Begin typing your search above and press return to search.

సచివాలయం కేసీఆర్ కు అందుకే నచ్చలేదు

By:  Tupaki Desk   |   31 May 2016 5:13 AM GMT
సచివాలయం కేసీఆర్ కు అందుకే నచ్చలేదు
X
కొత్త ఒక వింత.. పాత ఒక రోత అని ఊరికే అనలేదేమో?మిగిలినవారి సంగతిని పక్కన పెడితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్త అంటే మహా ప్రాణం. అదే టైంలో పాత వాటి విషయంలో ఆయన ఆసక్తిని పెద్దగా ప్రదర్శించరు. తాను నమ్మే వాస్తుకు అనుగుణంగా సచివాలయ భవనం ఉండటం కేసీఆర్ కు నచ్చలేదు. నిజానికి సచివాలయానికి వాస్తు బాగోలేదన్నది కేసీఆర్ డిసైడ్ చేసింది కాదు. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు ఇలానే ఫీలై.. తాత్కాలిక సర్దుబాట్లు చేసుకుంటూ వచ్చారు.

మిగిలిన ముఖ్యమంత్రులకు పూర్తి భిన్నం కేసీఆర్. అందుకే.. ఇప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారు ఎవరూ చేయని సాహసానికి ఆయన పూనుకున్నారు. సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరు ఏమనుకున్నా.. తాను అనుకున్న పనిని అనుకున్నట్లుగా చేసే అలవాటున్న కేసీఆర్.. ఇప్పుడున్న సచివాలయాన్ని అడ్డంగా కూలదోసి కొత్తది కట్టాలని డిసైడ్ అయ్యారు. తనకు నచ్చని వాస్తు కారణంగానే ఇలాంటివి చేస్తానంటూ చెబితే వినే వారు ఎవరూ ఉండరు కాబట్టి.. ఆయన టోన్ మార్చారు. వాస్తును మినహాయించి.. కొన్ని వాస్తవిక అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. సచివాలయంలో వసతులు లేవని.. అడ్డదిడ్డంగా నిర్మానాలు చేసేశారంటూ ఆయన చిరాకు పడుతూ.. అందుకే.. అంతా మార్చేయాలన్న ఉద్దేశంతో సచివాలయాన్ని కూలదోసి కొత్తది కట్టాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించటమే కాదు.. కొత్త సచివాలయం ఎలా ఉంటుందో తెలుసా? అంటూ తన స్వప్నాన్ని ఊహాచిత్రంగా ఆవిష్కరించారు.

పోతే పోయింది కోట్లాది రూపాయిలు. ఖర్చు విషయాన్ని పక్కన పెడితే.. ఇలాంటి కట్టటం హైదరాబాద్ లో ఉంటే.. భాగ్యనగరానికే కొత్త వెలుగు అన్నట్లుగా ఉండే ఒక భారీ భవనాన్ని చూపించారు. సచివాలయాన్ని ఎందుకు పడేసి..కొత్తది కట్టాలనుకుంటున్నారన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానంలో ఒక ఆసక్తికర అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. ఇప్పుడున్న సచివాలయంలో సరైన మీటింగ్ హాలు లేదని.. మంత్రులంతా ఒకేసారి భోజనం చేయటానికి సదుపాయాలు కూడా లేవని.. అందుకే సచివాలయాన్ని పునర్నిర్మంచాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు.

కేసీఆర్ మాటల్నే ప్రామాణికంగా తీసుకుంటే.. హైదరాబాద్ నగరం కూడా ఒక ప్లాన్ అంటూ లేకుండా ఇష్టారాజ్యంగా ఉంది. అక్రమ కట్టడాలు ఎన్ని వెలిసాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలాచోట్ల సౌకర్యాలు అరకొర ఉన్నాయి. అలా అని హైదరాబాద్ మొత్తాన్ని కూలదోసి కొత్తది కట్టలేం కదా? సచివాలయాన్ని మొత్తంగా కూలగొట్టే కంటే కూడా.. మార్పులుచేర్పులతో మార్చుకుంటే విలువైన ప్రజాధనం మిగులుతుంది కదా? ఇలాంటి ప్రశ్నలు కలలు కనే వారికి.. కేసీఆర్ కలల్నిఊహాచిత్రాల్లో చూసి వావ్ అనే వారికి ఏ మాత్రం ఇష్టం ఉండదని తెలుసు. కానీ.. చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పకుండా ప్రజాస్వామ్యవాదులు ఉండలేరు కదా? ఏమైనా తాజాగా కేసీఆర్ చెప్పిన మాటల పుణ్యమా అని.. సచివాలయం ఎందుకు పునర్ నిర్మిస్తున్న విషయం మీద జనాలకు క్లారిటీ రావటమే కాదు.. కొత్త సచివాలయం ఎలా ఉంటుందన్న సందేహానికి తన ఊహాచిత్రంతో సమాధానం చెప్పేయటాన్ని ఎంతోకొంత మెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి.. తన కలల్ని సామాన్యులందరితో పంచుకోవటం చిన్న విషయం కాదు కదా..?