రాజ్యసభకు హరిబాబు... బీజేపీ ఫ్యూచర్ లెక్కేంటంటే?

Sat Jun 15 2019 18:51:17 GMT+0530 (IST)

దక్షిణాదిలో పాదం మోపుదామంటూ బీజేపీ చేస్తున్న ఏ యత్నమూ వర్కవుట్ కాలేదు. అప్పుడెప్పుడో కర్ణాటకలో కాస్తంత ప్రభావం చూపిన బీజేపీ... ఆ తర్వాత ఆ రాష్ట్రంలో అంతకంతకూ బలోపేతమైనా... మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఆ పార్టీకి అంతగా కలిసి రావట్లేదు. తాజా ఎన్నికల్లో తెలంగాణలో సింగిల్ గానే పోటీ చేసి ఏకంగా నాలుగు సీట్లు గెలిచిన బీజేపీ... కేరళ తమిళనాడులతో పాటు నవ్యాంధ్రలోనూ సింగిల్ సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఏపీలో అయితే ఆ పార్టీ పరిస్థితి మరీ ఘోరమేనని చెప్పాలి. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్పించి ఆ పార్టీకి ఒకటో రెండో సీట్లు వచ్చే పరిస్థితి. తాజా ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు టీడీపీకి చావుదెబ్బ తగలగా... బీజేపీకి కూడా అంతే స్థాయిలో షాక్ తగిలింది.మరి 2024లో అయినా ఏపీలో కాలు మోపాలి కదా. ఎక్కడ ప్రవేశం దక్కలేదో అక్కడే కీలక దృష్టి సారిస్తున్న కమలనాథులు... ఇప్పుడు ఏపీపైనా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా 2024 ఎన్నికల్లో ఏపీలో ఓ మోస్తరు సీట్లను సాధించి తీరాలన్న లక్ష్యంతో పక్కా ప్రణాళిక రచించుకున్న బీజేపీ దానిని అమల్లో పెట్టేందుకు సిద్దమైపోయింది. ఈ ప్లాన్ లో భాగంగానే పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబుకు రాజ్యసభ సీటు ఇస్తున్నారట. త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఓ స్థానాన్ని హరిబాబుకు కేటాయించేందుకు పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుందట.

అయినా హరిబాబుకు రాజ్యసభ సీటివ్వడం ద్వారా బీజేపీకి కలిసివచ్చేదేమిటన్న విషయానికి వస్తే... హరిబాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కదా. హరిబాబుకు రాజ్యసభ సీటివ్వడం ద్వారా ఆ సామాజిక వర్గంలోని కీలక నేతలను తనవైపునకు తిప్పుకునేందుకు బీజేపీకి సులువు అవుతుంది. అంతేకాకుండా వైసీపీ దెబ్బకు టీడీపీ చితికిపోతే....టీడీపీలోని కీలక నేతలు ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నేతలు ప్రత్యామ్నాయం దిశగా చూస్తున్నారు. ఇలాంటి వారందరినీ లాగేసుకోవడం ద్వారా ఏపీలో బలపడాలని బీజేపీ యోచిస్తోంది. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కమ్మ నేతలను లాగేసుకోవడం ద్వారా 2024 ఎన్నికల్లో హీనపక్షం 20 నుంచి 25 ఎమ్మెల్యే సీట్లతో పాటు రెండు మూడైనా ఎంపీ సీట్లను గెలవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మరి ఈ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.