Begin typing your search above and press return to search.

ఏం సాధించలేరన్న టీచర్ మాటకు అతగాడేం చేశాడంటే?

By:  Tupaki Desk   |   23 Sep 2019 5:31 AM GMT
ఏం సాధించలేరన్న టీచర్ మాటకు అతగాడేం చేశాడంటే?
X
సాధించాలంటే అసాధ్యమైనది ఏమీ ఉండదు. వయసు అస్సలు అడ్డంకి కాదన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు 72 ఏళ్ల రాజ్ కుమార్ సింగ్లా. టీచర్ అన్న ఒక మాటను సవాల్ గా తీసుకొని అతగాడు సాధించిన ఘనతకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా తలవంచింది. ఇంతకీ ఆయన సాధించిందేమిటో తెలుసా? ఏకంగా 15 మాస్టర్స్ డిగ్రీలను సొంతం చేసుకోవటం.

అదెలా సాధ్యమైందన్న విషయంలోకి వెళితే.. పంజాబ్ లోని పటియాలా పరిధిలోని ఘుగ్గా గ్రామానికి చెందిన పెద్దాయన రాజ్ కుమార్ సింగ్లా. దాదాపు యాభై ఏళ్ల క్రితం ఆయనతో ఒక పంజాబీ టీచర్ ఒక మాట అనేశారు. హిందీ వాళ్లు ఏమీ సాధించలేరన్నారు. దీనికి హర్ట్ అయ్యాడు రాజ్ కుమార్. తన టీచర్ అన్న మాటను సవాల్ గా తీసుకున్న ఆయన.. 15 సబ్జెక్టులలో ఏంఏ డిగ్రీలు పూర్తి చేశారు.

దీంతో ఆయన పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో మాత్రమే కాదు.. గిన్నీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ నమోదైంది. ఈ రెండింటితో పాటు యూనిక్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చేరింది. పంజాబ్.. ఇంగ్లిషు భాషల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన.. పంజాబీలో 11.. హిందీలో ఒకటి.. ఇంగ్లిషులో మూడు ఏంఏలు చేయటం విశేషం.

ఈ పదిహేను మాస్టర్స్ డిగ్రీల్లో హిందీ.. పంజాబీ.. హిస్టరీ.. రాజనీతి శాస్త్రం.. పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్.. ఎంఎడ్.. సామాజిక శాస్త్రం.. ఫిలాసఫీ.. డిఫెన్స్ అండ్ స్ట్రాజిక్ స్టడీ.. సిక్కు శాస్త్రం.. ఎడ్యుకేషన్.. మానవహక్కులు.. ఎంఫిల్ తదితరాలు ఉన్నాయి. తన తొలి మాస్టర్స్ ను 1977లో పూర్తి చేసిన ఆయన.. తాజాగా 15మాస్టర్స్ డిగ్రీల్ని పూర్తి చేశారు. తనకింకా చదవాలని ఉందని.. ఉమెన్ స్టడీస్ లో ఎంఏ పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. ఆరోగ్యం సహకరించకపోవటంతో తన పదహారో మాస్టర్స్ చేయలేకపోతున్నట్లు పేర్కొన్నాడు. వయసు మీదకు వచ్చినా.. కాంక్ష తగ్గకుంటే ఇలానే ఉంటుంది మరి. అంత వయసులోనే అంత కసిగా ఉన్న రాజ్ కుమార్ సింగ్లా ఈ తరానికి అసలుసిసలు స్ఫూర్తిదాతగా చెప్పక తప్పదు.