Begin typing your search above and press return to search.

బ్యాన్ ఎత్తివేత‌లో జేసీ ఆయుధం ఏమిటంటే?

By:  Tupaki Desk   |   20 July 2017 10:56 AM GMT
బ్యాన్ ఎత్తివేత‌లో జేసీ ఆయుధం ఏమిటంటే?
X
సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - టీడీపీ నేత‌ - అనంత‌పురం పార్ల‌మెంటు స‌భ్యుడు జేసీ దివాక‌ర్ రెడ్డిపై పౌర విమాన‌యాన సంస్థ‌లు విధించిన నిషేధం రోజుల వ్య‌వధిలోనే ముగిసిన వైనంపై నిన్న స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. త‌మ సిబ్బందిపై దురుసుగా వ్య‌వ‌హ‌రించే వారిపై నిషేధం విధించే ఎయిర్ లైన్స్ సంస్థ‌లు... నిందితుడిగా ఉన్న స‌ద‌రు వ్యక్తి భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెబితేనే బ్యాన్ ఎత్తివేత‌పై ఆలోచ‌న చేస్తాయి. గ‌తంలో శివ‌సేన ఎంపీ గైక్వాడ్ విష‌యంలోనూ విమాన‌యాన సంస్థ‌లు ఇదే సూత్రాన్ని పాటించాయి. మ‌రి నిన్న‌టి ఎపిసోడ్‌ లో జేసీ క్ష‌మాప‌ణ‌లు చెప్పిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. తాను త‌ప్పు చేయ‌లేద‌ని, అదే స‌మ‌యంలో తాను ఎవ‌రికి కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని జేసీనే స్వ‌యంగా చెప్పారు. మ‌రి నిందితుడిగా ఉన్న వ్యక్తి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుండానే ఎయిర్ లైన్స్ సంస్థ‌లు జేసీపై నిషేధం ఎలా ఎత్తివేశాయ‌న్న అంశంపై నిన్నంతా చ‌ర్చ జ‌రిగింది.

అయితే కాస్తంత ఆల‌స్యంగానైనా... జేసీపై ఎయిర్ లైన్స్ సంస్థ‌లు నిషేధం ఎత్త‌వేయ‌డానికి గ‌ల కార‌ణాలు... ఆ దిశ‌గా జ‌రిగిన తంతు మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు స‌సేమిరా అన్న జేసీ... కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిలింగ్‌ను అస్త్రంగా వాడుకున్న‌ట్లు తెలుస్తోంది. అస‌లు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగిన నాటి నుంచి నిన్న సాయంత్రం దాకా ఢిల్లీ కేంద్రంగా న‌డిచిన ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని ఓ సారి ప‌రిశీలిస్తే... ఇలా కూడా రాజీ తంత్రం న‌డుస్తుందా? అన్న అనుమానాలు క‌ల‌గ‌క మాన‌వు. ఇక ఢిల్లీ వేదిక‌గా మూడు రోజులుగా జ‌రిగిన ప్ర‌హ‌స‌నాన్ని ఓ సారి ప‌రిశీలిస్తే... విశాఖ ఎయిర్ పోర్టులో త‌న సిబ్బందిపై జేసీ అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన వైనంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఇండిగో ఎయిర్ లైన్స్‌ - ఎయిర్ ఇండియా సంస్థ‌లు ఆయన‌పై నిషేధం విధిస్తున్న‌ట్లు అప్ప‌టిక‌ప్పుడే ప్ర‌క‌టించేశాయి. ఆ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన మ‌రుక్ష‌ణ‌మే మిగిలిన పౌర విమాన‌యాన సంస్థ‌లు కూడా అదే త‌ర‌హాలో నిషేధం ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌రించాయి.

ఈ క్ర‌మంలో ఎయిర్ లైన్స్ సంస్థ‌ల నిషేధంపై రాజీ మార్గం ద్వారా వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవాల‌ని టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... జేసీకి సూచించారు. ఈ సూచ‌న‌ను జేసీ లైట్ గా తీసుకుని ఎయిర్ లైన్స్ సంస్థ‌ల‌కు సారీ చెప్పేది లేద‌ని తేల్చి చెప్పారు. అంతేకాకుండా త‌న త‌ప్పేమీ లేకున్నా కూడా త‌న‌పై ఎయిర్ లైన్స్ సంస్థ‌ల‌న్నీ మూకుమ్మ‌డిగా నిషేధం విధించాయ‌ని, ఆ నిషేధాన్ని ఎత్తివేసేలా ఆ సంస్థ‌ల‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని జేసీ హైకోర్టు గ‌డ‌ప తొక్కారు. ఈ విష‌యంలో తామేమీ జోక్యం చేసుకోలేమ‌ని హైకోర్టు చెప్ప‌డంతో జేసీ ఓ స‌రికొత్త మంత్రాంగానికి తెర తీసిన‌ట్లు తెలుస్తోంది. మొన్న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌ లో ఓటు వేసేందుకంటూ ఢిల్లీ వెళ్లిన సంద‌ర్భంగా ఏకంగా రూ.7 ల‌క్ష‌లు పెట్టి ఓ చార్టెర్డ్ ఫ్లైట్‌ ను అద్దెకు తీసుకుని ఆయ‌న ఢిల్లీ వెళ్లారు. పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో ఓటు వేసిన అనంత‌రం అక్క‌డికి వ‌చ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ఆయ‌న మాట్లాడారు.

తాను త‌ప్పేమీ చేయ‌కున్నా... ఎయిర్‌ లైన్స్ సంస్థ‌లు త‌న‌పై నిషేధం విధించాయ‌ని, ఓ ఎంపీగా ఉన్న త‌న ప‌ట్ల విమాన‌యాన సిబ్బంది ఒక‌రు దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని ఫిర్యాదు చేశారు. ఎయిర్ లైన్స్ సంస్థ‌ల అనాలోచిత నిర్ణ‌యాల‌తో తాను ఢిల్లీ వ‌చ్చేందుకు ఏకంగా రూ.7 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చింద‌ని కూడా ఆయ‌న జైట్లీకి చెప్పార‌ట‌. ఈ క్ర‌మంలో జేసీ మ‌న‌సులోని మాట‌ను అర్థం చేసుకున్న జైట్లీ వెంట‌నే టీడీపీ నేత‌ - కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రిని పిలిపించి జేసీని ఆయ‌న‌కు అప్ప‌గించి... మంత్రాంగాన్ని బోధించార‌ట‌. ఈ మంత్రాంగంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి సాయాన్ని కూడా తీసుకోవాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేశార‌ట‌. జైట్లీ సూచ‌నలు అందుకున్న చౌద‌రి వెంట‌నే రంగంలోకి దిగిపోయారు. జేసీ - సుజ‌నా చౌద‌రి ఇద్దరూ అశోక్‌ గజపతిరాజు కార్యాలయానికి వెళ్లారట‌.

క్ష‌మాప‌ణ లేఖ ఇవ్వాల‌న్న అశోక్‌ తో వాద‌న‌కు దిగిన జేసీ...త‌న తప్పు అంత‌గా లేద‌ని, ఇండిగో ఉద్యోగి ప్రవర్తించిన తీరు బాగోలేద‌ని తెలిపారట‌. దీంతో అశోక్ స్వ‌యంగా రంగంలోకి దిగి ఇండిగో ఎయిర్‌ పోర్ట్స్‌ ఆపరేషన్స్‌ ప్రతినిధి రామ్‌ దాస్‌ - జేసీల మధ్య సమావేశం ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. అంతేగాక‌, జేసీ ఆరోప‌ణ‌లు చేస్తోన్న ఇండిగో సిబ్బందిని ఢిల్లీకి పిలిపించి సుజనాచౌదరి నివాసంలో చ‌ర్చ‌లు జ‌రిపారట‌. సుజనాచౌదరి వారిద్ద‌రితో కరచాలనం చేయించి, వివాదానికి తెరదించిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇండిగో - ఎయిర్‌ ఇండియాల నుంచి జేసీపై నిషేధాన్ని ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చింద‌ట‌. విమాన‌యాన సంస్థ‌లు నిషేధం ఎత్తివేత‌కు ఒప్పుకోవ‌డంతో కోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకునేందుకు జేసీ అక్క‌డిక‌క్క‌డే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.