Begin typing your search above and press return to search.

రామోజీరావుకు పద్మవిభూషణ్ ఎలా ఇస్తారు?

By:  Tupaki Desk   |   11 Feb 2016 9:50 AM GMT
రామోజీరావుకు పద్మవిభూషణ్ ఎలా ఇస్తారు?
X
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ ఆరోపణలు చేశారు. ఎన్నో ఆరోపణలు - కేసులు ఉన్న ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఎలా ఇస్తారంటూ ఆయన ప్రశ్నించారు. రామోజీరావుపై ఎన్నో కేసులు ఉన్నాయని... వాటిలో ఆయనకేమీ క్లీన్ చిట్ రాలేదని.. అలాంటి వ్యక్తికి దేశ రెండో అత్యున్నత పురస్కారాన్ని ఎలా ప్రదానం చేస్తారని... అది ఎలాంటి సంకేతాలు ఇస్తుందని ఉండవల్లి ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఉండవల్లి రామోజీపై పలు విమర్శలు చేశారు. ప్రజల నుంచి ఆయన అక్రమంగా డబ్బులు వసూలు చేశారని.. అందుకు సంబంధించిన కేసులు ఆయనపై పెండింగులోనే ఉన్నాయని ఉండవల్లి ఆరోపించారు. అక్కడితో ఆగని ఆయన ఇవన్నీ ఆధారాలతో సహా ప్రధాని - రాష్ట్రపతిలకు అందిస్తానని చెప్పారు. రామోజీ పేరును సిఫార్సు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ఆయనకు ప్రకటించిన పద్మ పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.

గతంలో తాను రామోజీ ఆర్థిక నేరాల బాగోతాన్ని బయటపెడితే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అప్పట్లో విచారణకు ఆదేశించారని.... ఆ విచారణ పూర్తికాకుండానే ఇప్పుడు ఆయనకు అవార్డు ఇచ్చారని చెబుతూ జైట్లీ విచారణకు ఆదేశించిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. మరి ఉండవల్లి ఆధారాలతో కేంద్రానికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే రామోజీ అవార్డు ఏమవుతుందో చూడాలి.