Begin typing your search above and press return to search.

ఇక‌.. కోవింద్ దేశ ప్ర‌థ‌మ పౌరుడు

By:  Tupaki Desk   |   25 July 2017 8:05 AM GMT
ఇక‌.. కోవింద్ దేశ ప్ర‌థ‌మ పౌరుడు
X
దేశానికి కొత్త రాష్ట్రప‌తి వ‌చ్చేశారు. అనూహ్యంగా రాష్ట్రప‌తి ప‌ద‌వి కోసం బ‌రిలోకి దిగిన రామ్‌నాథ్ కోవింద్ ఊహించిన‌ట్లే సునాయాసంగా రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. స‌రిగ్గా 12.12 గంట‌ల‌కు రామ్ నాథ్ ప్ర‌మాణ‌స్వీకారం మొద‌లు పెట్టారు.

సంప్ర‌దాయాన్ని తూచా త‌ప్పకుండా పాటించిన కోవింద్ తొలుత రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు వెళ్లి.. ప్ర‌ణ‌బ్ దాతో క‌లిసి రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చారు. అనంత‌రం వారిద్ద‌రూ క‌లిసి పార్ల‌మెంటుకు బ‌య‌లుదేరారు. మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల స‌మ‌యంలో వారు ఇరువురు పార్ల‌మెంటుకు చేరుకున్నారు. పార్ల‌మెంటు భ‌వ‌నంలో ముందుగా కోవింద్ న‌డవ‌గా.. ఆయ‌నకు కాస్త వెనుక‌గా.. ప్ర‌ణ‌బ్ దా న‌డిచారు.

ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వానికి హాజ‌రైన అతిధుల‌కు ముకుళిత హ‌స్తాల‌తో ప‌దే ప‌దే ప్ర‌ణ‌బ్ దా న‌మ‌స్కారాలు పెట్ట‌టం క‌నిపించింది. కోవింద్ మాత్రం ఈ విష‌యంలో కాస్తంత త‌డ‌బాటుకు గురైన‌ట్లుగా క‌నిపించింది. కాసేపు న‌మ‌స్కారాలు పెడుతూ.. మ‌రికాసేపు మామూలుగా న‌డ‌వ‌టం క‌నిపించింది.

ప‌ద్ధ‌తి ప్ర‌కారం తొలుత జాతీయ‌గీతం ఆ త‌ర్వాత ప్ర‌మాణ‌స్వీకార మ‌హోత్స‌వానికి సంబంధించిన ప్ర‌క‌ట‌నను చేశారు. ఈ సంద‌ర్భంగా కోవింద్ గురించి ప‌రిచ‌య వ్యాక్యాల్ని వినిపించారు. అనంత‌రం సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రాష్ట్రప‌తిగా కోవింద్ చేత ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా కోవింద్ ఏ మాత్రం త‌డ‌బాటుకు గురి కాలేదు. కాస్తంత క్లిష్ట‌మైన ప‌దాల్ని కూడా ఆయ‌న స్ప‌ష్టంగా ప‌ల‌క‌టం క‌నిపించింది. ప్ర‌మాణ‌స్వీకారం పూర్తి కావ‌టంతో రామ్ నాథ్ కోవింద్ 14వ భార‌త రాష్ట్రప‌తిగా అవ‌త‌రించారు. ఆయ‌నీ ప‌ద‌విలో ఐదేళ్లు కొన‌సాగ‌నున్నారు.

రాష్ట్రప‌తిగా ప్ర‌మాణ‌స్వీకారం పూర్తి అయిన త‌ర్వాత స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. 125 కోట్ల భార‌త ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల్ని నెర‌వేరుస్తాన‌ని చెప్పిన కోవింద్‌.. ప‌లు వ‌ర్గాలు జాతి నిర్మాణంలో కీల‌క‌భూమిక పోషిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఇంటిని చూసుకుంటూ.. ఉద్యోగాలు చేస్తూ.. త‌మ పిల్ల‌ల్ని క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పెంచుతున్న మ‌హిళ‌లు సైతం జాతి నిర్మాణంలో భాగ‌స్వాములు అవుతున్న‌ట్లేన‌న్నారు. ఉద్యోగ క‌ల్ప‌న చేస్తున్న స్టార్ట్ ప్ లు సైతం జాతి నిర్మాత‌లేన‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రప‌తిగా బాధ్య‌త‌ల్ని ఇచ్చినందుకు విన‌మ్ర‌త‌తో స్వీక‌రిస్తున్నాన‌ని చెప్పిన కోవింద్‌.. 21వ శ‌తాబ్దం భార‌త్ ద‌ని.. నాలుగో పారిశ్రామిక విప్ల‌వాన్ని తీసుకొస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.