Begin typing your search above and press return to search.

జ‌ల్లిక‌ట్టు వివాదం..రజినీ ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి

By:  Tupaki Desk   |   23 Jan 2017 1:05 PM GMT
జ‌ల్లిక‌ట్టు వివాదం..రజినీ ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి
X
త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా మారాయి. చెన్నై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాకాండ చెలరేగడంతో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెరీనా బీచ్‌ నుంచి ఉద్యమకారులను వెళ్లగొట్టేందుకు పోలీసు చర్య చేపట్టడంతో అసంతృప్తి నెల‌కొనడం విద్వంసం రేగింది. పోలీస్ స్టేషన్ సహా, పలు వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు. ఈ నేప‌థ్యంలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రంగంలోకి దిగారు. త‌మిళ‌నాడు వాసులను ఉద్దేశిస్తూ బ‌హిరంగ లేఖ రాశారు.

అసాంఘిక శ‌క్తులు ఉద్య‌మంలోకి చేరాయ‌ని - ఇలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డి చెడ్డ‌పేరు తీసుకురావాల‌ని చూస్తున్న‌ట్లు ర‌జ‌నీ ఆ లేఖ‌లో పేర్కొన్నారు. ఆందోళ‌న విర‌మించాల‌ని కోరారు. లేనిప‌క్షంలో ఉద్య‌మంపై చెడు అభిప్రాయం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని ఇది అంద‌రికీ ఇబ్బందిక‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. అందుకే అంద‌రూ సంయ‌మ‌నం పాటించాల‌ని, శాంతియుతంగా త‌మ డిమాండ్ల‌ను వినిపించాల‌ని ర‌జినీ సూచించారు.

కాగా...మెరీనా బీచ్‌ లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌డుతున్న ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. జ‌ల్లిక‌ట్టుపై నిషేధాన్ని శాశ్వ‌తంగా ఎత్తివేయాలంటూ ఆందోళ‌న‌కారులు నిర‌స‌న కొన‌సాగిస్తున్నారు. ఉద‌యం అయిదు గంట‌ల స‌మ‌యంలో పోలీసులు నిర‌స‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు ప్ర‌య‌త్నించారు. పోలీసుల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో అనేక‌మంది గాయ‌ప‌డ్డారు. మాన‌వ‌హారంగా నిలిచిన ఆందోళ‌న‌కారులు పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. టియ‌ర్ గ్యాస్‌ - లాఠీల‌తో నిర‌స‌న‌కారుల‌ను కంట్రోల్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. జ‌ల్లిక‌ట్టుపై నిషేధాన్ని ఎత్తివేయ‌కుంటే, గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఆందోళ‌న‌కారులు పిలుపునిచ్చారు. మ‌ధురై స‌మీపంలోని అలంగ‌నూర్‌ లో ఆందోళ‌న‌కారుల‌కు, పోలీసుల‌కు ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. మెరీనా బీచ్‌ లో ఉన్న ఐస్ హౌజ్ పోలీస్ స్టేష‌న్‌ కు నిర‌స‌న‌కారులు నిప్పుపెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. కోయంబ‌త్తూర్‌ లో మీనాక్షి హాల్ ద‌గ్గ‌ర వంద మందిని అరెస్టు చేశారు.

మ‌రోవైపు జ‌ల్లిక‌ట్టు అంశంపై చ‌ర్చించేందుకు త‌మిళ‌నాడు అసెంబ్లీ ప్ర‌త్యేక‌ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని ప్ర‌తిప‌క్షాలు అడ్డుకున్నాయి. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని వ్య‌తిరేకిస్తూ డీఎంకే పార్టీ వాకౌట్ చేసింది. శాంతియుతంగా నిర‌స‌న చేప‌డుతున్న ఆందోళ‌న‌కారుల‌పై అన్యాయంగా ప్ర‌భుత్వం లాఠీచార్జ్ చేసింద‌ని క‌నిమొళి ఆరోపించారు. జ‌ల్లిక‌ట్టుపై శాశ్వ‌త ప‌రిష్కారం కావాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఆదివారం జల్లికట్టు సంబరాలు తమిళనాడులో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సంబరాల్లో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తున్నది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/