Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తికి 'యాపిల్' బ్యాచ్ ఎందుకొస్తుందంటే..

By:  Tupaki Desk   |   27 April 2017 5:22 AM GMT
అమ‌రావ‌తికి యాపిల్ బ్యాచ్ ఎందుకొస్తుందంటే..
X
ఆలూ లేదు చూలూ లేదు మొగుడు పేరు సోమ‌లింగం అన్న‌ట్లుగా ఉంది ఏపీ స‌ర్కారు య‌వ్వారం. ప్ర‌తి చిన్న విష‌యాన్ని అతిగా ప్ర‌చారం చేసుకోవ‌టం.. జ‌రిగిన దానికి భిన్నంగా చెప్పుకోవ‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు చేత‌నైనంత బాగా మ‌రెవ‌రికీ చేత‌కాద‌న్న విమ‌ర్శ‌ను ప‌లువురు చేస్తుంటారు. దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న తీరు ఉంటుంద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది.

తాజాగా బాబు నోటి వెంట యాపిల్ మాట జోరుగా వినిపిస్తోంది. ఏపీకి యాపిల్ వ‌స్తుందంటూ స‌ర్ ప్రైజ్ చేసిన ఆయ‌న మాట‌లు చూసిన‌ప్పుడు.. ఇంకేముంది? రావ‌ట‌మే ఆల‌స్యం అన్న‌ట్లుగా చెప్ప‌టం క‌నిపిస్తోంది. మ‌రి.. బాబు చెప్పిన‌ట్లే యాపిల్ టీం వ‌చ్చేస్తుందా? వారు వ‌చ్చే లెక్క ఎక్క‌డ వ‌ర‌కూ వ‌చ్చింది? అస‌లు ఏపీకి రావాల‌ని యాపిల్ భావిస్తోందా? వ‌స్తే.. ఎక్క‌డ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది? ఎందుకు? అంటూ చాలానే ప్ర‌శ్న‌లు తెర‌మీద‌కు వ‌స్తాయి.

ఇదే విష‌యం మీద లెక్క తేల్చేందుకు ప్ర‌య‌త్నిస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డ‌య్యాయి. వాస్త‌వానికి కర్ణాట‌క రాజ‌దాని బెంగ‌ళూరులో యాపిల్ సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని డిసైడ్ అయ్యారు. అయితే.. అక్క‌డ ఫ్లాంటు ఏర్పాటు చేసేందుకే సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌టంతో.. బెంగ‌ళూరులో ఫ్లాంటు పెట్టాల‌న్న అంశాన్ని క్యాన్సిల్ చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ విష‌యాన్ని గుర్తించిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. త‌న‌దైన శైలిలో యాపిల్ టీంను సంప్ర‌దించ‌టం షురూ చేశారు.

త‌మ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాలంటూ కోర‌ట‌మే కాదు.. యాపిల్ సంస్థ ప్ర‌తినిధుల‌తో ఏపీ ఉన్న‌తాధికారులు ఒక టెలీ కాన్ఫ‌రెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా రెండు వ‌ర్గాలు ప‌లు అంశాల మీద చ‌ర్చించుకున్నాయి. త‌మ రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు సానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని.. ఫ్రెండ్లీ ప్ర‌భుత్వం ఉంద‌న్న మాట‌ను చెప్పిన ఏపీ అధికారుల మాట‌ల నేప‌థ్యంలో.. యాపిల్ ప్ర‌తినిధుల‌కు కొన్ని సందేహాలు వ‌చ్చాయి. వీటి నివృతి కోసం తాజాగా అమ‌రావ‌తికి రావాల‌ని యాపిల్ అధికారిక బృందం డిసైడ్ అయ్యింది.

ప్రాజెక్టుకు సంబంధించిన చ‌ర్చ‌లు తొలిద‌శ‌లో ఉన్న నేప‌థ్యంలో.. ఈ ఇష్యూకు సంబంధించిన అంశాల్ని చ‌ర్చించేందుకు యాపిల్ సంస్థకు చెందిన ద్వితీయ‌శ్రేణి అధికారుల్ని పంప‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. తొలుత వీరు.. త‌మ‌కున్న సందేహాల మీద దృష్టి పెట్టి.. వాటి విష‌యంలో ఏపీ స‌ర్కారు స్పంద‌న ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని చూసిన త‌ర్వాత‌.. త‌దుప‌రి చ‌ర్చ‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉందంటున్నారు. ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పారిశ్రామిక విధానాల్ని.. ప్రోత్సాహాకాల్ని స్వ‌యంగా తెలుసుకునేందుకు తాజా చ‌ర్చ ఉప‌క‌రిస్తుంద‌ని భావిస్తున్నారు.

త‌మ కంపెనీకి చెందిన ద్వితీయ‌శ్రేణి ప్ర‌తినిధుల‌కు పంపుతామ‌న్న‌ స‌మాచారానికి ఏపీ ప్ర‌భుత్వం పాజిటివ్ గా రియాక్ట్ ఆయ్యింది. దీంతో శుక్ర‌వారం యాపిల్ ప్ర‌తినిధులు అమ‌రావ‌తికి రానున్నారు. ఈ ముచ్చట చూసిన‌ప్పుడు.. ద్వితీయ శ్రేణి అధికారుల మీటింగ్ అంతా బాగా అయి.. ఏపీ స‌ర్కారు ఐడియాల‌జీ యాపిల్ తో సెట్ అయ్యి.. త‌ర్వాతి లెవెల్ మీటింగ్ పూర్తి అయ్యాక బండి కాస్త ముందుకు క‌ద‌లిన‌ట్లుగా భావించొచ్చు. కానీ.. అలాంటిదేమీ లేకుండానే.. ఏపీలో ఏదో జ‌రిగిపోతున్న‌ట్లుగా.. యాపిల్ కంపెనీ వ‌చ్చేస్తున్న‌ట్లుగా.. వేలాది ఉద్యోగాలు వ‌స్తున్న‌ట్లుగా వార్త‌లు వండ‌టంలో అర్థం లేద‌న్న మాట వినిపిస్తోంది. జ‌రిగిన దానికి మించిన ప్ర‌చారాన్ని ఇప్ప‌టికైనా బాబు స‌ర్కారు త‌గ్గిస్తే మంచిద‌న్న సూచ‌న‌లు ప‌లువురు చేస్తున్నారు. ఇలాంటి మాట‌ల్ని బాబు అండ్ కో ప‌ట్టించుకుంటుందా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/