Begin typing your search above and press return to search.

టీటీడీపీలో మిగిలేది ఆయ‌న ఒక్క‌డేనా?

By:  Tupaki Desk   |   20 Jan 2018 4:55 AM GMT
టీటీడీపీలో మిగిలేది ఆయ‌న ఒక్క‌డేనా?
X

తెలంగాణ‌లో ఓ వెలుగు వెలిగి..రాష్ట్ర విభ‌జ‌న ఉద్య‌మం తారాస్థాయికి చేరింది మొద‌లు రోజురోజుకు క్షీణిస్తూ.. శిథిలావస్థకు చేరుకుంటున్న టీటీడీపీ గురించి కొత్త చ‌ర్చ మొద‌లైంది. ఇంత‌కీ పార్టీలో మిగిలేదెవరని ఆ పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు. నాయకులంతా వారివారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీని వీడనున్నారని, పొలిట్‌ బ్యూరో సభ్యులు కూడా ఇతరపార్టీల్లో పదవులను ఖరారు చేసుకుంటున్నారని వాపోతున్నారు. నేతలంతా ఎవరికివారు కర్చీఫ్ వేసుకుని రిజర్వ్ చేసుకున్నారని రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతున్న అంశాలు.

సీనియర్ టీటీడీపీ నేతలంతా వారికి అనుకూలంగా ఉండే పార్టీల్లో అడ్వాన్స్‌ బుకింగ్‌ లు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అందరూ వెళుతున్నారు.. నా పరిస్థితి ఏంటో అర్థం కావడంలేదు అంటూ మోత్కుపల్లి నిరాశలో ఉన్నట్టు ఆయన అనుచరులు చెప్తున్నారు. 33 ఏల్ల‌ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మోత్కుపల్లి ఒక దళిత నాయకుడిగా వెలుగు వెలిగి నేడు ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్నట్టు సమాచారం. ఊరించి ఆశలు రేపిన గవర్నర్ గిరీ ఇక రాదని మోత్కుపల్లికి అర్థమైందని అంటున్నారు. అమరావతిలో మంచి ఇల్లు కేటాయించాలని, ఇక్కడే ఉండిపోతానని చెప్పినా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్రబాబు నుంచి స్పందన రాలేదట. దీంతో మోత్కుపల్లి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ఎదురు చూస్తున్నారని వినవస్తున్నది.

మ‌రోవైపు టీటీడీపీకి వలసల ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన చంద్రబాబు ఎలాంటి నష్టనివారణ చర్యలు తీసుకోవాలనే విషయమై సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డితో ఫోన్‌ లో మంతనాలు జరిపినట్టు తెలిసింది. అదే స‌మ‌యంలో పార్టీ నేత‌లు ఎవ‌రి దారి వారి చూసుకోగా పార్టీలో మిగిలేది టీడీపీకి న‌మ్మిన‌బంటు అనే పేరున్న మాజీ ఎంపీ రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మాత్ర‌మేన‌ని అంటున్నారు.