వర్మ...టీడీపీ నేతలను ఆడేసుకుంటున్నాడే

Thu Oct 12 2017 23:14:19 GMT+0530 (IST)

అసలే రాంగోపాల్ వర్మ. తనకే మాత్రం సంబంధం లేని విషయం అయినప్పటికీ.... స్పందించి మరీ...ఎదుటివారి ఓపికను పరీక్షించే టైపు అనే టాక్ కలిగి ఉన్న దర్శకుడు. అలాంటి వ్యక్తిని...ఆయన ఇష్టపడి మరీ చేస్తున్న ప్రాజెక్టు విషయంలో....కెలికితే ఇంకేమైనా ఉంటుందా?  పైగా వర్మకు `హితబోధ` చేయాలని చూడటం అంటే...పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరైనా గెస్ చేయగలరు. అలా గెస్ చేశారో లేదో తెలియదు కానీ....తెలుగుదేశం నేతలు మాత్రం వర్మకు ఉచిత సలహాలు ఇచ్చి - ఇరకాటంలో పడిపోతున్నారు.టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గురించి ``లక్ష్మీస్ ఎన్టీఆర్`` పేరుతో సినిమా తీయనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానమని పేర్కొంటూ ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ వివరిస్తూ సినిమా ఉంటుందని ప్రకటించారు. కొద్దికాలం తర్వాత వైసీపీ నేత ఒకరు ప్రొడ్యూసర్ అని వెల్లడించారు. ఇంకేం...టీడీపీ నేతలు వర్మపై విరుచుకుపడ్డారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి మంత్రి హోదాలో ఉన్నవారు కూడా ఆర్జీవీపై అంతెత్తున ఎగిరిపడ్డారు. అయితే వర్మ ఇలాంటి వాటికి తొణికే టైపు కాదు కదా! టీడీపీ మంత్రికి తనదైన శైలిలో రిప్లై ఇచ్చేశాడు!!

అయితే ఇక్కడితోనే ఆగిపోలేదు. గత కొద్దికాలంగా టీడీపీలో తనదైన శైలిలో గళం విప్పుతున్న మహిళా ఎమ్మెల్యే అనిత వర్మపై కామెంట్లు చేశారు. దీంతో మంత్రికి రిప్లై ఇచ్చిన తాను ఎమ్మెల్యేకు ఎందుకు స్పందించాలి అని వర్మ ఊరుకోలేదు. తాపీగా టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చాడు. అది కూడా ముక్తసరిగా...మూడు ముక్కల్లో తేల్చేశాడు అనుకోకండి... సవివరంగా...ప్రతి పాయింట్ పై వర్మ స్పందించాడు. ఆ సంభాషణ పర్వాన్ని తన ఫేస్ బుక్ అకౌంట్లో కూడా పోస్ట్ చేశాడు. ఇదిగో ఇదే ఆ వివరణ...

టీడీపీ ఎమ్మెల్యే అనిత గారికి నా సమాధానాలు:

టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ పైన వర్మ తీస్తున్న సినిమాలో చరిత్రను వక్రీకరించవద్దు

అనిత గారు బయట తెలిసిన చరిత్ర వెనుక లోపలి అసలు చరిత్ర చూపించడమే నా అసలు సిసలు ఉద్దేశం

టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ మహానుభావుడు...ఆయన పేదలకు ప్రజలకు చేసిన మంచిని వర్మ తన సినిమాలో చూపించాలి.

అనితగారు ఈ సినిమా బయోపిక్ కాదు..కేవలం లక్ష్మి పార్వతి గారు ఆయన జీవితం లో ప్రవేశించినప్పటినుంచీ తుది వరకూ

టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసిన టీడీపీ కార్యకర్తలు - ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు.

అనితగారు ఇలాంటి వార్నింగ్ లు టీడీపీ పుట్టకముందునుంచి విని విని విసుగెత్తిపోయాను

టీడీపీ ఎమ్మెల్యే అనిత: రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకే..వైసీపీ నేతలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నట్లు ఉంది..

లోగుట్టు పెరుమాళ్ళకెరుక

టీడీపీ ఎమ్మెల్యే అనిత:

చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటే...బ్రతికి ఉన్న జగన్ పైన కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారు..జగన్ జీవిత చరిత్ర ప్రజలకు సినిమా రూపంలో చూపిస్తే..ఆయన పాదయాత్ర కూడా చెయ్యలేరు..

అనితగారు మీరు సూపరు ..నాకు తెలిసి ఇలాంటి స్క్రిప్ట్ ఐడియా షోలే రైటర్ సలీమ్ జావేద్ కి కాని బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా వచ్చిఉండదు

టీడీపీ ఎమ్మెల్యే అనిత: మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి... అదే సమజాహితo

ఆహా క్లాప్సు విజిల్స్ !!!