Begin typing your search above and press return to search.

పాక్‌ తో యుద్ధ‌మే!.. రాజ్‌ నాథ్ మాటే సాక్ష్యం!

By:  Tupaki Desk   |   23 Feb 2019 4:18 AM GMT
పాక్‌ తో యుద్ధ‌మే!.. రాజ్‌ నాథ్ మాటే సాక్ష్యం!
X
పుల్వామా ఉగ్ర దాడి... దాయాదీ దేశాల మ‌ధ్య యుద్ధానికి రంగం సిద్ధం చేసింద‌నే చెప్పాలి. పాకిస్థాన్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న జైషే మొహ్మ‌ద్ ర‌చించిన వ్యూహాన్ని అమ‌లు చేసిన ఓ ఉగ్ర‌వాది పుల్వామాలో భార‌త సైనిక కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మ‌రింత మంది గాయ‌ప‌డ్డారు. భారీ ప్రాణ న‌ష్టం జ‌రిగిన నేప‌థ్యంలో ఉగ్ర‌వాదులు - వారికి ఆశ్రయం క‌ల్పిస్తున్న పాక్‌ కు గ‌ట్టిగా బుద్ది చెప్పాల్సిందేన‌ని భార‌తీయులంతా ఒక్క గొంతుకై నిన‌దిస్తున్నారు. దెబ్బ‌కు దెబ్బ తీసేస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు. మొన్న‌టి అఖిల‌ప‌క్ష భేటీ కూడా ఇదే వాద‌న‌ను ముక్త‌కంఠంతో వినిపించింది. ఈ క్ర‌మంలో పాక్‌పై మ‌రోమారు సర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్ప‌వ‌న్న వాద‌నా వినిపించింది. ఈ దిశ‌గా భార‌త సైన్యం కూడా యుద్ధానికి సిద్ధంగానే ఉన్నట్లు ప్ర‌క‌టించింది.

పుల్వామా దాడి త‌ర్వాత త‌న‌పై భార‌త్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌... భార‌త్ దాడి చేస్తే తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమంటూ మ‌రింత హీట్ పెంచేశారు. అంత‌టితో ఆగ‌ని పాక్‌... త‌న సైనికాధికారుల చేత కూడా ఘాటు వ్యాఖ్య‌లు చేయిస్తోంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. యుద్దానికి పాక్ సిద్ధంగా ఉంటే... భార‌త్ కూడా సిద్ధ‌మేన‌ని రాజ్ నాథ్ చాలా స్ప‌ష్టంగానే సంచ‌ల‌న ప్రక‌ట‌న చేశారు. ఈ నేప‌థ్యంలో ఇరు దేశాల మ‌ధ్య యుద్ధం త‌థ్య‌మేన‌న్న వాద‌న మ‌రింత‌గా బ‌లంగా వినిపిస్తోంది. పుల్వామా దాడి చేసింది జైషే ఉగ్ర‌వాద సంస్థే అయినా... దాడి వెనుక పాక్ గూఢ‌చార సంస్థ ఐఎస్ ఐ హ‌స్తం ఉంద‌న్న‌ది భార‌త వాద‌న.

భార‌త్‌పై ఇప్ప‌టిదాకా ఉగ్రవాదులు జ‌రిపిన ప్ర‌తి దాడిలోనూ ఐఎస్ ఐ హ‌స్తం ఉంద‌న్న కోణంలో ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో ఆధారాల‌ను కూడా సేకరించింది. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని ప‌ట్టించుకోకుండానే దొంగాట ఆడుతున్న ఐఎస్ ఐ.. ఉగ్ర‌వాదుల‌కు ఏకంగా శిక్ష‌ణ కూడా ఇస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు లేకపోలేదు. ఉగ్ర దాడిలో భారీ సంఖ్య‌లో సైనికుల ప్రాణాల‌ను కోల్పోయిన భార‌త్ కు ప్ర‌పంచ దేశాల‌న్ని మ‌ద్ద‌తుగా నిలుస్తుండ‌గా, పాక్ మాత్రం రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తుండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. వెర‌సి పాక్ వైఖ‌రి మార‌ద‌ని తేలిపోయింది కూడా. ఈ నేప‌థ్యంలో దుందుడుకు వైఖరికి గ‌ట్టిగానే బ‌దులు ఇవ్వాల‌న్న భావ‌న‌తోనే రాజ్ నాథ్ ఈ వ్యాఖ్య‌లు చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా ఇప్ప‌టికిప్పుడు కాకున్నా... త్వ‌ర‌లోనే భార‌త్‌ - పాక్ ల మ‌ధ్య యుద్దం త‌ప్ప‌ద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.