Begin typing your search above and press return to search.

ఏపీని ఎంత అన్యాయంగా ముక్కలు చేశారంటే..?

By:  Tupaki Desk   |   27 Nov 2015 4:46 AM GMT
ఏపీని ఎంత అన్యాయంగా ముక్కలు చేశారంటే..?
X
ఏపీ రాష్ట్ర విభజన అంశం మరోసారి లోక్ సభలో చర్చకు వచ్చింది. రాజ్యాంగాన్ని భారీగా దుర్వినియోగం చేసి.. తప్పుడు పద్ధతిలో ఏపీని ముక్కలు చేసినట్లుగా శ్రీకాకుళం ఎంపీ.. తెలుగుదేశం యువ నేత కింజరపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా రాజ్యాంగంపై జరుగుతున్న ప్రత్యేక పార్లమెంటు భేటీలో రామ్మోహన్ నాయుడు ప్రసంగించారు.

ఇంగ్లిష్.. హిందీని కలగలుపుతూ.. తన వాదనను సమర్థవంతంగా వినిపించటంలో రామ్మోహన్ నాయుడు పలువురు మనసుల్ని దోచుకున్నాడు. విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన రామ్మోహన్ నాయుడు.. ఈ సందర్భంగా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సంయమనంతో వ్యవహరించారు. విభజన జరిపేటప్పుడు.. సొంత అన్నలా వ్యవహరించాల్సిన కేంద్రం.. బిగ్ బ్రదర్ పాత్ర పోషించి.. ఇష్టారాజ్యంగా విభజనకు పాల్పడిందన్నారు. ఈ కారణంతోనే విభజన తర్వాత కూడా ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలు ఎదురువుతున్నాయన్న విషయాన్ని ప్రస్తావించారు.

సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలతో పోలిస్తే.. కేంద్రానికి అధికారాలు ఎక్కువగానే ఉంటాయని.. కానీ.. రాజ్యాంగ స్ఫూర్తిని భంగం కలిగించేలా ఏ ప్రభుత్వం వ్యవహరించకూడదని.. ఏపీ విభజన సందర్బంగా నాటి కేంద్ర సర్కారు.. నిబంధనల్ని పక్కన పడేసి బిగ్ బ్రదర్ పాత్ర పోషించి.. ఏపీని ముక్కలు చేసిందని వాపోయారు. విభజనను వ్యతిరేకిస్తూ.. ఏపీ రాష్ట్ర అసెంబ్లీ మెజార్టీతో తీర్మానం పంపితే.. దాన్ని పట్టించుకోకుండా.. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్నారు.

ఏపీ విభజన వ్యవహారంలో కేంద్రం విధ్వంసకర సోదరుడిగా వ్యవహరించిందని.. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని.. ఆరోగ్య ప్రజాస్వామ్య లక్షణం కాదని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయగా.. తాను విభజన చేసిన తీరు సరిగా లేదని మాత్రమే చెబుతున్నానని వెల్లడించారు. ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పడితే రాని సమస్యలు.. ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా.. దాన్ని సరిగ్గా వినియోగించకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయన్నారు. మొత్తానికి విభజనపై ఏపీ వాదనను యువ ఎంపీ సమర్థవంతంగా వినిపించటంతో పాటు.. నాటి యూపీఏ సర్కారు చేసిన దుర్మార్గాన్ని.. కుట్రను వివాదాస్పదం కాకుండా చెప్పటంలో రామ్మోహన్ నాయుడు సక్సెస్ అయ్యాడని పలువురు అభినందిస్తున్నారు.