కేసీఆర్ ను రాంమాధవ్ అంత మాట అన్నాడే!

Sun Oct 21 2018 17:35:02 GMT+0530 (IST)

టీఆర్ ఎస్.. బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటి వరకూ ఆచితూచి అన్నట్లుగా వ్యాఖ్యలు చేసుకున్న స్థాయి నుంచి.. ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్న పరిస్థితి. ముందస్తు ఎన్నికలకు ముందు.. అటు పార్లమెంటులోనూ.. ఇటు బహిరంగ వేదికలపైనా కేసీఆర్ ను ఉద్దేశించి పాజిటివ్ గా మాట్లాడిన ప్రధాని మోడీ మాటలకు భిన్నంగా ఇప్పుడు కమలనాథులు విరుచుకుపడుతున్నారు.ప్రధాని మోడీ సైతం తనకు క్లీన్ చిట్ ఇచ్చారని.. తాము నిజాయితీగా పని చేస్తున్నామన్న విషయాన్ని మోడీ సైతం గుర్తించారంటూ గతంలో పలుమార్లు కేసీఆర్ వ్యాఖ్యానించటం తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విజన్ లేని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను తిట్టిపోసిన ఆయన.. అవినీతిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకూ రూ.1.15 లక్షల కోట్లు ఇచ్చారని.. వాటికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ లెక్కలు చెప్పలేదన్నారు.

తెలంగాణలో రోడ్లు అన్నీ గుంతలు పడ్డాయని  మండిపడ్డారు. టీఆర్ఎస్ తో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్న ఆయన.. తెలంగాణలో మార్పు రావాలంటే ప్రభుత్వం మారాల్సిందేనని వ్యాఖ్యానించారు. అవినీతిపరుల్ని అధికారులు పట్టుకుంటుంటే.. టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణిస్తున్నారని చెప్పారు.  ఇప్పటివరకూ ఏపీ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారో.. ఇప్పుడు కేసీఆర్ను ఉద్దేశించి అదే తీరులో రాంమాధవ్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. శనివారం తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేయటం తెలిసిందే. తాజాగా రాంమాధవ్ సైతం రాహుల్ బాటలో విమర్శనాస్త్రాల్ని సంధించటం గమనార్హం.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్.. కుమార్తె కవితలది మాత్రమేనని రాంమాధవ్ మండిపడ్డారు. సాక్ష్యాత్తు తాజా మాజీ హోం మంత్రికి సైతం సీఎం అపాయింట్ మెంట్ దొరకటం లేదని.. అలాంటిది ఇక సామాన్యుల మాటేమిటంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ది నాలుగేళ్ల దుష్టపాలన అని.. టీఆర్ఎస్ సర్కారు కారణంగా తెలంగాణకు ఒరిగిందేమీ లేదని తప్పు పట్టారు. మొత్తానికి మొన్నటిదాకా రహస్య మిత్రులన్నట్లుగా వస్తున్న ప్రచారానికి భిన్నంగా.. మసాలా దట్టించిన రీతిలో రాంమాధవ్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.