Begin typing your search above and press return to search.

బాబుకు ఊపిరి ఆడ‌న‌ట్లుగా చేసిన ర‌మ‌ణ‌దీక్షితులు

By:  Tupaki Desk   |   17 July 2018 10:19 AM GMT
బాబుకు ఊపిరి ఆడ‌న‌ట్లుగా చేసిన ర‌మ‌ణ‌దీక్షితులు
X
కొన్నిసార్లు కాలం ప‌రీక్ష‌లు పెడుతూ ఉంటుంది. అయితే.. కాలం ప‌రీక్ష‌లు పెట్ట‌కున్నా.. తొంద‌ర‌పాటుతో చిక్కుల్లో చిక్కుకోవ‌టం కొంద‌రు ప్ర‌ముఖుల‌కు అల‌వాటు. అందులో ఘ‌నాపాఠి ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు. వ్యూహాత్మ‌కంగా చేస్తారో.. తెలీక త‌ప్పులో కాలేస్తారో కానీ కీల‌క‌మైన విష‌యాల్లో త‌ప్పులు చేసి.. చెంప‌లేసుకొని మ‌ళ్లీ స‌రిదిద్దేందుకు తెగ క‌ష్ట‌ప‌డుతుంటారు.

టీటీడీ మీద ఈ మ‌ధ్య కాలం వినిపిస్తున్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఏ పాల‌కుడైనా తొమ్మిది రోజుల పాటు స్వామి వారి ద‌ర్శనాన్ని బంద్ చేసి మ‌రీ మ‌హా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని చేప‌డ‌తారా? చిన్న పిల్లాడు సైతం ఆలోచించ‌ని రీతిలో ఆలోచించి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు మూట‌క‌ట్టుకున్న అనంత‌రం భ‌క్తుల ద‌ర్శ‌నాల‌ను ఆప‌మ‌ని.. గ‌తంలో మాదిరే మ‌హా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని చేప‌డ‌తామ‌ని వెల్ల‌డించారు. అయితే.. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగిపోయింది.

ఇలాంటి వేళ‌లో బాబును మ‌రింత ఇరుకున ప‌డేసేలా ర‌మ‌ణ‌దీక్షితులు తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఉన్నాయి. మ‌హా సంప్రోక్ష‌ణ పేరుతో ఆగ‌స్టు 9 నుంచి 16 వ‌ర‌కు ఆల‌యాన్ని మూసేస్తామ‌న్న అంశంపై స్పందించిన ఆయ‌న‌.. భ‌క్తుల నుంచి ఆగ్ర‌హ జ్వాల‌లు ఎదుర‌య్యేస‌రికి త‌మ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నార‌ని.. చెబుతూ.. ఆల‌యాన్ని మూసి వేయ‌టం అంటే.. భ‌క్తుల‌ను భ‌గ‌వంతుడికి దూరం చేయ‌ట‌మేన‌న్నారు.

టీటీడీ మాజీ ప్ర‌ధానార్చ‌కులుగా వ్య‌వ‌హ‌రించిన ర‌మ‌ణ‌దీక్షితులు గ‌డిచిన కొంత‌కాలంగా బాబు తీరుపై ఆగ్ర‌హంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌హా సంప్రోక్ష‌ణపై ఛైర్మ‌న్ కు అవ‌గాహ‌న లేద‌ని.. భ‌క్తుల‌ను ఆల‌యానికి అనుమ‌తించ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యం స‌రైన‌ది కాద‌న్నారు. తాను టీటీడీపై గ‌తంలో చేసిన ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరేలా నిర్ణ‌యాలు ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇప్ప‌టికైనా త‌న ఆరోప‌ణ‌ల‌కు పాల‌క‌మండ‌లి.. ప్ర‌భుత్వం జ‌వాబు చెప్పాలంటూ డిమాండ్ చేసిన ఆయ‌న‌.. స్వామివారి సంప‌ద‌ను దోచుకోవాల‌నే ప్ర‌య‌త్నాల్ని అడ్డుకునేందుకు సీబీఐ విచార‌ణ కోరుతున్న‌ట్లు చెప్పారు. ఆల‌యంలో ర‌హ‌స్యంగా సంప్రోక్ష‌ణ పూజ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించిన ఆయ‌న తీరు బాబుకు మ‌రింత ఇబ్బందిక‌రంగా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.