Begin typing your search above and press return to search.

చంద్రుళ్ల ఢిల్లీ యావ వెనుక లెక్క‌లు ఇవే!

By:  Tupaki Desk   |   19 May 2019 5:23 AM GMT
చంద్రుళ్ల ఢిల్లీ యావ వెనుక లెక్క‌లు ఇవే!
X
దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. వాటికి అధ్య‌క్షులు ఉన్నారు. అంతేనా? రాష్ట్రాల‌కు.. వాటి ముఖ్య‌మంత్రుల‌కు కొద‌వ లేదు. కానీ.. మ‌రే ముఖ్య‌మంత్రికి లేని ఢిల్లీ యావ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కే ఎక్కువ ఎందుకు? అన్న‌దిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ చంద్రుడు సౌంతిండియాలోని కీల‌క రాష్ట్రాలైన కేర‌ళ‌.. క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడుకు చెందిన ముఖ్య‌నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం.. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం వ్య‌వ‌హ‌రించాల్సిన తీరుపై త‌న అభిప్రాయాన్ని చెప్పిన వైనం తెలిసిందే.

తానేం చెబితే దానికి త‌లూపేస్తార‌న్న న‌మ్మ‌కానికి గండిపడేలా కేసీఆర్ సౌతిండియా టూర్ జ‌రిగింద‌న్న మాట వినిపించింది. ఇదిలాఉంటే.. తాజాగా ఏపీ చంద్రుడు ఇప్పుడు ఢిల్లీలో అదే ప‌నిగా ప‌లువురు నేత‌ల్ని వెళ్లి క‌ల‌వ‌టం క‌నిపిస్తుంది. కాంగ్రెస్‌.. క‌మ్యూనిస్ట్‌..ఎన్సీపీ.. ఎస్పీ.. బీఎస్పీ..ఆమ్ ఆద్మీ.. ఇలా ప్ర‌తి పార్టీ అధినేత‌తో ఆయ‌న మాట్లాడుతున్నారు.

ఇంత‌మంది ముఖ్య‌మంత్రుల‌కు లేని ఢిల్లీ యావ ఇద్ద‌రు చంద్రుళ్ల‌కే ఎందుకు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బాబు ఓట‌మి ఖాయ‌మ‌న్న మాట ప్ర‌జ‌ల్లో స్ప‌ష్టంగా వినిపిస్తోంది. అదే జ‌రిగితే బాబుకు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొంటారు.

మోడీతో జ‌త‌క‌ట్టి 2014లో ప‌వ‌ర్లోకి వ‌చ్చిన ఆయ‌న గడిచిన ఐదేళ్ల‌లో ఎంత ఆరాచ‌క పాల‌న సాగించార‌న్న దానిపై ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చెబుతూ ఉంటారు. ఇలాంటివేళ‌.. బాబు చేతికి ప‌వ‌ర్ రాకుండా జ‌గ‌న్ చేతికి వ‌స్తే.. ఆయ‌న‌కు చుక్క‌లు ఖాయం. అలాంటివేళ‌.. కేంద్రం ద‌న్ను త‌న‌కు ఉంద‌న్న న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తే.. త‌న‌పై వ‌చ్చే ఒత్తిడి త‌గ్గుతుంద‌న్న అంచ‌నాలో ఉన్న‌ట్లు చెబుతారు.

మ‌రోవైపు మోడీతో ఫైట్ ను షురూ చేసిన నేప‌థ్యంలో.. బాబు లెక్క సెట్ చేసేందుకు మోడీ సైతం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన వేళ‌.. కేంద్రంలో మిత్రుల అవ‌స‌రం బాబుకు ఎక్కువైంది. ఏపీలో ప‌వ‌ర్ చేజారి.. బ‌ల‌మైన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌తో త‌న‌కు వ‌చ్చే ఇబ్బందులు జాతీయ స్థాయి కూట‌మిలో తాను కీల‌కం కావ‌టం ద్వారా.. ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని అధిగ‌మించొచ్చ‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌ర‌కంగా చూస్తే.. బాబు ఢిల్లీ ప్ర‌య‌త్నం మొత్తం త‌న ఉనికిని కాపాడుకోవ‌టంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

మ‌రి.. తెలంగాణ చంద్రుడి ఢిల్లీ యావ‌లో ఉన్న లెక్క ఏమిట‌న్న‌ది చూస్తే.. 2014లో ప‌వ‌ర్లోకి వ‌చ్చి.. 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తాను చెప్పిన‌ట్లే.. భారీగా సీట్లు గెలిచిన నేప‌థ్యంలో రానున్న ఐదేళ్ల వ‌ర‌కూ ఆయ‌న‌కు టైం ఉంది. కాకుంటే.. సంక్షేమ ప‌థ‌కాలు.. భారీ ఎత్తున ప్రాజెక్టులు నెత్తిన వేసుకోవ‌టంతో ధ‌నిక రాష్ట్రమైన తెలంగాణ ఇప్పుడు నిధుల కొర‌త‌తో తెగ ఇబ్బంది పుడుతోంది. ఈ ఇబ్బందిని అధిగ‌మించాలంటే కేంద్రం ద‌న్ను అవ‌స‌రం అవుతుంది.

కేంద్రం ముందు నిలుచొని.. అదే ప‌నిగా నిధులు అడిగే క‌న్నా.. షంషేర్ గా త‌నకు అవ‌స‌ర‌మైన వాటాను తాను తీసుకోవ‌టానికి ఢిల్లీలో చ‌క్రం తిప్ప‌టం మిన‌హా మ‌రో దారి క‌నిపించ‌ని ప‌రిస్థితి

తెలంగాణ ప్ర‌స్తుత‌ ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా.. ఢిల్లీలో చ‌క్రం తిప్పితే కానీ.. తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల నుంచి గ‌ట్టెక్కే అవ‌కాశం లేదు. ఈ కార‌ణంతోనే ఢిల్లీ ప‌వ‌ర్ త‌న చేతుల్లో ఉండాల‌న్న‌ది తెలంగాణ చంద్రుడి లెక్క‌గా చెప్పాలి. ఏపీ చంద్రుడు ఉనికి కోసం ఢిల్లీ మీద గంపెడు ఆశ‌లు పెట్టుకుంటే.. తెలంగాణ చంద్రుడు మాత్రం ప‌వ‌ర్ తో రాష్ట్రానికి మ‌రిన్ని నిధులు తెచ్చుకోవాల‌న్న ప్ర‌య‌త్నంలో ఎవ‌రికి వారు బిజీగా ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.