బీజేపీ కేరాఫ్ రేప్..కిడ్నాప్ నేతలు?

Mon Apr 16 2018 10:31:05 GMT+0530 (IST)

నిర్బయ తర్వాత యావత్ దేశాన్నికదిలించిన అంశం ఏమైనా ఉంటే.. అది ఉన్నావ్.. కథువా ఘటనలే. రెండింటిలోనూ బీజేపీ నేతల హస్తం ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వేళ.. నిత్యం సుద్దులు చెప్పే మోడీ నేతృత్వంలోని బీజేపీ నేతల క్యారెక్టర్లను.. వారి తీరును విశ్లేషించే కార్యక్రమాన్ని చేపట్టింది అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్ సంస్థ. బీజేపీ ప్రజాప్రతినిధులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్ని విశ్లేషించిన సదరు సంస్థ బీజేపీతో పాటు.. ఇతర పార్టీలకు సంబంధించి రేప్..కిడ్నాప్ లాంటి తీవ్రమైన నేరాల్లో భాగస్వామ్యం ఎంతన్న షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.
 
ప్రజల్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు నేరస్తులుగా.. అందునా రేప్ లాంటి తీవ్రమైన నేరాలు చేసిన వారిగా ఉన్నోళ్లు ఉన్న విషయాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఉన్న ఎంపీలు.. ఎమ్మెల్యేలలో 51 మంది ప్రజాప్రతినిధులు మహిళలపై కిడ్నాప్.. అత్యాచారం వంటి కేసులు ఎదుర్కొంటున్న విషయం బయటకు వచ్చింది.ఇలా కేసులు ఎదుర్కొంటున్న వారికి సంబంధించి మరింత లోతుగా వివరాలు చూస్తే.. కేసులు ఎదుర్కొంటున్న 51 మందిలో 48 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు ఎంపీలుగా తేలింది. వీరిలో బీజేపీకి చెందిన ఎంపీ.. ఎమ్మెల్యేలు 14 మంది ఉన్నట్లుగా తేల్చారు. బీజేపీ తర్వాత తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలుగా శివసేన నిలిచింది. ఏడుగురు ప్రజాప్రతినిధులపై తీవ్ర నేరారోపణలు ఉన్నట్లుగా తేల్చారు. ఇక.. మూడోస్థానంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు తేలింది. ఈ పార్టీకి చెందిన ఆరుగురు ప్రజాప్రతినిధులపై ఈ తరహా తీవ్రమైన నేరాలు ఉన్నట్లుగా రికార్డులతో సహా గుర్తించారు. మొత్తం 4852 అఫిడవిట్లను పరిశీలించి ఈ వివరాల్ని బయటపెట్టారు.

తమపై కేసులు ఉన్న విషయాన్ని 1581 మంది ఎంపీ.. ఎమ్మెల్యేలు తమ అఫిడవిట్లలో వెల్లడించారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. 12 మంది ఎంపీ.. ఎమ్మెల్యేలతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంటే.. పశ్చిమబెంగాల్ కు చెందిన వారు 11 మంది ఉన్నారు. దీంతో.. ఆ రాష్ట్రం సెకండ్‌ప్లేస్ లో నిలిచింది. మూడోస్థానంలో ఒడిశా నిలిచింది.

గడిచిన ఐదేళ్లలో ఎంపీలుగా పోటీ చేసిన వారిలో 19 మంది.. ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన 103 మంది మహిళలపై దాడులకు సంబంధించిన కేసుల విచారణను తాము ఎదుర్కొంటున్న విషయాన్ని అఫిడవిట్లో వెల్లడించారు. గడిచిన ఐదేళ్లలో కేసులున్నా బరిలోకి దిగిన నేతల పార్టీల్ని చూస్తే.. అత్యధికంగా బీజేపీకి చెందిన 48 మంది తమ కేసుల వివరాలు వెల్లడించగా.. తర్వాతి స్థానంలో 36 మందితో బీఎస్సీ.. 27 మందితో కాంగ్రెస్ తో ఉన్నారు. ప్రజాప్రతినిధులే తీవ్రమైన నేరాల్లో ఈ స్థాయిలో భాగస్వామ్యం ఉన్నప్పుడు .. అలాంటి నేరాలకు చెక్ పడటం సాధ్యమేనా?