Begin typing your search above and press return to search.

‘పే టు మోదీ’.. పేటీఎం అబ్రివేషన్ మార్చిన కాంగ్రెస్

By:  Tupaki Desk   |   26 May 2018 5:02 PM GMT
‘పే టు మోదీ’.. పేటీఎం అబ్రివేషన్ మార్చిన కాంగ్రెస్
X

సోషల్ మీడియాను వాడుకోవడంలో - అక్కడ క్రియేటివిటీ చూపించడంలో ఇంతవరకు బీజేపీని మించినోళ్లు లేరని పేరు. కానీ.. క్రమంగా అన్ని పార్టీలూ ఆ కిటుకు పట్టేసి సోషల్ మీడియాపై దృష్టి పెడుతున్నాయి. ఎంత ఖర్చయినా ఫరవాలేదు - సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులను ఎండగట్టాలి.. సొంత పార్టీని ప్రమోట్ చేసుకోవాలన్న తాపత్రయం కనబరుస్తున్నారు. ఈ రేసులో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్నాళ్లుగా బీజేపీతో పోటీ పడుతోంది. ముఖ్యంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఘాటైన పోస్టులను పెడుతున్నారు. పార్టీ సోషల్ హ్యాండిళ్లతో పాటు ఆ పార్టీ నేతల ఖాతాల ద్వారా మోదీకి స్ట్రాంగు కౌంటర్లేస్తున్నారు. తాజాగా.. ఆ పార్టీ సోషల్ వింగ్ కింగ్ - నటి రమ్య ఘాటైన పోస్టొకటి పెట్టారు.

ప్రధాని మోదీపై విరుచుకుపడడంతో ముందుండే కర్ణాటక మాజీ ఎంపీ - హీరోయిన్ రమ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పేటీఎం అంటే 'పే టు మోదీ' అంటూ కొత్త భాష్యం చెప్పింది. ఈ మేరకు ఆమె పేటీఎం లోగోను మార్చి ట్వీట్ చేసింది. మోదీకి డబ్బు చెల్లించండి (పే టు మోదీ కరో) అంటూ ట్యాగ్ లైన్ జత చేసింది. పేటీఎం పేరుతో మీ డబ్బు మోదీ జేబులోకి వెళ్తున్నట్టే... ఆ యాప్ ద్వారా మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతోంది అంటూ వ్యాఖ్యానించింది.

మరోవైపు పేటీఎంతో మోదీకి లింక్ పెట్టడంపై బీజేపీ సపోర్టర్లు రమ్యపై మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ కోసం చాకిరీ చేస్తున్న మీ వైఖరిని మార్చుకోండని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. మన డేటా వాటికన్ కు తరలిపోవడం కంటే బీజేపీ చేతిలోకి వెళ్లడమే బెటర్ అంటూ మరో నెటిజన్ స్పందించాడు. మొత్తానికి పార్టీల మధ్య జరుగుతున్న ఈ సోషల్ వార్ 2019లో ఎలాంటి ప్రభావం చూపించనుందో చూడాలి.