Begin typing your search above and press return to search.

జనవరి 20నే ట్రంప్ ప్రమాణస్వీకారం ఎందుకు?

By:  Tupaki Desk   |   19 Jan 2017 5:06 AM GMT
జనవరి 20నే ట్రంప్ ప్రమాణస్వీకారం ఎందుకు?
X
ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం చేయటానికి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడో ముగిసినా.. విజయం సాధించిన వ్యక్తి జనవరి 20 వరకూ వెయిట్ చేయాల్సిందే. ఎన్నికలు ఎప్పుడు ముగిసినా.. ప్రమాణస్వీకారం చేసేది మాత్రం.. ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చే జనవరి 20నే. ఎందుకలా? అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవానికి..జనవరి 20కి లింకేమిటి? అన్నది చూస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

నిజానికి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తికి మొదట్లో మార్చి 4న ప్రమాణస్వీకారం చేసేవారు. ఈ సంప్రదాయం దాదాపు 140 ఏళ్లపాటు సాగింది. 1932లో ఎప్ డీ రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత మార్చి 4నే అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే.. అదే రూజ్వెల్ట్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మాత్రం అధ్యక్షుల వారి ప్రమాణస్వీకారోత్సవాన్ని జనవరి 20కి మార్చేశారు. అప్పటినుంచి జనవరి 20న అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవాన్ని నిర్వహించటం అలవాటుగా మారిపోయింది.

నవంబరులో ముగిసే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు.. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారానికి ఎందుకంత సమయం అంటే.. ఈ విధానాన్ని స్టార్ట్ చేసినప్పుడు ప్రయాణసౌకర్యాలు సరిగా లేని కారణంగా (18వ శతాబ్దంలో) దేశ వ్యాప్తంగా ఉన్న వారంతా ప్రయాణం చేసి.. రాజధాని చేరుకునేందుకు తగిన సమయం కావాలన్న ఉద్దేశంతో నాలుగు నెలలు ఆలస్యంగా ప్రమాణస్వీకారోత్సవ తేదీని ఫిక్స్ చేశారు. తర్వాతి కాలంలో అదో సంప్రదాయంగా మారిపోయింది.

వాస్తవానికి మొదట్లో ఏప్రిల్ 4వ తేదీ (మొదటి అధ్యక్షడి ప్రమాణస్వీకారోత్సవం) జరిగింది. తరవ్త దాన్ని మార్చి 4కు ఫిక్స్ చేశారు. 1933లో 20వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రమాణం తేదీని మార్చారు. ఇక.. ప్రమాణం మహోత్సవం రోజున ఏం చేస్తారన్నది చూస్తే.. ఆసక్తికరంగా ఉంటుంది.

జనవరి 20 మధ్యాహ్నం 12 గంటల సమయంలో లేదంటే కాస్త అటూఇటూగా కొత్త అధ్యక్షుల వారితో ప్రమాణం చేయిస్తారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొత్త అధ్యక్షుని చేత ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం చేశాక.. అధ్యక్షుడు తొలిసారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు ట్రంప్ ను కూడా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం దాదాపు నాలుగు గంటల వరకూ సాగుతుంది. అదే సమయంలో.. అటు వైట్ హౌస్ లో పాత అధ్యక్షుల వారి సామాన్లను ప్యాక్ చేయటం.. కొత్త అధ్యక్షుల వారి మనసుకు నచ్చేలా.. వారి అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు మొత్తాన్ని నాలుగు గంటల సమయంలోనే పూర్తి చేస్తారు. అది కూడా ఎంత పక్కాగా అంటే.. అధ్యక్షుల వారు తాను ఉదయమే ఉపయోగించే బ్రష్ ఏది ఉండాలన్న దానితో సహా. అంత కచ్చితమైన ఏర్పాట్లు కేవలం నాలుగు అంటే నాలుగు గంటల వ్యవధిలోనే పూర్తి చేస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/