Begin typing your search above and press return to search.

బీజేపీకి షాకిచ్చిన సీనియ‌ర్ నేత‌!

By:  Tupaki Desk   |   18 July 2018 4:20 PM GMT
బీజేపీకి షాకిచ్చిన సీనియ‌ర్ నేత‌!
X
త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతోన్న సార్వ‌త్రిక ఎన్నికల నేప‌థ్యంలో దేశ రాజ‌కీయాలు ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. అక్టోబ‌రులోనే కేంద్రం జ‌మిలి ఎన్నిక‌లకు సిద్ధ‌మ‌వుతోంద‌న్న ఊహాగానాలు కూడా వెలువ‌డుతున్న నేప‌థ్యంలో అన్ని పార్టీలు...అస్త్రశ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. కేంద్రంలో మ‌రోసారి అధికారం చేప‌ట్టేందుకు బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంది. అయితే, దేశ‌వ్యాప్తంగా బీజేపీకి వ్య‌తిరేక‌త పెర‌గ‌డం...క‌ర్ణాట‌క‌లో అధికారం చేప‌ట్టేందుకు బీజేపీ చేసిన కుటిల రాజ‌కీయం వంటి ప‌రిణామాల‌తో బీజేపీపై నెగెటివ్ వైబ్స్ వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా బీజేపీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. బీజేపీ కురువృద్ధుడు - సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి అత్యంత స‌న్నిహితుడైన రాజ్యసభ మాజీ ఎంపీ చందన్ మిత్రా బీజేపీకి గుడ్‌ బై చెప్పి షాకిచ్చారు. అంతే కాకుండా - త్వరలోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమత స‌మ‌క్షంలో తృణమూల్ కాంగ్రెస్‌ (టీఎంసీ)లో చేరేందుకు చంద‌న్ మిత్రా రెడీ కావ‌డంతో బీజేపీకి డ‌బుల్ షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.

తాజాగా ప‌శ్చిమ బెంగాల్ లో ప‌ర్య‌టించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ .....అక్క‌డ సెటిల్మెంట్ రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప‌ర్య‌ట‌న ముగించుకున్న కొద్ది గంట‌ల్లోనే చందన్ మిత్రా....బీజేపీ షాకివ్వ‌డం ఇపుడు హాట్ టాపిక్ అయింది. మంగళవారంనాడు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కు చంద‌న్ తన రాజీనామా లేఖ పంపినట్టు తెలుస్తోంది. ఈ నెల 21న దీదీ స‌మ‌క్షంలో ఆయన టీఎంసీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. జూలై 21న టీఎంసీ ‘షాహిద్ దివస్’ (అమరవీరుల దినోత్సవం) సంద‌ర్భంగా ఆయ‌న టీఎంసీలో చేరనున్నట్టు తెలుస్తోంది. అయితే, మోదీ-షాల‌ నాయకత్వంలో తనకు త‌గిన‌తం ప్రాధాన్య‌త ద‌క్కడం లేద‌న్న కార‌ణంతోనే మిత్రా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు - `పయనీర్` దినపత్రిక సంపాదకుడైన మిత్రా..... 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఆ త‌ర్వాత 2010 జూన్ లో మరోసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే, కొంత‌కాలంగా...మోదీ - షా ల ఆధ్వ‌ర్యంలో బీజేపీ అనుస‌రిస్తోన్న తాజా విధానాలపై బహిరంగంగానే త‌న అసమ్మతిని మిత్రా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే బీజేపీకి ఆయ‌న గుడ్ బై చెప్పారు.