Begin typing your search above and press return to search.

బాబుకు మ‌ర్చిపోలేని షాకిచ్చిన త‌మ్ముడు

By:  Tupaki Desk   |   28 May 2017 10:01 AM GMT
బాబుకు మ‌ర్చిపోలేని షాకిచ్చిన త‌మ్ముడు
X
బాబు క‌ల‌లో కూడా ఊహించ‌ని రీతిలో సాకిచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఓప‌క్క విశాఖ‌లో టీడీపీ నేత‌లంతా క‌లిసి భారీ ఎత్తున వేడుక‌గా మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించుకుంటున్న వేళ‌.. టీడీపీ అధినేత‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ ప‌రిణామం చోటు చేసుకుంది.

టీడీపీ కేంద్ర పాలిట్ బ్యూరో స‌భ్యుడు.. అదిలాబాద్ మాజీ ఎంపీ ర‌మేశ్ రాథోడ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. తెలంగాణ అధికార‌ప‌క్ష‌మైన టీఆర్ ఎస్‌ లో చేరారు. ఆదివారం మ‌ధ్యాహ్నం ప్ర‌గ‌తిభ‌వ‌న్లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ర‌మేశ్ రాథోడ్‌ కి.. సీఎం కేసీఆర్ స్వ‌యంగా గులాబీ కండువ క‌ప్పి మ‌రీ పార్టీలోకి ఆహ్వానించ‌టం విశేషం.

టీఆర్ ఎస్‌ లోకి ర‌మేశ్ రాథోడ్ చేరిక‌తో అదిలాబాద్‌ లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిట‌న్లేన‌ని చెప్పాలి. త‌న చేరిక అనంత‌రం మాట్లాడిన ర‌మేశ్ రాథోడ్‌.. త‌న‌తో పాటు క్యాడ‌ర్ మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చేసింద‌ని చెప్పారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు న‌చ్చ‌టంతో పార్టీ మారిన‌ట్లుగా ఆయ‌న వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫెయిల్ అయ్యార‌ని.. మ‌రో రెండేళ్లు క‌ష్ట‌ప‌డితే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు వ‌స్తాయంటూ మ‌హానాడు వేదిక‌గా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే కేసీఆర్ ఇచ్చిన షాక్ అదిరిపోయిందంటున్నారు.

మ‌హానాడు వేదిక‌గా చేసుకొని కేసీఆర్ పై చేసిన విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న ఎలా రియాక్ట్ అవుతార‌ని అందరూ అనుకుంటున్న వేళ‌.. ఊహించ‌ని రీతిలో కేసీఆర్ క‌దిపిన పావులు తెలుగు త‌మ్ముళ్ల‌కు భారీ షాక్‌ను ఇస్తే.. తాజా ప‌రిణామంపై బాబు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా ఉంటే.. తాను ఏదో ఆశించి టీఆర్ఎస్‌లోకి చేర‌లేద‌ని.. పార్టీ విధానాలు.. ప్ర‌భుత్వ పాల‌న న‌చ్చి మాత్ర‌మే చేరిన‌ట్లుగా రాథోడ్ స్ప‌ష్టం చేస్తున్నారు. పార్టీ మారే ప్ర‌తిఒక్క‌రూ ఇలాంటి మాట‌లు త‌ప్పించి..మ‌రొక‌టి మాట్లాడతారా ఎక్క‌డైనా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/