Begin typing your search above and press return to search.

అఫిషియ‌ల్ : పెర‌గ‌నున్న ఎమ్మెల్యే సీట్లు!

By:  Tupaki Desk   |   23 March 2017 5:51 AM GMT
అఫిషియ‌ల్ : పెర‌గ‌నున్న ఎమ్మెల్యే సీట్లు!
X
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాల సంఖ్య పెంచే విష‌యంలో రోజుకో వార్త తెర‌మీద‌కు వ‌స్తోంది. పార్లమెంటు సాక్షిగా నిన్నటికి నిన్న కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్‌ రాజ్‌ గంగారం లిఖితపూర్వకంగా ఓ ప్రకటన చేశారు. ఏపీ పునర్విభన చట్టం ప్రకారం తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలంటే 170(3) అధి కరణకు సవరణలు చేయడం తప్ప, మరో దారి లేదని, ఇందుకోసం 2026 దాకా ఆగాల్సిందేనని చెప్పారు. కానీ ఆ మ‌రుస‌టి రోజే హోం శాఖ బాస్ అయిన హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్ దానికి పూర్తి భిన్న‌మైన నిర్ణ‌యాన్ని వెల్లడించారు."రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభ స్థానాలు పెంపునకు సంబంధించిన బిల్లును ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రతిపాదించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు సాధ్యంకాని పక్షంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తప్పకుండా ప్రతిపాదిస్తాం’ అని రాజ్‌ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

అసెంబ్లీ సీట్లు పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చటం కోసం తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు - ఆంధ్ర సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవటం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేంద్రం సైతం త‌న మాట‌మార్చుకుంద‌ని అంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి రెండు రాష్ట్రాల శాసన సభల స్థానాల పెంపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణ శాసన సభ స్థానాల సంఖ్య 119 నుండి 153కు - ఆంధ్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రతిపాదించటం తెలిసిందే. ఇదిలావుంటే తెలంగాణలో అధికారంలోవున్న తెలంగాణ రాష్ట్ర సమితి - ఆంధ్రలో అధికారంలోవున్న తెలుగుదేశం అసెంబ్లీ స్థానాలు పెరిగే అంశాన్ని ఎరగాచూపించి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవటం తెలిసిందే. పాతవారితో పాటు కొత్తగా చేర్చుకున్న వారికి కూడా టికెట్లు కేటాయించాలంటే రెండు శాసన సభల సీట్లు పెంచక తప్పదు. అందుకే రెండు రాష్ట్రాల సీఎంలు అసెంబ్లీ స్థానాలు పెంచాలంటూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై పెద్దఎత్తున ఒత్తిడి తీసుకు వ‌స్తున్నాయి.

నిపుణుల అభిప్రాయాల ప్ర‌కారం సీట్ల పెంపు విష‌యంలో కేంద్రం ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి రాజ్యాంగంలోని 170 అధికరణకు సవరణ చేయడం. అది సాధ్యంకాని పక్షంలో ఏపీ విభజన చట్టాన్ని సవరించటం. రాజ్యాంగ సవరణ ప్రస్తుతం సాధ్యం కాదు కనుక విభజన చట్టాన్ని సవరించటం ద్వారా రెండు రాష్ట్రాల అసంబ్లీ సీట్లు పెంచేందుకు కేంద్రం సవరణ బిల్లును సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కేంద్రం రెండు శాసన సభల సీట్లు పెంచేందుకు సంబంధించిన నోట్‌ను త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో ఆమోదించిన అనంతరం, సవరణ బిల్లును పార్లమెంటు ముందుకు తేవొచ్చని చెబుతున్నారు. మ‌రోవైపు తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు రమణ - శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి తదితరులు ఢిల్లీలో రాజ్‌ నాథ్‌ సింగ్‌ ను కలిసి రెండు రాష్ట్రాల శాసన సభల స్థానాలు పెంచే పక్షంలో తెలంగాణలోని పాత జిల్లాల ఆధారంగానే కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జిల్లాల సంఖ్యను 31 పెంచటం గురించి ప్రస్తావిస్తూ కొత్త జిల్లాల ఆధారంగా నియోజకవర్గాలను ఏర్పాటు చేయటం వలన పలు సమస్యలు వస్తాయని రాజ్‌ నాథ్‌ సింగ్‌ కు వివరించారు. తెలంగాణలోని పాత జిల్లాల ఆధారంగానే కొత్త నియోజకవర్గాల ఏర్పాటు చేపట్టటం మంచిదని వారు కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/