Begin typing your search above and press return to search.

చేదునిజాలు: క్రైమ్ ఇన్ ఇండియా - 2015

By:  Tupaki Desk   |   31 Aug 2016 4:06 AM GMT
చేదునిజాలు: క్రైమ్ ఇన్ ఇండియా - 2015
X
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమా.. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశమా.. అత్యధిక ధనవంతులున్న దేశమా.. ఇలాంటి సంగతులు కాసేపు పక్కనపెడితే... క్రైమ్ విషయంలో మాత్రం బాగానే అభివృద్ధిని సాధిస్తుంది. మహిళలపై లైంగిక దాడులు - దళితులపై దాడులు.. ఈ విషయాల్లో భారతదేశం అభివృద్ధిచెందుతూనే ఉంది! ఈమేరకు గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన నేరాలను గమనిస్తే చాలా విషయాలు తెలుస్తాయి.. దానితోపాటు భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూ..... ఉన్న దేశంగానే ఎందుకు ఉందో అనే విషయాలకు కూడా కొన్ని కారణాలు కూడా తెలియ్యొచ్చు.

2015 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన నేరల వివరాలతో కూడిన "క్రైమ్ ఇన్ ఇండియా - 2015" వార్షిక నివేదికను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ విడుదల చేశారు. దీనికోసం 29 రాష్ట్రాలు - 7 కేంద్రపాలిత ప్రాంతాలు - 10 లక్షలకు పైగా ఉన్న సుమారు 53 మెగాసిటీల నుంచి సేకరించిన వివరాలతో జాతీయ నేరనమోదు బ్యూరో తాజాగా తన 69వ ఎడిషన్ లో ఈ విషయాలను ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం.. గతఏడాది దేశంలో 34,600 రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో అత్యధిక లైంగిక దాడులు జరిగిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ముందునిలవగా.. కేంద్రపాలిత ప్రాంతాల్లో దేశ రాజధానికి ఆ స్థానం వచ్చింది.

దేశవ్యాప్తంగా నమోదైన 34,600 కేసుల్లో 4,391 రేప్ కేసులతో మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో ఉండగా.. 2,199 రేప్ కేసులతో ఢిల్లీ కేంద్రప్రాంత పాలితాల్లో మొదటిస్థానంలో ఉంది. ఇక రాష్ట్రాల విషయంలో మధ్యప్రదేశ్ తర్వాత 4,144 రేప్ కేసులతో మహారాష్ట్ర, 3,644 కేసులతో రాజస్థాన్ - 3,025 కేసులతో ఉత్తర ప్రదేశ్ లు నిలిచాయి. ఇక ఈ విషయంలో తెలంగాణలో 1105 - ఆంధ్రప్రదేశ్ లో 1027 రేప్ కేసులు నమోదయ్యాయి.

ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా జరిగిన దళితులపై దాడుల విషయంలో యూపీ 8,358 దాడికేసులతో మొదటిస్థానంలోనూ - ఆ తర్వాత రాజస్థాన్ (6998) - బీహార్ (6438) లు రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ 4415 దాడులతో నాలుగోస్థానంలో నిలబడింది. ఈ రికార్డు ఆంధ్రప్రదేశ్ లో దళితుల పరిస్థితి చెప్పకనే చెబుతున్నాయి!