Begin typing your search above and press return to search.

సీఆర్‌ డీఏ అంటే..చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్‌ మెంట్ అథారిటీ

By:  Tupaki Desk   |   9 Nov 2018 8:57 AM GMT
సీఆర్‌ డీఏ అంటే..చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్‌ మెంట్ అథారిటీ
X
న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి కేంద్రంగా సాగుతున్న భూముల కేటాయింపు - అభివృద్ధిపై - రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లో జ‌రుగుతున్న భూ కుంభ‌కోణాల‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ త‌న‌దైన శైలిలో స్పందించారు. తాజాగా అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణంలో సిట్ కాలయాపన చేసిందన్నారు. అనేక మాసాలు ద‌ర్యాప్తు చేసి ఇచ్చిన నివేదిక ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌న్నారు. కొండను పట్టి ఎలుకను పట్టిన చందంగా అధికార పార్టీ నాయకులను వదిలివేసి వైసీపీ నాయకులు ధర్మాన ప్రసాద్‌ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. సిట్‌ పై ప్రజలకు నమ్మకం పోయిందని - విశాఖ భూ కుంభకోణం పై సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ చేయించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.

కాగా, రాజ‌ధానిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై రామకృష్ణ స్పందిస్తూ సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ అథారిటీగా మార్చేశార‌ని ఎద్దేవా చేశారు. `హ్యాపీ నెస్ట్‌’ పేరుతో ఏపీసీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిప‌డ్డారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు చేసింది ఏముందని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. 4 ఏళ్ల చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌కు సంబంధించి టీవీలలో ప్రచారం తప్ప ఏమైనా అభివృద్ధి చేశారా అని ఆయ‌న నిల‌దీశారు. చంద్రబాబు జిమ్మిక్కుల‌ను మానుకోవాలని, ఇక‌నైనా ప్ర‌చారం కంటే ప‌ని చేయ‌డంపై దృష్టి సారించాల‌ని రామకృష్ణ కోరారు. కాగా, దేశంలో నోట్ల రద్దు చేసి రెండేళ్లు అయినా ఇంకా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రామ‌కృష్ణ అన్నారు. బ్లాక్ మని - తీవ్రవాదం అరికట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన మోడీ ఫలితాలు సాధించారా? అని నిల‌దీశారు. ``నోట్ల రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదం తగ్గిందని చెబుతున్నారు. నోట్ల రద్దు అయ్యిన తర్వాత ఇంకా తీవ్రవాదం పెరిగింది. నోట్ల రద్దు వల్ల అనేక పరిశ్రమలు మూతపడ్డాయి.ప్రధాని మోడీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి`` అని ఆయ‌న డిమాండ్ చేశారు.