begin typing your search above and press return to search.

భాజపాను చంద్రబాబు దూరం పెట్టడంలో సీక్రెట్!

By:  Tupaki Desk   |   11 Aug 2017 5:30 PM GMT
భాజపాను చంద్రబాబు దూరం పెట్టడంలో సీక్రెట్!
X
ఏపీలో పాలక కూటమిలోని పక్షాల మధ్య మిత్ర ధర్మం పాటించడం అనేది అసలు ఉన్నదా లేదా అనే సందేహాలు ఇప్పుడు పలువురిలో తలెత్తుతున్నాయి. సాధారణంగా సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు.. ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తే.. సదరు సంకీర్ణ భాగస్వాముల్లో ఎవరు నిలబడినాసరే.. రెండో పార్టీ కూడా వారికి సహకరించడమూ.. వారికి అనుకూలంగా ప్రచారం నిర్వహించడమూ రివాజు. కానీ నంద్యాల ఉప ఎన్నిక విషయంలో గెలుపు అధికార పార్టీకి చాలా కీలకం అయినప్పటికీ.. వారు తమ మిత్ర పక్షం ఆసరాను నామమాత్రంగా కూడా తీసుకోవడం లేదు. అసలు భాజపా నాయకుల్ని నంద్యాల పరిసరాల్లోకి కూడా రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.

అయితే ఇలా చంద్రబాబునాయుడు, భాజపాను నంద్యాల ప్రచారానికి దూరం ఉంచడంలోనూ ఒక మతలబు ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నంద్యాల నియోజకనర్గంలో ముస్లింల జనాభా చాలా ఎక్కువ. అసలే చంద్రబాబునాయుడుకు ముస్లింలలో ఉన్న పట్టు చాలా తక్కువ. దానికి తగినట్లుగా.. ప్రస్తుత చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడిన సమయానికి.. ఆ ప్రభుత్వంలో ఒక్కరంటే ఒక్కడు కూడా ముస్లింలు ఎమ్మెల్యేగా లేరంటే పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ నేపథ్యంలో ముస్లింల బాగోగులు చూసే మైనారిటీ శాఖను తీసుకువెళ్లి ఓ రెడ్డి చేతిలో పెట్టారు. ఇటీవలి విస్తరణ సమయానికి మైనారిటీలు కొందరు పాలక పార్టీలో తయారయ్యారు గానీ.. వారెవ్వరికీ మంత్రి పదవి దక్కలేదు. ఆ రకంగా చంద్రబాబు మీద ముస్లింలలో వ్యతిరేకత బాగానే ఉంది. దానికి తోడు భాజపాతో అంటకాగుతున్న పార్టీగా సాంప్రదాయంగా ముస్లింలు వ్యతిరేకించే ధోరణి కూడా ఉంది.

ఈ రెండు కారణాల దృష్ట్యా అసలే ముస్లిం జనాభా చాలా ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో.. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లుగా ... భాజపాను ప్రచారానికి తీసుకువస్తే గనుక.. ముస్లిం వర్గీయుల్లో మొదటికే మోసం వస్తుందని తెలుగుదేశం భయపడుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయినకాడికి తమ పార్టీ వారు ప్రచారం చేసుకుంటే చాలునని, భాజపా ఓట్లు గనుక నియోజకవర్గంలో ఉంటే ... అవి ఎటూ తమకే పడతాయని చంద్రబాబు భావిస్తున్నారట. ఆ కారణాల చేతనే.. భాజపా మిత్ర పక్షం అయినప్పటికీ.. ప్రచారానికి వారిని ఆహ్వానించకుండా దూరం పెడుతున్నారని అంతా అనుకుంటున్నారు.