కర్ణాటక రణంలోకి రాం జెఠ్మలానీ ఎంట్రీ!

Thu May 17 2018 13:29:41 GMT+0530 (IST)

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంతోషం కమలనాథులకు దక్కేందుకు ఏ మాత్రం ఇష్టపడనట్లుగా కనిపిస్తోంది కాంగ్రెస్..జేడీఎస్ అధినేతల తీరు చూస్తుంటే. ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా మోడీషాలకు చుక్కలు చూపించేందుకు ఆ పార్టీలు సిద్ధమవుతున్నాయి. యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానం పంపిన వెంటనే.. అర్థరాత్రి వేళ సుప్రీం తలుపు తట్టి మరీ సంచలనం సృష్టించిన కాంగ్రెస్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.రాజ్యాంగపరమైన అంశాల్లో పట్టు ఉండటంతో పాటు.. కొంతకాలం పాటు బీజేపీకి సన్నిహితంగా ఉండి.. ఇప్పుడా పార్టీ అంటేనే మండిపడే ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ రంగంలోకి దిగారు. గంటల చొప్పున ఫీజు వసూలు చేసే రాం జెఠ్మలానీ గురించి తెలియని వారు ఉండరు. అలాంటి ఆయన కర్ణాటక ఇష్యూలోకి న్యాయపోరాటానికి ఆయన దిగనున్నారు.

బీజేపీకి మెజార్టీ లేదన్న విషయం స్పష్టమవుతున్నా.. ఆయనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై ఆయన న్యాయపోరాటానికి దిగారు. యడ్యూరప్ప చేత సీఎంగా ప్రమాణస్వీకారం చేయించటాన్ని సవాలు చేస్తూ సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ వ్యక్తిగతంగా సుప్రీంను ఆశ్రయించటం ఆసక్తికరంగా మారింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా.. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్.. జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట రాంజెఠ్మలానీ వ్యక్తిగతంగా పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్ ను సరైన బెంచ్ ముందు ప్రతిపాదించాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆయనకు సూచన చేసింది.

మరోవైపు.. యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్.. జేడీఎస్ లు వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం.. యడ్డి ప్రమాణస్వీకారాన్ని ఆపలేమని చెప్పింది. అయితే.. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరుపుతామని పేర్కొంది. యడ్డి ప్రమాణస్వీకారం తమ ఆదేశాల పరిమితులతో ఉంటుందని చెప్పింది. అదే సమయంలో.. గురువారం మధ్యాహ్నం రెండు గంటలలోపు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల లేఖను తమకు సమర్పించాలని పేర్కొంది. ఇలాంటి వేళ న్యాయకోవిదుడిగా సుపరిచితుడైన రాంజెఠ్మాలనీ వ్యక్తిగతంగా ఈ కేసులో ఇంప్లీడ్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. చూస్తుంటే.. ఈ కర్ణాటక వ్యవహారం మోడీషాలు అనుకున్నంత సులువుగా ఒక కొలిక్కి వచ్చేటట్లుగా కనిపించటం లేదని చెప్పక తప్పదు.