Begin typing your search above and press return to search.

కిచిడీ స‌ర్కారు మీద ఫైటింగ్ అట‌

By:  Tupaki Desk   |   13 Feb 2016 12:17 PM GMT
కిచిడీ స‌ర్కారు మీద ఫైటింగ్ అట‌
X
తెలుగుదేశం పార్టీలో కొంత‌మంది నేత‌ల తీరు చాలా ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంటుంది. ఓప‌క్క తెలంగాణ‌లో పార్టీ ప‌రిస్థితి రోజురోజుకీ దిగ‌జారిపోతున్నా పెద్ద‌గా మాట్లాడ‌ని నేత‌లు కొంద‌రున్నారు. అలాంటి వారిలో ఒక‌రు మాజీ ఎంపీ రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి. తాజాగా చోటు చేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆయ‌న ఎంత అస‌హ‌నంగా ఉన్నారో ఆయ‌న వ్యాఖ్య‌లు చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. తెలంగాణ స‌ర్కారును ఏకంగా కిచిడీ స‌ర్కారుగా తేల్చేశారు.

తెలంగాణ స‌ర్కారు బ‌హుళ పార్టీ స‌భ్య‌త్వం ఉన్న పార్టీగా ఆయ‌న ఎద్దేవా చేశారు. పేరుకు టీఆర్ ఎస్సే కానీ.. అందులో వైఎస్సార్ కాంగ్రెస్‌.. బీఎస్పీ.. తెలుగుదేశం.. కాంగ్రెస్‌.. ఇలా అన్నిర‌కాల ఎమ్మెల్యేలు ఉన్నార‌ని.. ఇత‌ర పార్టీల ఉంచి ఎమ్మెల్యేల్ని లాక్కొన్న కేసీఆర్ స‌ర్కారు కిచిడీ ప్ర‌భుత్వంగా మారిపోయింద‌ని ఎద్దేవా చేశారు.

స్వ‌త‌హాగా లాయ‌ర్ అయిన చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి తాజా రాజ‌కీయ ప‌రిణామాల గురించి మాట్లాడుతూ.. చాలామంది పార్టీని టీఆర్ ఎస్ లో విలీనం చేస్తున్న‌ట్లుగా చెబుతున్నార‌ని.. అలా చెప్ప‌టం రాజ్యాంగ విరుద్ధమ‌ని తేల్చేశారు. వేర్వేరు సంద‌ర్భాల్లో అధికార‌పార్టీ స‌భ్యులంతా క‌లిసి త‌మ‌ను టీఆర్ ఎస్ లో విలీనం చేయాల‌ని కోర‌టం రాజ్యాంగాన్ని అప‌హాస్యం చేయ‌టమేన‌ని మండిప‌డ్డారు. రాజ్యాంగం ప్ర‌కారం పార్టీల విలీనం ఉంటుందే త‌ప్పించి.. అనుబంధ విభాగాల విలీనం ఉంద‌ని చెప్పుకొచ్చారు. ఇటీవ‌ల పార్టీ మారిన నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల్ని ప్ర‌స్తావిస్తూ.. విలీనం అంటూ వారు చేస్తున్న ప్రయ‌త్నాల‌పై చ‌ర్య‌ల‌కు అవ‌స‌ర‌మైతే రాష్ట్రప‌తిని క‌లుస్తామ‌ని చెబుతున్నారు. రావుల మాట‌లు వింటే.. ఎర్ర‌బెల్లి చెప్పినంత ఈజీగా విలీనం ప‌నులు జ‌ర‌గ‌వ‌ని చెప్పొచ్చు.