Begin typing your search above and press return to search.

రజినీకి ఆ సత్తా ఉందా?

By:  Tupaki Desk   |   2 Jan 2018 5:11 PM GMT
రజినీకి ఆ సత్తా ఉందా?
X
మొత్తానికి సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేశాడు. త్వరలోనే పార్టీ పెట్టబోతున్నట్లు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకూ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఆయన ఈ ప్రకటన చేయగానే అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. రెండు దశాబ్దాల కిందట్నుంచే రజినీ రాజకీయారంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. రజినీ రాజకీయాల్లో రావాలంటూ ఎన్నోసార్లు ఎంతగానో ఒత్తిడి తెచ్చారు ఫ్యాన్స్. కానీ రజినీ వారి ఒత్తిడికి తలొగ్గకుండానే నెట్టుకొచ్చాడు. చివరికి ఇప్పుడు రాజకీయ గోదాలోకి దిగేశాడు. ఐతే రజినీ రాజకీయ నేతగా ఏమేరకు విజయవంతమవుతాడు.. ఆయన వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎం కుర్చీ ఎక్కగలరా.. అన్నది ఆసక్తికరం.

దేశంలో సినిమా వాళ్లు అత్యధికంగా రాజకీయాల్ని ప్రభావితం చేసిన రాష్ట్రం తమిళనాడే. ఒక రకంగా చెప్పాలంటే అక్కడి రాజకీయాలు ఎప్పుడూ సినీ తారల చుట్టూనే తిరుగుతాయి. ప్రస్తుతం తమిళనాట అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో రజినీకాంతే. ఆ లెక్కన చూసుకుంటే అధికారంలోకి రావడానికి ఆయనకు మంచి అవకాశాలు ఉన్నట్లే భావించాలి. కానీ రజినీని వెనక్కి లాగే కారణాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రజినీ వయసు.. ఆరోగ్యం గురించి. ప్రస్తుతం రజినీ వయసు 67. గత దశాబ్ద కాలం నుంచి ఆయన ఆరోగ్యం ఏమంత బాగా లేదు రెండు మూడుసార్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నెలల తరబడి ఆసుపత్రిలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఐతే ఎలాగోలా కోలుకుని మళ్లీ మామూలు మనిషి అయినా.. ఆయన పూర్తి ఆరోగ్యంలో మాత్రం లేరన్నది సన్నిహితుల సమాచారం. తమిళనాట ఎన్నికలు వచ్చేసరికి రజినీ 70వ పడిలో ఉంటారు. ఆ వయసులో.. తాను ఉన్న ఆరోగ్య స్థితిలో ఎన్నికల ప్రచారం కోసం ఎండలో వెళ్లి ఒక బహిరంగ సభలో పాల్గొనగలరా అన్నది.. రాష్ట్రమంతటా తిరగగలరా అన్నది ప్రశ్నార్థకం. తొలిసారి పార్టీ పెట్టినపుడు విస్తృతంగా తిరగాల్సి ఉంటుంది. జనాల్ని కలవాల్సి ఉంటుంది. అప్పుడే విజయావకాశాలు మెరుగవుతాయి.

ఇక రజినీకి ఉన్న మిగతా ప్రతికూలతల విషయానికి వస్తే.. 2004 ఎన్నికల సమయంలో పీఎంకేకు ఓటేయకండి.. బీజేపీని గెలిపించండి అంటూ రజినీ చేసిన ప్రకటన ఎలాంటి ఫలితం ఇవ్వని సంగతి గుర్తుంచుకోవాలి. రజినీ శాసించాడు.. అభిమానులు పాటించలేదు అంటూ అప్పట్లో మీడియాలో వ్యంగ్యపు వార్తలు కూడా వచ్చాయి. రజినీకి ఎంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఆయన రాజకీయంగా ఎంత మేరకు విజయవంతం కాగలడో అన్న సందేహాలు అప్పుడే కలిగాయి. స్వతహాగా తమిళుడు కాకపోవడం రజినీకి ఉన్న మరో ప్రతికూలత. ఈ విషయంలో ఇప్పటికే వ్యతిరేక గళాలు మొదలయ్యాయి. ఆయన పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి మద్దతుదారు అని.. లోపాయకారీగా మోదీతో ఒప్పందం చేసుకున్నారని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. తనది ఆధ్యాత్మిక భావజాలం ఉన్న పార్టీ అని రజనీ అనడంతో ఈ ఊహాగానాలకు కొంత బలం చేకూరింది. భాజపా మీద తమిళనాడు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందన్నది మొన్నటి ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లోనే స్పష్టమైంది. ఇది కూడా రజినీకి ప్రతికూలం కావచ్చు. ఇక రజినీ రాజకీయ పరిజ్ఞానం.. వివిధ అంశాలపై అవగాహన స్థాయి మీదా సందేహాలు లేకపోలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాలపై మాట్లాడింది లేదు.

రజినీ వీరాభిమానుల్లో ఎక్కువమంది పెద్ద వయస్కుల వాళ్లే. ఇప్పటి యువత రజినీ క్రేజ్‌.. ఆయన సినిమాలు రిలీజైనపుడు ఉండే హిస్టీరియాను ఇష్టపడుతుందే తప్ప ఆయన్ని వ్యక్తిగతంగా ఏమేరకు ఇష్టపడుతుందో అన్న సందేహాలూ ఉన్నాయి. ఇప్పటి యువతకు దూకుడుగా ఉండే రాజకీయ నాయకులు ఇష్టం. రజినీ ఎప్పుడూ చాలా మెతకే. ఎన్నడూ వివాదాల జోలికి వెళ్లడు. ఎవరినీ ఒక మాట అనలేడు. తెరమీద ఎంత ఫెరోషియస్ గా కనిపించినా.. బయట మెతక అనే అభిప్రాయం ఉంది. రాజకీయాల్లో అసలీ మెతక వైఖరే పనికి రాదు. కమల్ హాసన్ లాగా దూకుడుగా ఉండాలని.. ఘాటు వ్యాఖ్యలు.. విమర్శలు చేయాలని ఆశిస్తారు జనం కూడా. రజినీ ఒక్కడిగా రాజకీయ రణరంగంలోకి దిగితే వేరుగా ఉండేది కానీ.. కమల్ కూడా పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. రజినీతో సమానంగా ఓట్లు రాబట్టగల సామర్థ్యం కమల్ కు ఉంది. సినిమాల్లో కమల్ కన్నా రజినీ ఓ మెట్టు పైన ఉండొచ్చు కానీ.. రాజకీయ నాయకుడిగా మెతకగా ఉండే రజినీ కంటే దూకుడుగా ఉంటున్న కమలే ఎక్కువ విజయవంతం కాగలరని ఒక అంచనా. ఆరోగ్యం.. స్థానికత.. విజయ-రాజకీయ పరిజ్ఞానం.. ఇలాంటి విషయాల్లో రజినీ కంటే కమల్ ఓ మెట్టు పైనే ఉంటాడు. ఐతే రజినీ-కమల్ వచ్చే ఎన్నికల సందర్భంగా ఎలా వ్యవహరిస్తారు.. వ్యక్తిగతంగా మంచి మిత్రులైన వీళ్లిద్దరూ రాజకీయంగా కూడా స్నేహం చేస్తారా.. అన్న విషయాల్ని బట్టి సమీకరణాలన్నీ మారొచ్చన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.