కన్ఫర్మ్... రెండేళ్లలో రామమందిర నిర్మాణం

Mon Mar 20 2017 16:00:01 GMT+0530 (IST)

అయోధ్యలో రామమందిర నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతుందా..? అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2018 చివరినాటికి.. లేదంటే 2019 ప్రారంభంలో రామమందిర నిర్మాణం పూర్తవనుందా..? వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రామమందిరాన్ని పూర్తిచేసి ఎన్నికలకు వెళ్లనున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఎంపిక కావడంతో రామమందిర నిర్మాణం గ్యారంటీ అని తేలిపోయింది. ఆ బాధ్యత ఆయనకే అప్పగించారని.. ఆయన దాన్ని బాధ్యతగా స్వీకరించారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
    
నెల రోజుల కిందట ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో రామమందిర నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ హాజరైన సందర్భంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్ గడ్ రాముడి తల్లి కౌశల్య జన్మస్థలమని.. అక్కడ రామమందిరం నిర్మిస్తున్నందున అయోధ్య రామమందిరానికి అన్ని అడ్డంకులు తొలగనున్నాయని అన్నారు. త్వరలో అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలవుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. అప్పట్లోనే ఆయన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
    
తాజాగా యోగి యూపీ పగ్గాలు చేపట్టడంతో ఆయన ప్రథమ ప్రాధాన్యాల్లో రామమందిర నిర్మాణం కూడా ఒకటిగా నిలవనుందని తెలుస్తోంది. రామమందిర నిర్మాణం ప్రారంభించినా కూడా యోగి భారత దేశ చరిత్రలో.. బీజేపీ చరిత్రలో లెజెండ్ గా మారనున్నారు. రాజకీయంగా తాను గొప్ప భవిష్యత్తును ఆశిస్తూ.. హిందూత్వకు గొప్ప  భవిష్యత్ అందించాలని బలంగా కోరుకుంటున్న యోగి తాను అనుకున్నది సాధిస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
    
కాగా యూపీ సీఎంగా యోగి ఎంపిక... అయోధ్యలో రామమందిర నిర్మాణ వ్యూహాల్లో కేంద్రంలోని బీజేపీ పెద్దల ద్వంద్వ ఎత్తుగడలూ ఉన్నాయన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలైనా.. పూర్తయినా దానివల్ల క్రెడిట్ వస్తే దాన్ని మొత్తం దేశమంతటా వాడుకోవాలని.. ఒకవేళ వికటిస్తే అది యూపీకే పరిమితమయ్యేలా యోగిని కారకుడిగా చూపి మిగతా రాష్ర్టాల్లో ఆ ప్రభావం పడకుండా చూడాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. రామమందిరం విషయంలో యోగిని ముందు పెట్టి బీజేపీ చేస్తున్న ప్రయోగం ఇదని తెలుస్తోంది. మరి ఈ డబుల్ గేమ్ ఎలాంటి ఫలితమిస్తుందో వచ్చే ఎన్నికల్లోతేలనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/